డాక్టర్ గుమ్మా సాంబశివరావు, 9849265025
ప్రాచీన,ఆధునిక సాహిత్యప్రక్రియల్లో నిరంతరంగా ప్రకాశిస్తున్న ప్రక్రియ పద్యం. పద్యం పాతకాలానికి చెందిందని, ఆధునిక భావజాలానికి వాహికకాదనీ వాదించేవారున్నారు. ప్రతిభావంతుడైన కవికి ప్రక్రియతో పనిలేదు. అభివ్యక్తి నవనవోన్మేషంగా ఉంటే, ఆ కవిత పద్యమా? వచనమా? అని ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రతిభావంతుడైన కవి ఏప్రక్రియలో రచించినా పాఠకుల్ని ఆకట్టుకోగలుగుతాడు. గుర్రం జాషువా, కరుణశ్రీ లాంటి కవులు తమభావాల్ని పద్యంలో ప్రకటించినా సాహిత్యలోకంలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందగలిగారు. పద్య కవిత్వాన్ని, వచన కవిత్వాన్ని రెండు కళ్ళుగా భావించి సాహిత్య వ్యవసాయం చేస్తున్న ఆత్మీయ సోదరుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు రెండిరటిలోనూ రాటుదేలిన ప్రతిభావంతుడు. ఏ విషయం మీదనైనా అనర్గళంగా ఉపన్యసించగలిగిన విశిష్ట వక్త. చరిత్రలో దాగి ఉన్న ఎన్నో సాహిత్య విశేషాల్ని, మరుగునపడిన రచయితల్ని సాహిత్యలోకానికి పరిచయంచేస్తూ అనన్య సామాన్యమైన వ్యాసాల్ని రచిస్తున్న పరిశోధకుడు. పద్యాల్ని సులభంగా రచించటం ఎంతో కష్టం. ఆ కష్టాన్ని అధిగమించి, ఒక వ్యక్తి మన ఎదుట కూర్చొని మాట్లాడు తున్నట్లుగా పద్యాల్ని రచించి సహృదయ పాఠకుల మన్ననల్ని పొందిన కవి కోయి కోటేశ్వరరావు.
డా. కోయి కోటేశ్వరరావు ‘ఓటరన్నశతకం’ విశేషమైన ప్రచారాన్ని పొందింది. ప్రజాస్వామ్యంలో ప్రధాన మైన ఆయుధం ఓటు. దాన్ని సమర్థంగా వినియోగించు కోకపోతే ఓటర్లకే అంటే ప్రజలకే నష్టం. కాని ఓటర్లు, రాజకీయ నాయకుల స్వార్థానికి ‘ఎరలై’ తమ స్వేచ్ఛను, అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే కోయి కోటేశ్వరరావు ఓటర్లను చైతన్యం గావించటానికి, తెలుగు వారికి బాగా పరిచయమైన ఆటవెలది ఛందస్సును ఎంచుకొని శతక రచన చేశాడు. ఛందస్సు మీద పట్టు, భాష మీద అధికారం, సామాజిక అంశాలపట్ల అవగాహన పూర్తిగా ఉన్న డా. కోయి ఈ ఓటరన్న శతకాన్ని ప్రతిభా వంతంగా రచించాడు. ఓటరన్న శతకాన్ని ఒంగోలు లోని ‘సామాజిక పరిణామ పరిశోధన సంస్థ’ ప్రచురించింది. ఈ శతకం 2014లో మొదటి ముద్రణ పొందింది. ‘కోయి’ ఈ శతకానికి ప్రారంభంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ పరిషత్ సభలో చేసిన ప్రసంగం నుంచి ‘రాజకీయాల్లో సమానత్వ సూత్రాన్ని గుర్తిస్తూ ప్రతి మనిషికి ఒకఓటు, ప్రతిఓటుకు ఒకేవిలువను ఆమోదిస్తున్నాం. సాంఘిక, ఆర్థికరంగాలలో సమానత్వాన్ని సాధించినప్పుడే రాజకీయ రంగంలోని సమానతకు సార్థకత చేకూరుతుంది’’ అనే మాటల్ని చేర్చటం చాలా సముచితంగా ఉంది. తర్వాత గుర్రం జాషువ ‘ఓటును గూర్చి రచించిన పద్యాల్ని, కాళోజీ రాజకీయ అభ్యర్థిని గూర్చి రచించిన కవితని’ ముందు మాటలాగా చేర్చటం సముచితంగా ఉంది.
కవి తన ఆత్మీయ ముద్రను నిక్షిప్తం చేసి ‘‘చాటు నిజము నెపుడు ‘కోటేశు పద్యమ్ము’ అని రచించటం గమనార్హం. ఓటరన్న శతకాన్ని పూర్తి వ్యవహారికంలో రచించటమే కాకుండా ప్రజల నిత్య వ్యవహారంలోని అన్య భాషా పదాల్నిఈ కవి యధేచ్ఛగా ప్రయోగించాడు. ఏ శతకానికైనా మకుటం ప్రధానమైన అంశం. కోయి తాను రచించిన ఆటవెలది పద్యంలోని నాలుగవపాదాన్ని మకుటంగా మలచాడు. ‘‘ఉన్న మాట వినర ఓటరన్న’’ అనేది ఓటరన్న శతకానికి మకుటం. మకుటం చాలా స్పష్టంగా ఉంది. ‘ఓటరన్న’ అని మాత్రమే కవి చెప్పాడను కోవాల్సిన అవసరం లేదు. ఈ మకుటాన్ని కొంచెం మార్చి ‘ఓటరమ్మ’ ‘ఓటరయ్య’ అని కూడా భావించవచ్చు. కవి తాను సామాజిక వాస్తవాన్ని వెల్లడిస్తున్నాడు కాబట్టి ‘ఉన్న మాట’ అని చెప్పటం చాలా బాగుంది. ఈ మకుటాన్ని గమనించినప్పుడు ‘విశ్వదాభిరామ వినురవేమ!’ అన్న మకుటంలా తప్పకుండా పాఠకులమనస్సుల్లో మెదలుతుంది.
‘ఓటరన్న’ శతకంలోని ప్రతి పద్యమూ రత్నంలాగా మెరుస్తున్నది. కత్తిలాగా పదును తేలి ఉంది. ఉదాహరించదలచుకొంటే అన్ని పద్యాల్ని ఈ వ్యాసంలో చేర్చాల్సి ఉంటుంది. ఓటు వజ్రాయుధమని చెబుతూ… ‘భీముని గదకన్న రామబాణము కన్న/కత్తి కన్న, మిషను గన్ను కన్న/భవ్యమైన ఓటు, వజ్రాయుధము మిన్న/ ఉన్న మాట వినర ఓటరన్న’ అంటాడుకవి.
కవికి విషయజ్ఞానంతో పాటు లోకజ్ఞత ఉంటే అతడు రచించే కవిత్వం పాఠకుల్ని బాగా ఆకట్టుకుంటుందన టానికి కోయి రచించిన ఎన్నో పద్యాలు ఉదాహరణ యోగ్యాలుగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో భావ జాలంతో నిమిత్తం లేకుండా పార్టీలు పొత్తులకోసం పాకులాడుతూ, అలవోకగా ఆయా పార్టీల అభ్యర్థులు పార్టీలు మారటాన్ని గుర్తించిన కవి…‘పొత్తు కుదరగానె పొంగి పోరాదులే/సీట్ల పంపకాల చిచ్చురేగి/జాతకాలు మార్చు జంపు జిలానీలు’ అంటాడు. ఎన్నికల సమయంలో డబ్బు ప్రవాహంలా పారుతుందనే వాస్తవం అందరికీ తెలిసిందే. ఎన్నాళ్ళనుంచో దాచిపెట్టిన డబ్బు బయటకు వచ్చి గెలుపు విషయంలో ప్రాధాన్యం వహిస్తుందని చెబుతూ కవి… ‘చాటు మాటు సిరుల మూటలన్నియు నేడు/ఓటు వేటలోన బైట పడును/నలుపు లక్ష్మి తెలుపు గెలుపు రహస్యాలు’ అంటాడు. ‘బ్లాక్ మనీ’ అనే విషయాన్ని ‘నలుపులక్ష్మి’ అని కవి చక్కగా తెలుగులో చెప్పాడు.
రచయిత ఈ శతకంలో సామాజిక ప్రబోధంతో కూడిన ఎన్నో పద్యాల్ని రచించి ఓటర్లను చైతన్యపరిచాడు. ఓటర్లకు అభ్యర్థి నచ్చకపోతే తమ నిరసనను ‘నోటా’ ద్వారా ప్రకటించే వెసులుబాటు కలిగింది. ఈ విషయాన్నే కవి… ‘‘అధమ నేతలందరభ్యర్థులైనచో/చింత పడవలదిసుమంత కూడ/‘నోట’ తూట పేల్చి చాటాలి నిరసన ’’ అంటూ ఓటరుకు హితవు చెప్పాడు.
సమాజంలో చాలామంది పనుల ఒత్తిడివల్లనో, అశ్రద్ధ వల్లనో, ఒక్కోసారి డబ్బులు ముట్టలేదనో ఓటు హక్కును వినియోగించుకొనే ప్రయత్నం చెయ్యరు. అలాంటి వారిని ఉద్దేశించి ఓటు హక్కును తప్పకుండా వినియోగించు కోవాలని ప్రబోధిస్తూ కవి…‘‘కోటి పనులు విడిచి, ఓటు వేయకపోతె/పాలనా వ్యవస్థ కూలి పోవు/నీరులేక తరువు నిలుచునా పుడమిలో’’ ప్రజాస్వామ్య తరువుకు ఓటు నీరు లాంటిదని ఉద్బోధించాడు. ప్రస్తుత సమాజంలో ‘ఓటు’కు రేటుకట్టి ఎన్నికల్ని నిర్వహించే తంతు కనిపిస్తున్నది. విద్యావంతులు కూడా ‘నోటు’ ఇవ్వనిదే ఓటు వెయ్యమని భీష్మించుకొని కూర్చున్న సందర్భాల్ని వార్తా పత్రికల్లో గమనిస్తూనే ఉన్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కవి…‘‘తాయిలాలు మరిగి వేయి కలలు గంటు /ఓటు వేసినంత చేటు కలుగు/ ఎరను మింగి చేప ఏమాయె చివరకు’’ నోటు తీసుకొని ఓటు వేస్తే అది మనకే చేటు కలిగిస్తుందనే వాస్తవాన్ని కవి అద్భుతమైన పోలిక ద్వారా స్పష్టం చేశాడు. ఎరను చూచి ఆశపడి చేపగాలాన్ని మింగి తన ప్రాణం మీదకి తెచ్చుకొన్నట్లుగానే ఓటర్లు డబ్బుకు ఆశపడి ఓట్లు వేస్తే అది వారి జీవితాలకే ప్రమాదాన్ని కలిగిస్తుందని కవి అద్భుతంగా పరోక్ష ప్రబోధం గావించాడు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తుల్లో ఎవరు నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజల సేవ చేస్తారో గుర్తించి వారిని ఎన్నుకోవాలని ప్రబోధిస్తూ కవి…‘‘మచ్చలేని చందమామనే యెప్పుడు/గెలుపు కుర్చి పైన నిలుప వలయు/పుచ్చు కూరగాయ మెచ్చునా మన ఆత్మ’’. కూరగాయలు స్వచ్ఛంగా, పుచ్చులేకుండా ఉంటేనే కూరకు పనికి వస్తాయి. అలాగే ప్రజాసేవ చెయ్యటానికి నాయకులు ఎలాంటి లోపాలు అంటే స్వార్థం, బంధు ప్రీతి, అవినీతి అనే లక్షణాలు లేకుండా ఉండాలని కవి ప్రబోధం.
ఎన్నికైన నాయకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే అతన్ని పదవి నుంచి వెనక్కి పిలిపించే పద్ధతి ఉండాలని భావిస్తూ కవి…‘చెడ్డ నాయకులను చేయగా ‘రీకాలు’/చట్టముండ వలెను సతము మనకు/ముల్లుగర్ర లేక ముందుకు పోదెద్దు’ ఎద్దు ముందుకు పోవాలంటే ముల్లు గర్రపోటు తగులుతూ ఉండాలి కాబట్టి ఎన్నికైన వాడు సక్రమంగా పనిచెయ్యాలంటే ‘అతన్ని పదవినుంచి దింపే’ పద్ధతి ఉండాలని కవి ప్రబోధం.
ఓటరన్న శతకంలోని పద్యాలు వేమన పద్యాల్ని తలపింపచేస్తాయి ముఖ్యంగా కోయి తన ప్రతిభనంతా రంగరించి పద్యానికి ప్రాణమైన మూడోపాదంలో నిక్షిప్తం చేశాడు. ఈ మూడో పాదం కవికి భాష మీదగల పట్టును, నుడికారం మీద ఉన్న అధికారాన్ని అతనికున్న ఆలంకారిక ప్రతిభను, బహుముఖీనమైన అవగాహనను, విశిష్టమైన అభివ్యక్తిని ప్రకటిస్తున్నది. ఆయా పద్యాల్లో కవి రచించిన మూడో పంక్తులు లోకోక్తులుగా సామెతలుగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ శతకంలో కవి పరభాషా పదాల్ని యధేచ్ఛగా ప్రయోగించి పద ప్రయోగంలో ‘నవ్యత’ను ప్రకటించాడు. ఒకే అంశం మీద వంద పద్యాల్ని రచించడం పాఠకుల మెప్పులు పొందడం గొప్ప విషయం .
(ఇటీవల డాక్టర్ కోయి కోటేశ్వరరావు అజో విభొ కందాళం ఫౌండేషన్ వారిచే విశిష్ట దళిత సాహిత్య పురస్కారం అందుకున్న సందర్భంగా)