Monday, March 3, 2025
Homeసంపాదకీయంచివరకు కోర్టుకెక్కిన బుచ్‌ వ్యవహారం

చివరకు కోర్టుకెక్కిన బుచ్‌ వ్యవహారం

అదానీ వ్యాపార ప్రయోజనాలను కాపాడడానికి ప్రధానమంత్రి మోదీ ఉన్నారు. వ్యాపారంలో అదానీ చేసిన మోసాలను వెలికి రాకుండా చూడడానికి మొన్నటి దాకా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) అధ్యక్షురాలిగా ఉన్న మాధవి పురి బుచ్‌ ఉన్నారు. ఆమె మీద ఆదివారం ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలైతే ఆమెను రక్షించడానికి కోర్టులున్నాయి. ఇంతకు ముందు కూడా అదానీ మీద ఆరోపణలు వస్తే ఆ విషయాన్ని దర్యాప్తు చేసే బాధ్యతను న్యాయస్థానం సెబి అధ్యక్షురాలికే అప్పగించింది. మాధవి బుచ్‌ మరికొందరి మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయడానికి ముందు సెషన్స్‌ కోర్టు వారికి నోటీసులు ఇవ్వలేదు అని మొరపెట్టుకుంటే ఆ మొరను బొంబాయి హైకోర్టు ఆలకించింది. అంటే ప్రస్తుతానికి మాధవీ బుచ్‌కు ఎఫ్‌.ఐ.ఆర్‌. గండం వాయిదా పడ్డట్టే. మాధవీ బుచ్‌ తదితరులకు సంబంధించి సెషన్స్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమైందని సెబి, బొంబాయి స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనతో హై కోర్టు అంగీకరించి తదుపరి చర్యలేవీ లేకుండా కాపాడిరది. ముంబై సెషన్స్‌ కోర్టు జారీచేసిన ఆదేశంపై తదుపరి చర్యలు మంగళవారం దాకా నిలిపి వేయాలని సోమవారం బొంబాయి హైకోర్టు నిర్దేశించింది. ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ జరుపుతామని అందుకని ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలన్న సెషన్స్‌ కోర్టు ఆదేశంపై ఏ చర్యా తీసుకోకూడదని బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి శివకుమార్‌ దిగే ఆదేశించారు. మాధవీ బుచ్‌ మీద వచ్చిన ఆరోపణలను పరాస్తం చేయడానికి సాక్షాత్తు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ దిగిపోయారు. నిజానికి మాధవి బుచ్‌ తదితరులపై ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలన్న సెషన్స్‌ కోర్టు ఆదేశాలు సోమవారం అమలు కాకముందే ఆ పని జరగకుండా అత్యున్నత స్థాయి న్యాయవాదులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ముంబై హైకోర్టు తీసుకునే నిర్ణయం మీదే భవిష్యత్‌ కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. అప్పటి దాకా అవినీతి నిరోధక శాఖ ముందడుగు వేయడానికి అవకాశం లేదు. సెబి మాజీ అధిపతి మాధవి పురి బుచ్‌, సెబీలో పూర్తి కాలం పని చేసే సభ్యులు అశ్వినీ భాటియా, అనంత్‌ నారాయణ్‌, కమలేశ్‌ చంద్ర వర్ష్నే, బొంబాయి స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ అధ్యక్షుడు ప్రమోద్‌ అగర్వాల్‌, ప్రధాన కార్యనిర్వహణాధికారి సుందర రామన్‌ రామ మూర్తి విడివిడిగా హైకోర్టులో ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయకుండా నిరోధించడానికి బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లో కంపెనీలను నమోదు చేయడంలో మాధవి పురి బుచ్‌ తో పాటు మరి కొందరు అవినీతికి, ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని, అందుకని వారి మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. ధాకాలు చేయాలని థానే కు చెందిన పత్రికా రచయిత సపన్‌ శ్రీవాస్తవ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. సెషన్స్‌ కోర్టు ఆయన విజ్ఞప్తిని పరిశీలించి ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలని ఆదేశించింది. సెబీ తన విధిని నిర్వహించకుండా నిర్లక్ష్యం చేసిందని, మార్కెట్‌ ను మాయ చేసేందుకు సహకరించిందని, కార్పొరేట్‌ సంస్థల మోసానికి సహకరించిందని సపన్‌ శ్రీవాస్తవ సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వాదించారు. మాధవి బుచ్‌ హయాంలో సెబి తన ధర్మాన్ని నిర్వర్తించలేదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.
సపన్‌ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్‌ లో సెబీ నియమాలను పాటించని కంపెనీని కూడా అనుమతించారని, దీనివల్ల మార్కెట్‌ ను మాయ చేయడం సాధ్యం అయిందని, తద్వారా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారు భారీ నష్టం భరించవలసి వచ్చిందని పేర్కొన్నారు. సెబి, కార్పొరేట్‌ సంస్థలు కుమ్మక్కై అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు చాలా కాలం నుంచే ప్రచారంలో ఉన్నాయి. అర్హత లేని కంపెనీలను స్టాక్‌ఎక్స్‌చేంజ్‌లోకి అనుమతించినందువల్ల ప్రజల సొమ్మును దోచుకోవడానికి బుచ్‌ తదితరులు వెసులుబాటు కలిగించారు. సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి శశికాం ఏక్‌నాథ్‌ బంగర్‌ ఈ వాదనలతో ఏకీభవించి బుచ్‌ తదితరుల మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించారు. శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్‌లో వాదనలు విశ్వసనీయంగా ఉన్నాయని సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి బంగర్‌ నిర్ధారణకు వచ్చారు. ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి సెబి నియంత్రణా బాధ్యతలను విస్మరించినట్టు న్యాయమూర్తి బంగర్‌ నిర్ధారణకు వచ్చారు. చట్టాన్ని అమలు చేసే విభాగం, సెబీ తమ కర్తవ్య నిర్వహణలో విఫలమైనందువల్ల న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవలసిన అగత్యం ఉందని కూడా న్యాయమూర్తి బంగర్‌ అభిప్రాయపడ్డారు. సెషన్స్‌ కోర్టు ఎవరిమీదైతే ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలని ఆదేశించిందో వారు అవకతవకలు జరిగాయంటున్న సమయంలో పదవుల్లో లేరని కూడా సెబీ హైకోర్టులో వాదించింది. సెబి అధ్యక్షురాలిగా మాధవి బుచ్‌ బాధ్యతల నుంచి విరమించిన మర్నాడే ఆమె, మరో అయిదుగురి మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలని సెషన్స్‌ కోర్టు ఆదేశిచడానికి కచ్చితంగా ప్రత్యేకత ఉంది. ఆమె సెబీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఆమె మీద ఈగైనా వాల లేదు. మోదీ అండ ఆమెకు ఉందని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అదానీ ప్రయోజనాలు కాపాడాలంటే సెబీ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తిని మోదీ సమర్థించక తప్పదుగా! బుచ్‌ తదితరుల మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలని సెషన్స్‌ కోర్టు ఆదేశించిన వెంటనే బుచ్‌ తో సహా మిగతా అయిదుగురు ఈ ఆదేశాలను హైకోర్టులు సవాలు చేస్తామని ప్రకటించారు. సెషన్స్‌ కోర్టు ఆదేశాన్ని ఖండిరచడంలో సెబి, బి.ఎస్‌.ఇ. దాదాపు ఒకే రకంగా మాట్లడడం ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం. సపన్‌ శ్రీవాస్తవ 1994 నాటి వ్యవహారాన్ని ప్రస్తావించి సెబి తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదని వాదించారు. ఆ సమయంలో మాధవీ బుచ్‌ తో సహా ఆరోపణకు గురైన వారు సెబీలో పని చేసి ఉండకపోవచ్చు. కానీ సెబీలో జరుగుతున్న అవకతవకలను నియంత్రించాలనుకుంటే గతంలో జరిగిన వ్యవహారాలను సైతం నివారించవలసిన బాధ్యత సెబీ మీద ఉంది. సపన్‌ శ్రీవాస్తవ లేవనెత్తిన అంశం మాధవి బుచ్‌ తదితరులు సెబీలో పని చేస్తున్నప్పటిది కాకపోవచ్చు. తమ మీద మోపిన ఆరోపణల నుంచి తమను తాము రక్షించుకోవడానికి పై కోర్టులకు ఎక్కే అవకాశమూ, అధికారం కూడా వారికి ఉన్నమాటా నిజమే. మధవీ బుచ్‌ వ్యవహారం కేవలం తారీఖులకు దస్తావేజులకు సంబంధించి కాకపోవచ్చు. ఆ ఆరోపణలు మాత్రం నమ్మదగినవిగా ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట నిష్కృతి లభించాలిగా! ఆ చోటు కచ్చితంగా న్యాయ వ్యవస్థే. మంగళవారం ముంబై హైకోర్టు తీసుకోబోయే చర్య ఎంత మేరకు న్యాయం చేసేదిగా ఉంటుందో వేచి చూడవలసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు