ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాకు చంద్రబాబు వినతి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏపీ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని, అప్పులకు వడ్డీలు చెల్లిచంచడం కూడా భారంగా మారిందని, ఈ పరిస్థితుల్లో మీరే ఆదుకోవాలని ఆర్థిక సంఘాన్ని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియాతో సోమవారం సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఆయనకు వివిధ అంశాలపై చంద్రబాబు సమగ్రంగా వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల పరిణామాలను పనగారియా దృష్టికి తీసుకెళ్లారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రంగాల వారీగా జరిగిన నష్టంపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్థిక విధ్వంసం ఏ విధంగా జరిగిందో… అభివృద్ధి ఊసేలేకుండా చేసిన పరిస్థితులను సీఎం వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి అతి తక్కువ జీడీపీ ఉంది. గత ఐదేళ్లలో సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. రూ.లక్షన్నర కోట్లకు పైగా బిల్లులు పెండిరగ్లో పెట్టారు. అప్పులు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నీతిఆయోగ్ కూడా చెప్పిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తమకు ఆ అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టడం కూడా భారంగా మారిందని తెలిపారు. తమను ఆర్థికంగా గట్టెక్కించే చర్యలకు సహకరించాలని చంద్రబాబు కోరారు. పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పరిశ్రమలు వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని ఎలా తయారు చేస్తోందో తెలియజేస్తూ… పోర్టు ఆధారిత అభివృద్ధికి ఉన్న మార్గాలపై వివరించి… అందుకు సహకరించాలని కోరారు. పోర్టు ఆధారిత, పరిశ్రమల ఆధారిత అభివృద్ధి ఎలా చేయాలన్న దానిపై కీలకంగా చర్చించారు. డీప్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, ఏఐకు సంబంధించిన విషయాలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలపై ప్రజెంటేషన్‌లో సవివరంగా సీఎం వెల్లడిర చారు. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు పోర్టుల ద్వారానే ఎక్కువ ఆదాయం సాధిస్తున్నాయని, తెలంగాణ మాత్రమే అందుకు భిన్నంగా ఉందని తెలిపారు. తెలంగాణ కూడా ఎక్కువగా హైదరాబాద్ ఆధారంగానే అభివృద్ధి పథంలో ఉందని, గతంలో చేపట్టిన చర్యలు హైదరాబాద్‌ను ప్రపంచానికి అనుసంధానం చేశాయని పనగారియా పేర్కొన్నారు. బిల్ గేట్స్ హైదరాబాద్ రావడం, దాని కొనసాగింపుగా… చాలా ప్రపంచ సంస్థలు ఎలా హైదరాబాద్‌కు అనుసంధానం అయ్యాయన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్థిక వ్యవహారాల్లో గుజరాత్, మహారాష్ట్ర మోడల్స్‌తో పాటు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రయోగంలో హైదరాబాద్ మోడల్ ఎలా విజయవంతం అయిందో ఇద్దరి మధ్య చర్చ జరిగింది. వీటితో పాటు 2014-19 మధ్య స్వచ్ఛ భారత్, డిజిటల్ కరెన్సీ వంటి విషయాల్లో చంద్రబాబు ఇచ్చిన నివేదికలు, ప్రస్తుతం వాటి ఫలితాలను చర్చ సందర్బంగా అరవింద పనగారియా ప్రస్తావించినట్లు తెలిసింది. చంద్రబాబు వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతర అధికారులు ఉన్నారు.