పాకిస్థాన్‌లో శనివారం ఉదయం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలోని పలు కీలక వైమానిక స్థావరాలపై భారీ పేలుళ్లు సంభవించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు భారత స్థావరాలపై పాకిస్థాన్ సైనిక చర్య ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ జాతీయ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ వ్యాప్తంగా పౌర, వాణిజ్య విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని మూడు ముఖ్యమైన వైమానిక స్థావరాలపై వరుస పేలుళ్లు సంభవించాయి. సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో, ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావల్పిండిలోని అత్యంత కీలకమైన నూర్‌ఖాన్ వైమానిక స్థావరం ఈ దాడుల్లో లక్ష్యంగా మారింది. గతంలో చాక్లాలా ఎయిర్ బేస్‌గా పిలువబడిన ఈ స్థావరం వైమానిక దళ కార్యకలాపాలకు, వీఐపీ రవాణా యూనిట్లకు కేంద్రంగా ఉంది. నూర్‌న్‌తో పాటు చక్వాల్ నగరంలోని మురిద్ వైమానిక స్థావరం, పంజాబ్ ప్రావిన్స్‌లోని జాంగ్ జిల్లాలో ఉన్న రఫిఖి వైమానిక స్థావరం కూడా దాడులకు గురైనట్లు పాకిస్థాన్ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి.
మరోవైపు, భారత స్థావరాలపై పాకిస్థాన్ సైనిక చర్య చేపట్టినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రధాని షాబాజ్ షరీఫ్ జాతీయ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ఎన్‌సీఏలో ఉన్నతస్థాయి పౌర, సైనిక అధికారులు సభ్యులుగా ఉంటారు. పాకిస్థాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సంస్థే తుది నిర్ణయాలు తీసుకుంటుంది.
అణ్వాయుధ సంపత్తి కలిగిన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇరు దేశాలు పరస్పరం గగనతల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, డ్రోన్లు, ఇతర ఆయుధాలను ప్రయోగించాయని ఆరోపణలు చేసుకుంటున్నాయి. పాకిస్థాన్ చేపట్టిన సైనిక చర్య, ఆ తర్వాత జరిగిన ఎన్‌సీఏ సమావేశం ప్రస్తుత పరిస్థితి తీవ్రతను, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, ఇరు దేశాలు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పలు దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.