బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వ ఊతం
అధికారులకు, ప్రజాప్రతినిధులకు నెలవారీ మామూళ్లు
పేదలకు సన్నబియ్యంతోనే మాఫియాకు కళ్లెం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం తీవ్ర చర్చనీయాంసంగా మారింది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా కాకినాడ పోర్టుకు వెళ్లి… భారీ ఎత్తున జరుగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేయడం, సీజ్డ్ ద షిప్ అంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ వ్యవహారం ఎక్కడకు దారి తీస్తుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఒకే పార్టీకి చెందిన వారు అంటూ ఉండరు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ప్రమేయం, మద్దతు లేకుండా కాకినాడ పోర్టు వరకూ వివిధ ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో పీడీఎస్ బియ్యం రావడం అసాధ్యం. చాలా ప్రాంతాల్లో అధికార, విపక్ష నేతలకు 60:40, 70:30 నిష్పత్తిలో వాటాలు ఇవ్వడం బహిరంగ రహస్యం. అలానే పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు నెలవారీ చెల్లింపులు జరుగుతున్నందున పీడీఎస్ బియ్యం (రేషన్) లారీలకు లారీలు కాకినాడ పోర్టు వరకూ తనిఖీలకు చిక్కకుండా వెళుతున్నాయి. ఈ వ్యాపారం ద్వారా దిగువ స్థాయిలో లక్షల్లో, ఎగువ స్థాయిలో కోట్లలో ఆదాయం వస్తుండటంతో జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులనూ సంతృప్తి పరుస్తున్నారు. కాకపోతే గత ప్రభుత్వంలో తెరముందు వైసీపీ నేతలు ఉంటే… ఇప్పుడు కూటమి నేతలు వచ్చారు. రాజకీయంగా పార్టీలు వేరైనప్పటికీ ఈ అక్రమ వ్యాపారంలో అయా పార్టీల నేతలు అందరూ సిండికేట్‌గానే ముందుకు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలంటే కొనుగోలు(కిందిస్థాయిలోనే) వద్ద కట్టడి చేయకుండా చివరి పాయింట్ (ఎగుమతి, కాకినాడ పోర్టు) వద్ద కట్టడి చేయాలని ప్రయత్నించడం అవివేకం…అసంబద్ధం అవుతుంది. రాష్ట్రంలో దాదాపు 80 శాతానికి పైగా ప్రజలు సన్న బియ్యం (సాంబ మసూరి) తినేందుకు అలవాటు పడ్డారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం (దొడ్డు బియ్యం) తినలేక కార్డుదారులే ఎక్కువమంది స్వచ్ఛందంగా ఎండీయూ ఆపరేటర్లకు లేదా ఆయా గ్రామాల్లో బియ్యం కొనుగోలుదారులకు అమ్ముతుంటారు. కేజీకి రూ.10 నుంచి రూ.12 వరకూ ఆయా ప్రాంతాలను బట్టి కార్డుదారులు బియ్యం బదులు డబ్బులు తీసుకుంటుంటారు. ఇక గ్రామం, మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ పాయింట్‌కు ఈ రేషన్ బియ్యం తరలివెళ్లి… అక్కడ నుండి కాకినాడ పోర్టుకు నేరుగా లారీల్లో వెళుతున్నాయి. ఈ మధ్యలో వ్యాపారం చేసే వారందరికీ క్వింటాకు రూ.200 నుంచి రూ.400 వరకూ గిట్టుబాటు అవుతుంటుంది. రేషన్ బియ్యాన్ని ప్రజలే (20 శాతం మినహా) తినకుండా అమ్ముకుంటారు అనేది కింది నుండి పైస్థాయి అధికారుల వరకూ, గ్రామస్థాయి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకూ తెలిసిన విషయమే. అందుకే గత ఎన్నికలకు ముందు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్‌మోహనరెడ్డి హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని ఆయన విస్మరించారు. నాడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొడాలి నాని తాము సన్నబియ్యం హామీ ఇవ్వలేదని, నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పి… రేషన్ బియ్యంలో నూక శాతం తగ్గించి ఒక పట్టు పట్టి (సన్నం చేసి) షార్టెక్స్ పేరుతో కార్డుదారులకు పంపిణీ చేస్తూ వచ్చారు. రేషన్ బియ్యం (దొడ్డు)ను ఒక పట్టు (మర ఆడిస్తే) పడితే అవి సన్నబియ్యంగా కనిపిస్తాయి. కానీ సాంబ మసూరి బియ్యం అయిపోవు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వమైనా కార్డుదారులు తినే బియ్యం రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తే అసలు స్టార్టింగ్ పాయింట్ వద్దే పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోళ్లు నిలిచిపోతాయి. కార్డుదారులు ఎవరూ పీడీఎస్ బియ్యాన్ని విక్రయించరు. దీంతో గ్రామ, మండలస్థాయి నుంచే పీడీపీస్ బియ్యం కొనుగోలు, అమ్మకాలు నిలిచిపోతాయి. తద్వారా కాకినాడ పోర్టుకు ఒక్క పీడీఎస్ బియ్యం లారీ కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. వాస్తవానికి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో తప్పిదం అందరిదీ ఉంది. తినే బియ్యం ఇవ్వకపోవడం పాలకుల తప్పయితే… ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చిన బియ్యాన్ని వ్యాపారికి విక్రయించడం కార్డుదారుల తప్పు. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని గ్రామ, మండల స్థాయిలో కొనుగోలు చేయడం, కాకినాడ పోర్టుకు తరలించడం, అక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేయడం వ్యాపారులు చేస్తున్న పొరపాటు. వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, నేతల తప్పు. అందుకే పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టుకు వెళ్లి అక్రమ బియ్యం స్మగ్లింగ్‌పై నానా యాగీ చేస్తున్నా ప్రజల నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు. ఈ అక్రమ వ్యాపారం పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఉంటే కేంద్రం ద్వారా సరఫరా అయి నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వమే కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి… కార్డుదారులకు తినే బియ్యం (సాంబమసూరి, సన్నబియ్యం) సరఫరా చేయాలన్నది ప్రజల అభిప్రాయంగా ఉంది.