Homeజాతీయంఎట్టకేలకు మణిపూర్‌కు మోదీ

ఎట్టకేలకు మణిపూర్‌కు మోదీ

- Advertisement -

. జాతుల ఘర్షణల తర్వాత తొలిసారి ఈశాన్య రాష్ట్రానికి…
. 3గంటల పర్యటనతో ఏం సాధిస్తారంటూ కాంగ్రెస్‌ విమర్శ

ఇంఫాల్‌: జాతుల మధ్య ఘర్షణలతో రావణకాష్టంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. జాతుల ఘర్షణలు ప్రారంభమై రెండున్నరేళ్లు గడిచినప్పటికీ మోదీ అక్కడ పర్యటించకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ పర్యటనపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మణిపూర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్‌ కుమార్‌ గోయల్‌… శనివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రధాని చురాచంద్‌పూర్‌లో ఘర్షణల్లో నిరాశ్రయులైన వారిని కలుసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం రూ.7వేల 300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. అనంతరం పీస్‌గ్రౌండ్‌లో మణిపూర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు. తర్వాత రాజధాని ఇంఫాల్‌ వెళ్లి అక్కడ రూ.12 వందల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మైతేయ్‌-కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో చురాచంద్‌పుర్‌ తీవ్రంగా నష్టపోయింది. 260 మందికి పైగా ఇక్కడ మృతిచెందగా… వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. సెప్టెంబర్‌ 13-15 మధ్య మోదీ మిజోరాం, మణిపూర్‌, అసోం, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లలో పర్యటిస్తారు. కాగా మోదీ మణిపూర్‌ పర్యటనను కాంగ్రెస్‌ విమర్శించింది. ఇప్పటికైనా మోదీ పర్యటించడం సంతోషించదగ్గ విషయమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అయితే ఇన్నేళ్లు రణరంగంగా మారిన మణిపూర్‌లో మోదీ కేవలం 3 గంటలు మాత్రమే పర్యటించడం ఆ రాష్ట్రాన్ని అవమానించడమే అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు. మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కీషమ్‌ మేఘచంద్ర ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ… ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను నేను కేవలం ప్రచారం కోసమేనని భావిస్తున్నాను. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న నిరాశ్రయులైన వ్యక్తులతో సహా నెలల తరబడి బాధపడుతున్న ప్రజలు శాంతి, పునరావాసం , న్యాయం కోసం ఒక నిర్దిష్ట రోడ్‌మ్యాప్‌ను ఆశిస్తున్నారు’’ అన్నారు. ఈ పర్యటన రాష్ట్రంలో శాంతి, న్యాయం తీసుకురావడానికి సంబంధించినదని వారు తెలియజేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రధాని మోదీ ఇక్కడ అన్నివర్గాల వారితో చర్చించేందుకు సమయం కేటాయించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మణిపూర్‌కు చెందిన ఏకైక రాజ్యసభ సభ్యుడు లీషెంబా సనాజోబా మోదీ పర్యటనను అదృష్ట క్షణంగా అభివర్ణించారు. ‘‘మోదీ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వినడం గొప్ప అదృష్టం… మణిపూర్‌లో గతంలో హింసాత్మక ఘర్షణల చరిత్ర ఉంది… ఇలాంటి సమయాల్లో ఏ ప్రధానమంత్రి కూడా రాష్ట్రాన్ని సందర్శించి ప్రజల మాట వినలేదు’’ అని చెప్పుకొచ్చారు. కాగా, జాతీయ రహదారులపై ప్రయాణించే మెయితీల భద్రతను నిర్ధారించేలా ప్రధానమంత్రి అధికారులను ఆదేశించాలని ఇమాగి మెయిరా అనే మహిళా బృందం డిమాండ్‌ చేసింది. ప్రముఖ కుకి-జో గ్రూపులు ప్రధాని మణిపూర్‌ సందర్శనను స్వాగతించాయి. హింస కారణంగా మణిపూర్‌లో ఇప్పటివరకు 260 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు.
ప్రధాని పర్యటన వేళ బీజేపీకి భారీ షాక్‌.. 43 మంది నేతల రాజీనామా
మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉఖ్రుల్‌ జిల్లాలోని ఫుంగ్యార్‌ నియోజకవర్గంలో43 మంది స్థానిక నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని రాజీనామా చేసిన నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్గత సంప్రదింపులు, కలుపుగోలుతనం లోపించాయని, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఏమాత్రం గౌరవించడం లేదని వారు ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగలేమని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వారిలో ఫుంగ్యార్‌ మండల అధ్యక్షుడు, మహిళా, యువ, కిసాన్‌ మోర్చాల అధ్యక్షులు, కొందరు బూత్‌ స్థాయి అధ్యక్షులు కూడా ఉన్నారు.
ఈ మూకుమ్మడి రాజీనామాలపై మణిపూర్‌ బీజేపీ రాష్ట్ర విభాగం తీవ్రంగా స్పందించింది. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్‌ అని, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవుంగ్‌ షిమ్రే హోపింగ్‌సన్‌ కొట్టిపారేశారు.
‘‘రాజీనామా చేసిన వ్యక్తులు 2022 అసెంబ్లీ ఎన్నికల నుంచే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈ చర్యకు పాల్పడ్డారు’’ అని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు