Homeగవర్నరు మోకాలడ్డు

గవర్నరు మోకాలడ్డు

- Advertisement -

. సంఖ్యా బలం కావాల్సిందే
. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరణ
. మద్దతు కూడగట్టే పనిలో విజయ్ పార్టీ
. నేటి ప్రమాణ స్వీకారం వాయిదా!
. రిసార్టులోనే ఉండాలని ఎమ్మెల్యేలకు టీవీకే ఆదేశం

చెన్నై: తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. చాలినంత సంఖ్యాబలం లేదన్న సాకుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మోకాలొడ్డారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ చెప్ప్పుకొచ్చారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నరు అనుమతించకపోవడంతో గురువారం ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. తదుపరి అదేశాలు వచ్చేంత వరకు ఎమ్మెల్యేలంతా రిసార్టులోనే ఉండాలని టీవీకే పార్టీ ఆదేశించింది. తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. అయితే విజయ్ చూపించిన సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు ఇంకా తగినంత సంఖ్యాబలం లేదని ఆయన భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్నే ఆయన విజయ్‌తో చర్చించినట్లు.. 118 సభ్యులు సమకూరిన అనంతరమే రావాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు లోక్‌భవన్‌లో గవర్నర్‌ను విజయ్ కలుసుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, కొన్ని పార్టీలు కూడా తమతో చేతులు కలపనున్నాయని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుంటానని విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని సమాచారం. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విజయ్ రెండు సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం అనివార్యం. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్టయింది. కాంగ్రెస్ బలం కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం. మరోవైపు, విజయ్ టీవీకే పార్టీకి తాము మద్దతివ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంల్), వామపక్ష పార్టీలు తేల్చి చెప్పాయి. తాము డీఎంకే కూటమిలోనే ఉంటామని పేర్కొన్నాయి. డీఎంకే మిత్రపక్షమైన వీసీకే… టీవీకే పార్టీకి మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడులో సీపీఐకి 2, సీపీఎంకి 2, ఐయూఎంఎల్‌కు 2, వీసీకేకు 2 సీట్లు ఉన్నాయి. కాగా, విజయ్ పార్టీకి మద్దతివ్వడానికి అన్నాడీఎంకేలోని ఓ వర్గం తహతహలాడుతోంది. ఎంపీ షణ్ముగం నాయకత్వంలోని దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అప్రమత్తమయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తుకు ఆసక్తి చూపడం లేదు. ఆ కూటముల్లోని లౌకికపార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ భావిస్తున్నారు. తమిళనాడులో బీజేపీ, దానిమిత్రపక్షాల ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకోవడానికే విజయ్ పార్టీకి తాము మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. కూటమికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని, భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టంచేసింది. ఎన్నికల ఇబ్బందులు వచ్చినా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్నామని, ఇప్ప్పుడు అధికారం కోసం మరోపార్టీతో పొత్తుకు సిద్ధమైందని మండిపడింది. తమకు మద్దతివ్వాల్సిందిగా టీవీకే పార్టీ సీపీఐ, సీపీఎం, వీసీకే, పీఎంకే వంటి పార్టీలకు విజ్ఞప్తి చేసింది. అయినా ఆ పార్టీలు ముందుకు రాలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు