- జ్ఞానేశ్కుమార్అ ప్రూవర్గా మారాలి
- ముగ్గురు దేశద్రోహులను శిక్షించాలి
- రాహుల్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల వ్యవస్థ భ్రష్టుపట్టుకు పోయిందని, ప్రధాన మంత్రి, హోంమంత్రి, ప్రధాన ఎన్నికల కమిషనర్ దేశద్రోహులుగా మారిపోయా రని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీపై దర్యాప్తు చేపట్టాలని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా పాత్రపై విచారణ జరిపించాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అప్రూవర్గా మారాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ తర్వాత చట్టాల చోరీ… సంస్థల చోరీ జరుగుతుందని రాహుల్ ఎద్దేవా చేశారు. సీఈసీ తక్షణమే పదవీ బాధ్యతల నుంచి తొలగిపోవాలన్నారు. దేశద్రోహులు తప్పించుకోలేరంటూ మోదీ, అమిత్‌షా, జ్ఞానేశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. దిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ఓటు హక్కు దెబ్బతింటే రాజ్యాంగ వ్యవస్థ, చట్టసభలు, సంస్థలపై ప్రభావం పడుతుందన్నారు. ఓట్ల చోరీతో ఈ వ్యవహారం ఆగిపోదని… అది చట్టాల చోరీ, ఆపై సంస్థల చోరీ వరకు వెళుతుందని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్‌లు సుఖ్బీర్సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాల గురించి మాట్లాడుతూ జ్ఞానేశ్కుమార్ పునరాలోచించుకోవాలని, అప్రూవర్గా మారిపోవాలని, తద్వారా దేశానికి మేలు జరుగుతుందని రాహుల్ అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ఈసీలోని ఇద్దరు కమిషనర్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు బిది ఇండియన్ ఎక్స్‌ప్రెస్బి కథనాన్ని గుర్తుచేశారు. ఫారం-6లో మార్పులు, ఓటర్ల జాబితా డేటాబేస్‌పై నియంత్రణ వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వెల్లడించారు. ఈ పరిణామాలు ఎన్నికల వ్యవస్థలో తీవ్ర సమస్యలకు దారితీస్తాయన్నారు. ఈసీ వర్గాలు ఎస్‌ఐఆర్‌తో పాటు ఇతర నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని చెప్పకుంటూ అంతర్గత విభేదాలను తోసిపుచ్చుతున్నాయని, ఇది సరైనది కాదని రాహుల్ అన్నారు. ‘దేశ న్యాయ వ్యవస్థను బలహీనమవుతోందని, రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి జరుగుతోందని’ అని తాజా పరిణామాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఓటు హక్కును పరిరక్షించడం ఎన్నికల సంఘం బాధ్యతగానీ అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలాంటి చర్యలకు తీవ్ర పరిణామాలు తప్పబోవంటూ రాహుల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని వదిలి పెట్టేది లేదని కూడా రాహుల్ వెల్లడించారు. కొన్ని వీడియోలు ప్రదర్శిస్తూ వాటిలో మోదీ`అమిత్‌షా మాట్లాడిన శైలిని గమనించాలని ప్రజలకు సూచించారు. ‘అబ్ కి బార్ 400 పార్’ అని ప్రధాని నినాదమివ్వడం…. బీజేపీ మరో 30 ఏళ్లు అధికారంలో ఉంటుందని అమిత్‌షా ప్రకటించడం ఆ వీడియోల్లో కనిపించింది. బీజేపీ దీర్ఘకాలం అధికారంలో ఉంటుందన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసాధారణమని రాహుల్ అన్నారు. భారత్‌లో ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది ఓ సహజమైన రాజకీయ శక్తి అని, అది విజృంభిస్తే ఎవరినీ ఉపేక్షించదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అవకతవకలపై ఇప్పటికే ఆధారాలు సమర్పించినట్లు వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయన్నారు. మహారాష్ట్ర ఎన్నికలప్పుడు ఓట్ల చోరీపై ఆధారాలు చూపినట్లు రాహుల్ గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రిగ్గింగ్ జరిగిందని, ఎన్నికల సంఘమే దగ్గరుండి ఈ వ్యవహారాన్ని నడిపించిందని రాహుల్ ఆరోపించారు. ఈసీ తీరుతో రాజ్యాంగం, చట్టాలు, సంస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు.


