Wednesday, December 4, 2024
Homeకేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై9, 10న రాష్ట్రవ్యాప్త నిరసనలు

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై9, 10న రాష్ట్రవ్యాప్త నిరసనలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర`విజయవాడ:
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను వ్యతిరేకిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 9, 10 తేదీల్లో నిరసన దినం పాటిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ‘నిరసనలు’ చేపట్టవలసిందిగా సీపీఐ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అదానీ గ్రూపు కంపెనీల అవినీతి, తప్పిదాలు, ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని, అందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులపై పార్లమెంటులో చర్చ జరపాలని, సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం (పీఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరించాలని, అధిక ధరలు అరికట్టాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10న దేశవ్యాప్తంగా ‘డిమాండ్స్‌ డే’ చేపట్టాలని సీపీఐ జాతీయ సమితి పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదయిందన్నారు. విద్యుత్‌ ఒప్పందాల కోసం అదానీ నాలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.2,100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయన్నారు. ఇందులో అత్యధికభాగం రూ.1,750 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే గత ప్రభుత్వ హయాంలో ముడుపులుగా ముట్టజెప్పినట్లు తెలుస్తోందన్నారు. ఫలితంగా 25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల మేర విద్యుత్‌ చార్జీల భారం పడుతుందని రామకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అదానీ అవినీతి కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని, గత ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలు రద్దుచేయాలని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అదానీని తక్షణమే అరెస్టు చేయాలని, ఈ అవినీతిపర్వంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి తరపున డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు