మరిన్ని నమోభారత్, వందేభారత్ రైళ్లు
తెలంగాణకు అన్యాయం చేయలేదు: అశ్వినీ వైష్ణవ్
న్యూదిల్లీ : ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ కంటే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువ అని అన్నారు. ఏపీలోని 73 స్టేషన్ల రూపురేఖ లను పూర్తిగా మారుస్తున్నామని వెల్లడిర చారు. దిల్లీలో మీడియాతో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం మాట్లాడారు. ఏపీ నుంచి తెలంగాణ, ఒడిశా, తమిళనాడుకు రైల్వే లైన్ల అనుసంధానం చేస్తున్నామని ఆయన వెల్లడిరచారు. ఏపీకి మరిన్ని నమోభారత్, వందేభారత్ రైళ్లు కేటాయించామని, రైళ్ల వేగం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతికత సాయంతో రైల్వేల అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, అందుకే ఏపీ రైల్వే ప్రాజెక్టుల గురించి బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని చెప్పారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం ఏమీ జరగలేదని అన్నారు. ఏపీలో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తైందని వెల్లడిరచారు. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి అన్నారు. పేదవర్గాల కోసం అమృత్ భారత్ రైళ్లు నడుపుతున్నామని చెప్పారు. అమృత్ భారత్ రైళ్ల ద్వారా పేదలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడి రైల్వే ట్రాక్‌లు పరిశీలించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తామని స్పష్టం చేశారు.
రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని వివరించారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున జాప్యం జరుగుతోందన్నారు. తెలంగాణలో 1,326 కి.మీ మేర కవచ్ టెక్నాలజీ ఉంది. మరో 1,026 కి.మీ.మేర ఈ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నాం. 2026 లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తాం. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తాం. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి’ అని కేంద్ర మంత్రి తెలిపారు.
ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబును కలిసి చర్చించామని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేగంగా ప్రాజెక్టుల పనులు చేపడుతున్నామని, వచ్చే నాలుగేళ్లలో రైల్వే లైన్ల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఏపీకి వందేభారత్ స్లీపర్ రైళ్లు కావాలని ప్రతిపాదనలు ఉన్నాయని పాటిల్ చెప్పారు. విశాఖ-తిరుపతి మధ్య స్లీపర్ రైళ్లు ఎక్కువగా కావాలని, విజయవాడ రైల్వే స్టేషన్‌ను ఎన్‌ఎస్‌జీ-1 కేటగిరీలో చేర్చినట్లు వెల్లడిరచారు. రాజమండ్రి రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.271 కోట్లు కేటాయించారని, విశాఖ-విజయవాడ లైనులో ఆటోమేటిక్ సిగ్నలింగ్ పూర్తి చేస్తున్నామని అన్నారు.