Saturday, February 22, 2025
Homeవిశ్లేషణజైళ్లే కమ్యూనిస్టులకు నారు మడులు

జైళ్లే కమ్యూనిస్టులకు నారు మడులు

ఆర్వీ రామారావ్‌

ఇరవయ్యవ శతాబ్దం రెండవ మూడవ దశాబ్దాల కాలంలో కమ్యూనిస్టు భావజాలం వేగంగా విస్తరించినా కమ్యూనిస్టులు కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అవకాశాలు చాలా పరిమితం. ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించేది. అందువల్ల కమ్యూనిస్టు భావజాలం ఉన్న వారు వేర్వేరు బృందాలుగా ఏర్పడి అనేక సంస్థలు, వ్యవస్థల రూపంలో పని చేయాల్సి వచ్చేది. వీలున్న చోట్ల ఉద్యమాలు చేయడం, కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాపింప చేయడానికి పత్రికలు నిర్వహించడం కొనసాగేది. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినా దానికి ఒక స్వరూపం రావడానికి, పార్టీ వ్యవస్థ ఏర్పడడానికి పదేళ్లకు పైగానే పట్టింది. వివిధ పార్టీల పేరుతో కమ్యూనిస్టులు తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి వచ్చేది. ఎక్కువ కాలం కమ్యూనిస్టులు రహస్యంగానే పని చేయవలసి వచ్చేది. కిసాన్‌ లేబర్‌ పార్టీగా, కార్మిక కర్షక పార్టీగా వివిధ రూపాల్లో కమ్యూనిస్టులు పనిచేయక తప్పలేదు. కమ్యూనిస్టులు పనిచేసే పార్టీల్లో కమ్యూనిస్టులు కాని వారు, కాంగ్రెస్‌ విధానాలకు రోసి పోయిన వారు కూడా ఉండేవారు. కమ్యూనిస్టులైన వారు కాంగ్రెస్‌ సభ్యులుగా కూడా ఉండేవారు. క్రమంగా కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ అవతరించింది. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ స్థాపన సంకల్పం జైళ్లలో అంకురించిందే. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలో మార్క్సిజం ప్రభావం ఉన్నవారు, మార్క్సిజం మీద విశ్వాసం కుదిరిన వారు, సోషలిస్టులు కూడా ఉండే వారు. 1934 అక్టోబర్‌ లో బొంబాయిలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ మహాసభ జరిగింది. గాంధేయవాదాన్ని నమ్మే వారి దగ్గరనుంచి మార్క్సిస్టు భావజాలం ఉన్నవారు కూడా ఆ మహాసభలో పాల్గొన్నారు.
శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని జైళ్లకెళ్లిన వారు మార్క్సిజం ప్రభావం వల్ల జైళ్ల నుంచి విడుదలైనప్పుడు కమ్యూనిస్టులుగా బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టారు. శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం దాదాపు లక్ష మందిని జైళ్లల్లో పెట్టింది. అలా జైలులో ఉన్నప్పుడు కమ్యూనిస్టు లుగా మారినవారు అనేకమంది కనిపిస్తారు. ఉదాహరణకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వినయ కృష్ణ చౌదరి, హరే కృష్ణ కోనార్‌, సరోజ్‌ ముఖర్జీ లాంటి వారు కమ్యూనిస్టులుగా రూపాంతరం చెందారు. కమ్యూనిస్టు భావాలు ఉన్న కొందరు శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనకూడదని వాదించారు. అంటే గాంధీజి నాయకత్వంలో నడుస్తున్న ఉద్యమంపై భిన్నభావాలు ఉండేవి. బెంగాల్‌లో బంకించంద్ర ముఖర్జీ, అబ్దుల్‌ రజాక్‌, మోనీసింగ్‌ లాంటి వారు జైలుకెళ్లినప్పుడు కాంగ్రెస్‌ వాదులైతే విడుదలయ్యే నాటికి కమ్యూనిస్టులు. అంటే జైళ్లు కమ్యూనిస్టులకు నారు మళ్లుగా ఉపకరించాయి. కేరళలో కృష్ణ పిళ్లే, ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌, ఎ.కె.గోపాలన్‌ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వీరే తరవాత కమ్యూనిస్టు పార్టీని బొలోపేతం చేశారు. 1931 నవంబర్‌ ఒకటిన హరిజనులు గురువాయూర్‌ ఆలయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. దానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులే. ఎ.కె. గోపాలన్‌ కేరళ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా ఉండేవారు. ఆ తరవాతే కమ్యూనిస్టు అయ్యారు. ఆంధ్ర ప్రాంతంలో 1934 నాటికి కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిరది. సోషలిస్టు భావాలవైపు ఆకర్షితులైన దక్షిణాది వారు కమ్యూనిస్టుల య్యారు. 1934లో బ్రిటిష్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం విధించింది. సరిగ్గా ఇదే సమయంలో స్పెయిన్‌ లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతర్యుద్ధం జరిగింది. ఆ అంతర్యుద్ధంలో అనేకమంది మేధావులూ పాల్గొన్నారు. ఆ అంతర్యుద్ధంలో పాల్గొన్న రాల్ఫ్‌ ఫాక్స్‌ లాంటి రచయితలు ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా అదే 1936వ సంవత్సరం మన దేశంలో సాహిత్య, సాంస్కృతిక రంగాలలో కమ్యూనిస్టు పార్టీ విస్తరించడానికి బీజం వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు