అంతర్జాతీయ సమాజానికి సీపీఐ విజ్ఞప్తి
న్యూదిల్లీ: గాజాలో ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణహోమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జాతీయ సమితి తీవ్రంగా ఖండిరచింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 18, 2025న గాజాపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల ఫలితంగా మహిళలు, పిల్లలు సహా 400 మందికి పైగా పలస్తీనియన్లు దుర్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్టోబర్ 7, 2023 నాటి నుండి పలస్తీనియన్ల మరణాల సంఖ్య 62 వేలు దాటింది. వీరిలో అత్యధికులు అమాయక పౌరులే. ఆందోళన కలిగిస్తున్న ఈ సంఖ్య… కొనసాగుతున్న సంఘర్షణ తీవ్రతకు నిదర్శనం. పలస్తీనియన్లపై జరిగిన మారణహోమంగా గుర్తించబడిరది. ఈ దారుణ మారణకాండను ఆపేలా ఇజ్రాయిల్‌ను కట్టడి చేయడానికి తక్షణ, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సీపీఐ అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పిలుపునిచ్చింది. ప్రపంచ సంస్థల నిరంతర నిష్క్రియాపర్వం, మౌనం… దురాక్రమణదారుడి (ఇజ్రాయిల్)ని ప్రోత్సహించడమే కాకుండా అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలను కూడా క్షీణింపజేస్తోంది. ఈ తీవ్రమైన సమస్యపై భారత ప్రభుత్వం మౌనం కొనసాగించడం పట్ల తీవ్ర నిరాశ చెందుతున్నట్లు తెలిపింది. న్యాయం, వలసవాద వ్యతిరేక పోరాటం పట్ల చారిత్రక నిబద్ధత కలిగిన భారతదేశం… పలస్తీనా ప్రజల దుస్థితి పట్ల ఉదాసీనంగా ఉండకూడదు. భారత ప్రభుత్వం తన మౌనాన్ని వీడాలి. కొనసాగుతున్న హింసను ఖండిరచాలి. పలస్తీనాకు మద్దతు ఇవ్వాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది. స్వేచ్ఛ, న్యాయం, స్వయం నిర్ణయాధికారం కోసం పలస్తీనా ప్రజలకు అచంచల సంఫీుభావంగా నిలుస్తామని ప్రకటించింది. పలస్తీనా ప్రజలకు తమ మద్దతు, సంఫీుభావం తెలియజేయాలని భారత ప్రజలను సీపీఐ కోరింది.