Saturday, February 22, 2025
Homeకన్వీనర్‌ కోటాకు గండి !

కన్వీనర్‌ కోటాకు గండి !

. ఇంజినీరింగ్‌ విద్యతో వ్యాపారం
. వర్సిటీలుగా మారేందుకు యాజమాన్యాల ఆసక్తి
. తగిన అర్హత లేకపోయినా ఉన్నత విద్యామండలికి వినతులు
. ఏపీ సెట్స్‌ నోటిఫికేషన్‌తో ప్రయత్నాలు ముమ్మరం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ప్రామాణిక విద్యా బోధన, ఇతర సౌకర్యాలు లేనప్పటికీ రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా మార్చే దిశగా ఆయా యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కన్వీనర్‌ కోటా సీట్లు కుదిం చుకుపోయే అవకాశముంది. 202526 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి కామన్‌ ఎంట్రన్స్‌ సెట్స్‌(ఏపీ సెట్స్‌)2025 నోటిఫికేషన్‌ ఉన్నత విద్యామండలి ఇటీవల జారీజేసింది. దీంతో ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరమ య్యాయి. ఏపీ సెట్స్‌లో ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో సీట్ల భర్తీకిగాను ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఈఏపీసెట్‌ ద్వారా కన్వీనర్‌ కోటా సీట్లను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. కేటగిరిఏ కింద కన్వీనర్‌ కోటాలో 70 శాతం, కేటగిరి`బిలో యాజమాన్య కోటా కింద 30శాతం సీట్లను కేటాయిస్తారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయా లుగా ఇంజినీరింగ్‌ కళాశాలలు అభివృద్ధి చెందినట్లయితే…ఆ మేరకు కన్వీనర్‌ కోటా సీట్లు గల్లంతవుతాయి. గత వైసీపీ ప్రభుత్వం చివరి దశలో మూడు ఇంజినీరింగ్‌ కళాశాలలు కాస్తా…ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలుగా మారడంతో అక్కడ విద్యార్థులకు రావాల్సిన 70శాతం కన్వీనర్‌ కోటా సీట్లు వెబ్‌ కౌన్సెలింగ్‌కు దూరమయ్యాయి. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం ఆధారంగా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో 35శాతం కన్వీనర్‌ సీట్ల భర్తీకే అవకాశం దక్కింది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా రాజంపేటలో అన్నమాచార్య విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం జిల్లాలో గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయం, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేరొందిన ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలుగా స్థాయిని పెంచుకునేందుకు దరఖాస్తుచేసినట్లు సమాచారం. అరకొర ప్రామాణిక సౌకర్యాలు ఉన్నప్పటికీ..ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గానికి చెందిన ఓ కళాశాల దరఖాస్తు చేసినట్లు తెలిసింది.
డీమ్డ్‌గా మారినా కన్వీనర్‌ కోటా గల్లంతే..
ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏకంగా డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల హోదా పొందితే…ప్రస్తుతం అమలులో ఉన్న కన్వీనర్‌ కోటా సీట్లు గల్లంతవుతాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ఏపీ ఈఏపీసెట్‌ ద్వారా 35శాతం కన్వీనర్‌ కోటా సీట్ల కోసం ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టింది. ఏపీ ఈఏపీసెట్‌ ద్వారా ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా వాటిని భర్తీ చేసేవారు. కన్వీనర్‌ కోటా సీట్ల నుంచి తప్పుకునేందుకుగాను ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాసి, యాజమాన్య కోటాలో సీట్లు పొందాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల డీమ్డ్‌ యూనివర్సిటీగా ఉన్నతీకరణ అయింది. దీంతో ఏపీఈఏపీసెట్‌2024 వెబ్‌ కౌన్సెలింగ్‌కు కన్వీనర్‌ కోటా సీట్లు దూరమయ్యాయి. దీనివల్ల విద్యార్థులు అక్కడ ఆప్షన్లు పెట్టుకునే అవకాశాన్ని కోల్పోయారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలుగా విస్తరించినప్పుడు అక్కడ యూజీ నుంచి పీజీ వరకు అన్ని కోర్సులనూ అందుబాటులో ఉంచాలి. దానికి విరుద్ధంగా ఇంజినీరింగ్‌లోని వివిధ బ్రాంచీల విస్తరణ, సీట్ల పెంపు, అరొకరగా పీజీ కోర్సులనే ప్రవేశపెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సులకు ఎక్కడా చోటు దక్కడంలేదు. ప్రమాణాలు లేకున్నా..ఉన్నతీకరణకు వినతులు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రమాణాలు లేకపోయినప్పటికీ, వాటిని విశ్వవిద్యాలయాలుగా మార్చాలంటూ ప్రభుత్వానికి వినతులు ఇవ్వడంపై విమర్శలున్నాయి. అర్హతలు లేని ఇంజినీరింగ్‌ కళాశాలలను విశ్వవిద్యాలయాలుగా ఉన్నతీకరిస్తే విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని విద్యార్థి, యువజన సంఘాలు పదేపదే చెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు వాటిని ఆలకించడం లేదు.చాలా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు పంపకుండానే, ఇతర కంపెనీలతో యాజమాన్యం లాలూచీ పడి విద్యార్థులకు సర్టిఫికెట్లను జారీజేయడం, ఒక్కో విద్యార్థి నుంచి తగిన కంపెనీల సామర్థ్యం ఆధారంగా డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. వీటిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కళాశాలలో చదివిన అన్ని తరగతుల విద్యార్థులు తగిన బోధనా అనుభవం, పరిజ్ఞానం పొందకుండానే డిగ్రీ పట్టాలు పొంది...బయటకు వచ్చాక వారు నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఎంతో కష్టపడి చదివినా... విద్యార్థులకు నైపుణ్యత లేకపోవడంతో వారికి ఉపాధి అవకాశాలు దక్కడంలేదు. ఏపీఈఏపీసెట్‌2025 వెబ్‌ కౌన్సెలింగ్‌ నాటికి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు డీమ్డ్‌గా మారినా, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు కాస్తా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలుగా మారినా విద్యార్థులకే నష్టం వాటిల్లుతుంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద ఉన్న 70 శాతం, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం 35కన్వీనర్‌ కోటా సీట్లు పోతాయి. ప్రమాణాలులేని కళాశాలల నుంచి విశ్వవిద్యాలయాల ఉన్నతీకరణకు వచ్చిన దరఖాస్తులను తిరష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు