Thursday, November 21, 2024
Homeగేమ్‌ ఛేంజర్‌ పోలవరం

గేమ్‌ ఛేంజర్‌ పోలవరం

. ఆర్థిక ఇబ్బందులున్నా 2027 నాటికి పూర్తి
. దీంతో కరువుకు శాశ్వత పరిష్కారం
. జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం
. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి, వెన్నెముక లాంటిదని, అది పూర్తయితే రాష్ట్రంలో కరువుకు స్వస్థి చెప్పినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంగళవారం స్వల్ప కాలిక చర్చ జరిగింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి, పోలవరం ఏపీకి రెండు కళ్లు అని అన్నారు. మన రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌ పోలవరం అని పేర్కొన్నారు. నీటి వాడుకలో మార్పులు చేస్తే పర్యావరణంలో కూడా మార్పులు వస్తాయన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఫ్లోరైడ్‌ పరిస్థితులు చూస్తున్నామన్నారు. రూ.129 కోట్ల అంచనాతో శంకుస్థాపన జరిగిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు రూ.55వేల కోట్ల వ్యయానికి చేరిందన్నారు.1981లో పోలవరం ప్రాజెక్టుకు అంజయ్య పునాది రాయి వేసినప్పటికీ పనులు ప్రారంభించలేదన్నారు. పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి సంకల్పించామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. అయితే పోలవరంలో ముంపునకు గురయ్యే ఏడు మండలాలను తెలంగాణలో ఉంచారని, ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయకపోతే పోలవరం ఎప్పటికీ సాధ్యంకాదని భావించి… వాటిని ఏపీలో విలీనం చేస్తేనే తాను సీఎంగా ప్రమాణం చేస్తానని 2014లో కేంద్ర పెద్దలతో చెప్పానని గుర్తుచేశారు. దీంతో అప్పటికప్పుడు కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్టు జాప్యం కాకూడదనే నిర్మాణ బాధ్యతలు మనం తీసుకున్నామని వివరించారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని భావించి… పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని, అందుకే పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీళ్లిచ్చామన్నారు. 2014 నుంచి 2019 వరకూ పోలవరం పనులు పరుగులు పెట్టించామని, ఒకే రోజులో 32 వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా కాంక్రీట్‌ పనులు చేసి గిన్నీస్‌ రికార్డులోకి ఎక్కామన్నారు. 414 రోజుల్లోనే పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తిచేశామన్నారు. గత ప్రభుత్వంలోని జలవనరులశాఖ మంత్రికి డయాఫ్రమ్‌ వాల్‌ అంటే ఏమిటో తెలియదన్నారు. క్యూసెక్కులు, టీఎంసీలకు తేడా తెలియని వ్యక్తి మంత్రిగా చేశారని ఎద్దేవా చేశారు. 2014-19 మధ్యలో 72 శాతం పోలవరం పనులు పూర్తి చేశామన్నారు. 28 సార్లు పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించాననీ, 80 సార్లకుపైగా వర్చువల్‌గా సమీక్షించానన్నారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రాజెక్టు నాశనమైందన్నారు. డయాఫ్రం వాల్‌ పైనుంచే వరదలు వెళ్లాయని, ఐదేళ్ల కష్టం మొత్తం సర్వనాశనం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి చెప్పకుండా ధృవీకరణలు పంపించారన్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పోలవరం పూర్తయితే 194 టీఎంసీల నీరు నిలిపే వాళ్లమన్నారు. 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మొదటి దశలో 41.15 మీటర్లు ఎత్తులో నిర్మిస్తామని చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించిన ఘనత గత ప్రభుత్వానిదేనన్నారు. పోలవరం పూర్తయితే 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 2014`2019 మధ్య రూ.16,493 కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం కేవలం రూ.4,993 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. 2026 మార్చి నాటికి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 2027 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు