సమాఖ్య వ్యవస్థను అతిక్రమించదు: జస్టిస్ అవస్థీ
చట్టబద్ధతపై దృష్టి అవసరం: జస్టిస్ లలిత్
న్యూదిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లు ఫెడరల్ వ్యవస్థను అతిక్రమించదని న్యాయ నిపుణుడు, లా కమిషన్ మాజీ చైర్పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) రితురాజ్ అవస్థీ అన్నారు. ఈ బిల్లు చట్టబద్ధతపై దృష్టి అవసరమని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి మాజీ సీజేఐ యూయూ లలిత్ సూచించారు. వివాదాస్పద ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఖర్చుతో కూడుకున్న బృహత్ కార్యమని, శక్తి మించిన ప్రయాస అవుతుందని హెచ్చరిస్తున్నాయి. జమిలి ఎన్నికలు వద్దని కేంద్రానికి సూచిస్తున్నాయి. అయితే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో ఉంది. ఎలాగైనా జమిలి ఎన్నికలను ఆచరణలోకి తేవాలని కసరత్తు చేస్తోంది. ఆ దిశగా పనుల్లో వేగం పెంచింది. ఇదే క్రమంలో జేపీసీ మంగళవారం న్యాయ నిపుణులతో భేటీ అయి వారి అభిప్రాయాలను కోరింది. లోక్సభ, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన రెండు బిల్లులను అధ్యయనం చేసిన న్యాయ నిపుణులు భేటీలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వం ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శి, ఐఏఎస్ నితిన్ చంద్ర, మాజీ సీజేఐ యూయూ లిలిత్, కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియర్ న్యాయమూర్తి ఈఎం సుదర్శన నాట్చిప్పన్ (2015లో జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీకి నేతృత్వం వహించారు) తదితరులు హాజరయ్యారు. తొలుత జస్టిస్ అవస్థీ తన అభిప్రాయాలు తెలియజేశారు. జమిలి ఎన్నికల బిల్లులను సమర్థించారు. రాజ్యాంగ ప్రజాస్వామిక సూత్రాలకు, సామ్యావాద వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఈ బిల్లుల్లో ఏమీ లేదని అన్నారు. అర్హులైన పౌరుల ఓటు హక్కునూ ఈ బిల్లు ఉల్లంఘించదని చెప్పారు. జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని అంశాలు రాజ్యాంగ (129 సవరణ) బిల్లులో ఉన్నట్లు తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధమంటూ వచ్చిన అనుమానాలను తోసిపుచ్చారు. సందేహాలు అక్కర్లేదని ఈ బిల్లు సరైనదేనని జస్టిస్ అవస్థీ చెప్పారు. ప్రతిపాదిత బిల్లు బాగానే ఉన్నప్పటికీ, ఇందులో దృష్టి సారించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని మాజీ సీజేఐ యూయూ లలిత్ తెలిపారు. ఆయా అంశాలను అపరిష్కృతంగా వదిలేస్తే కోర్టు ఈ బిల్లులను కొట్టివేయొచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా పదవీ కాలాలు కుదించే సమస్యను పరిష్కరించాలని సూచించారు. ‘ఐదేళ్ల కోసం ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారు. అసెంబ్లీ పదవీ కాలాన్ని కుదిస్తే అది రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అవుతుంది. దీనిపై కోర్టుకు వెళ్లవచ్చు’ అని జస్టిస్ లలిత్ చెప్పారు. ఇదిలావుంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ అడిగిన ప్రశ్నలకు న్యాయ నిపుణులు సమాధానాలు ఇచ్చారు. రాజ్యాంగ (129వ వసరణ) బిల్లు, 2024Ñ కేంద్ర పాలితన ప్రాంతాల చట్టాలు (సవరణ) బిల్లు, 2024పై జేపీసీతో చర్చించారు.