Thursday, November 21, 2024
Homeజాతీయంజిశాట్‌-20 ప్రయోగం విజయవంతం

జిశాట్‌-20 ప్రయోగం విజయవంతం

విశాలాంధ్ర` సూళ్లూరుపేట: దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్‌ సేవలు మరింత విస్తరించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అతిపెద్ద ఉపగ్రహాన్ని రూపొందించింది. 4700 కిలోల బరువు ఉన్న జీశాట్‌- 20 ఉపగ్రహం మన అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి కాకుండా ఫ్లోరిడాలోని స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. స్పేస్‌ ఎక్స్‌తో ఇస్రోకి వాణిజ్యప్రయోగం ఇది. మన బాహుబలి రాకెట్‌కు 4000 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది. అయితే తాజాగా రూపొందించిన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జిశాట్‌ -20… 4700 కిలోల బరువు ఉండడంతో ప్రైవేట్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించాల్సి వచ్చింది. ఎలాన్‌ మస్క్‌ ప్రైవేట్‌ రాకెట్‌ ఇటీవల ప్రపంచంలో ఎన్నో సరికొత్త అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్‌ నైన్‌ రాకెట్‌ ద్వారా మన ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇస్రో ఇప్పటిదాకా భారీ సైజు ఉండే ఉపగ్రహాలను ఇతర రాకెట్‌ ప్రయోగ కేంద్రాల నుంచి ప్రయోగించినప్పటికీ స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ను ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి. మంగళవారం అర్ధరాత్రి 12.01 గంటలకు ఈ ఉపగ్రహం ప్రయోగించడంతో ఘన విజయం సాధించింది. అండమాన్‌ నికోబార్‌, లక్ష్యదీపంలోనూ వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహంలో శక్తివంతమైన ఉపకరణాలు విమానాలలో ఇంటర్నెట్‌ సేవలకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు