Friday, June 6, 2025
Homeవిశ్లేషణతెలంగాణ రైతు పోరాటంలో ప్రముఖ పాత్ర

తెలంగాణ రైతు పోరాటంలో ప్రముఖ పాత్ర

మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను అధ్యయనం చేయటం, వాటిని దేశ కాలమాన పరిస్థితులకు అన్వయించడం, పార్టీని నిర్మించడం, ఎట్టి గడ్డు పరిస్థితులనైనా ఎదిరించి నిలబడటం వంటి కార్యక్రమాలను ఆయన సుశిక్షితుడైన సైనికుడిగా, నాయకుడిగా నిర్వర్తించేవాడు. తెలంగాణ సాయుధ పోరాటం, తెభాగా ఉద్యమం, పున్నప్రవాయలార్‌ తిరుగుబాట్ల ద్వారా సాయుధ పోరాటం దేశ స్వాతంత్య్రానికీ, సమ సమాజ ఏర్పాటుకి దారి తీస్తుందని నమ్మాడు. కాని స్వాతంత్య్రానంతరం ఏర్పడ్డ ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకం, సుశిక్షితమైన భారత మిలిటరీని ఎదుర్కోవటం వల్ల తెలంగాణలో పార్టీ కేడరుకి కలిగిన నష్టాలు చూసిన తర్వాత పంథాను మార్చుకున్నాడు. నెలల పాటు అడవుల్లో తిరిగి, గెరిల్లా దళాలను పోరాట విరమణకు, ఆయుధాల అప్పగింతకు ఒప్పించాడు. జాతీయ ప్రజాస్వామ్య ఐక్య సంఘటనను ఏర్పాటు చేయడం, శాంతియుత పోరాటాల ద్వారా సోషలిస్టు శక్తులు పెట్టుబడిదారీ శక్తులపై విజయం సాధించగలవనే నమ్మి, శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. భూ పోరాటాలు, వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణకు చేస్తున్న ఉద్యమాలను దేశ వ్యాపితంగా ముందుండి నడిపించాడు. మహిళా, యువజన ఉద్యమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర వహించి, ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌, ఆర్డర్‌ ఆఫ్‌ డిమిట్రావ్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను పొందారు. 25 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని, ఉద్యమాలను నడిపారు.ఆయన బెనారస్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడే గోల్వాల్కర్‌తో సైద్ధాంతికంగా తలపడ్డాడు. మతతత్వవాదులను భౌతికంగా కూడా ఎదిరించాడు. మచిలీపట్నం, విజయవాడల్లో రౌడీయిజాన్ని అణచివేశాడు. మత సామరస్యం కోసం పోరాడి, సెక్యులర్‌ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశాడు. మత కల్లోలాలు జరిగినప్పుడు బాధితులకు పార్టీ కార్యకర్తలు సాయపడేటట్లుగా దిశా నిర్దేశం చేసేవాడు. సోషలిజం, సెక్యులరిజంలతో పాటు భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యానికి కూడా స్థిరమైన స్థానం ఉంది. కమ్యూనిస్టు ప్రణాళికలో ‘శ్రామిక వర్గ నియంతృత్వం’ అనే అంతిమ లక్ష్యం ఉంటుంది. సమాజంలో అనాదిగా భావవాదం, భౌతికవాదాల మధ్య సంఘర్షణ ఉంది. సైన్సుకి భౌతికవాదం పునాది. కార్యకారణ సంబంధం సైన్సుకి ప్రాతిపదిక. భారత రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, శాస్త్రీయ దృక్పథం కీలకాంశాలుగా ఉన్నాయి. ఈ విలువలన్నిటినీ కమ్యూనిస్టు పార్టీ, రాజేశ్వరరావు అనునిత్యం కాపాడేవారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు