Thursday, May 8, 2025
Homeసంపాదకీయంనాలుగు యుద్ధాలుఒక నిర్ణాయక విజయం

నాలుగు యుద్ధాలుఒక నిర్ణాయక విజయం

పహల్గాం లో ఏప్రిల్‌ 22వ తేదీన తీవ్రవాదుల ఘాతుకం భారత-పాకిస్థాన్‌ సంబంధాలు తీవ్రంగా బెడిసిపోయేట్టు చేసింది. ఈ దాడి తరవాత సింధు నది జలాల ఒప్పందాన్ని స్థగితం చేశారు. అట్టారి-వాఘా సరిహద్దును మూసివేశారు. దౌత్య సంబంధాలు నిలిచిపోయాయి. పాకిస్థాన్‌ను మట్టిగరిపిస్తాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనడంతో పాకిస్థాన్‌ మీద యుద్ధం అనివార్యం అన్న అభిప్రాయం కలిగింది. దేశవాసుల్లో అనేక మంది పాకిస్థాన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటే యుద్ధం ఒక్కటే మార్గం అన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ అభిప్రాయానికి రావడానికి కారణం పాకిస్థాన్‌ ముస్లిం దేశం కావడమే ప్రధాన కారణం. ముస్లింలను ద్వేషించడానికి కావలసిన భూమిక గత పదకొండేళ్ల మోదీ పాలనలో బలంగా ఏర్పడిరది. పాకిస్థాన్‌ను మన దేశం మీద తీవ్రవాదులను ఉసి గొల్పుతున్న దేశంగా కాక ముస్లింల మీద కక్ష తీర్చుకోవాలన్న కసి చాలామందిలో పెరిగిపోయింది. యుద్ధం ప్రకటించకుండా మోదీ తాత్సారం చేస్తున్నారన్న భావనలూ చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం (మే 7వ తేదీ) మాక్‌ డ్రిల్లులు నిర్వహించాలని రాష్ట్రాలను కోరింది. ఇది మన యుద్ధ సన్నద్ధతను బేరీజు వేయడానికి ఉపకరిస్తుంది. ఈ లోగా పాకిస్థాన్‌ తమకు తోచిన చర్యలు తీసుకుంటోంది. తన సరిహద్దులను పటిష్ఠం చేస్తోంది. పహల్గాం సంఘటన జరిగి 15 రోజులు గడిచినా యుద్ధం జరగకపోవడం సానుకూల అంశమే. పాకిస్థాన్‌ ఆగడాలను నిరోధించడానికి యుద్ధం పరిష్కారం కాదని గత చరిత్ర నిరూపిస్తోంది. పాకిస్థాన్‌ కన్నా మన సైనిక శక్తి ఎక్కువే. సందేహం లేదు. కానీ రెండు దేశాల దగ్గరా అణ్వస్త్రాలు ఉన్నాయన్న వాస్తవాన్ని రెండు పక్షాలూ గమనించవలసిందే. 1947లో స్వాతంత్య్రం సంపాదించినప్పటి నుంచి భారత పాకిస్థాన్‌ మధ్య అనేక సార్లు ఘర్షణలు జరిగాయి. ఇవన్నీ యుద్ధ స్థాయిలో లేకపోవచ్చు. ఈ ఘర్షణలకు కేంద్ర బిందువు కశ్మీరే. స్వాతంత్య్రం సాధించిన వెంటనే 1947-48లో పాకిస్థాన్‌ మన దేశం మీద యుద్ధానికి దిగింది. కానీ ఆ యుద్ధం ప్రతిష్ఠంభనగానే మిగిలి పోయింది. మనం కశ్మీర్‌లోని కొంత భాగాన్ని కోల్పోయాం. దాన్నే ఆక్రమిత కశ్మీర్‌ అంటున్నాం. అప్పుడు కాల్పుల విరమణ జరిగింది. అధీనరేఖ అమలులోకి వచ్చింది. ఆక్రమిత కశ్మీర్‌ అన్న మాటే మన వైఫల్యానికి నిదర్శనం. అప్పటి పరిస్థితులు ఏమైనా కావచ్చు. కానీ మనం కొంత భూభాగం కోల్పోయామన్నది వాస్తవం. ఆ తరవాత 1965లో మరోసారి రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. తాష్కెంట్‌ ఒప్పందం కారణంగా యుద్ధం ముగిసినా ఆ యుద్ధ ఫలితం ప్రతిష్టంభనకే దారి తీసింది. తమ భాష, సంస్కృతులను పరిరక్షించుకోవడానికి పశ్చిమ పాకిస్థాన్‌లో కూర్చున్న పాక్‌ పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా ముజిబుర్‌ రహమాన్‌ నాయకత్వంలో మహోద్యమం కొనసాగింది. 1971లో జరిగిన యుద్ధంలో మనం బంగ బంధు ముజీబ్‌ కు మద్దతిచ్చాం. ఈ క్రమంలో జరిగిన యుద్ధం పర్యవసానంగానే బంగ్లాదేశ్‌ అవతరించింది. పాకిస్థాన్‌ రెండు ముక్కలైంది. ఈ దృష్టితో చూస్తే మనం నిర్ణాయక విజయం సాధించనట్టే లెక్క. 1999లో జరిగిన యుద్ధంలో పాక్‌ సేనలు ఆక్రమించిన భూభాగాన్ని కాపాడుకోగలిగాం. కానీ ఇది పరిమిత యుద్ధమే. మనం పాక్‌ భూభాగంలోకి వెళ్లకుండానే మన లక్ష్యం సాధించాం. 1984-2003 మధ్య సియాచిన్‌ ఘర్షణ, 2001-2002 పార్లమెంటు మీద దాడి కారణంగా భారత-పాకిస్థాన్‌ మధ్య ప్రతిష్టంభన కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది.
ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన మన పాలకులకు కొదవలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాట చెప్తోంది. 1971 యుద్ధంలో మన సేనలు లాహోర్‌ దాకా వెళ్లాయి కానీ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నమే చేయలేదు. 2001-2002లో పాకిస్థాన్‌ తీవ్రవాదులు భారత పార్లమెంటు భవనంపై దాడికి తెగబడ్డారు. దాడికి పాల్పడ్డ వారిని మన భద్రతా దళాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి. చివరకు దౌత్య మార్గాల ద్వారానే ఆ ప్రతిష్టంభన తొలగి పోయింది. 2008లో ముంబై మీద పాక్‌ తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడులకు పాకిస్థాన్‌లోని తీవ్రవాదులే కారణం అన్న భావనకు బలం చేకూరింది. అప్పుడు పాకిస్థాన్‌ సరిహద్దుల్లోకి సైన్యాన్ని పంపింది. వైమానిక దళాలను సన్నద్ధం చేసింది. మళ్లీ దౌత్య మార్గంలోనే ఉద్రిక్తతలు తగ్గాయి. 2016లో ఊరిలో భారత సైనిక శిబిరంపై దాడి జరిగినప్పుడు భారత్‌ ‘‘సర్జికల్‌ స్టైక్‌’’ చేసిందంటున్నారు. దీనివల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 2019లో పుల్వామా దాడి జరిగింది. ఈ దాడిలో మన సీఆర్‌పీ జవాన్లు దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మన దళాలు దాడి చేశాయి. అప్పుడు పాకిస్థాన్‌ సైన్యం మన పైలెట్‌ను బందీగా పట్టుకుంది. ఆ తరవాత విడుదల చేసింది. పాకిస్థాన్‌ వైమానిక దాడులకు దిగింది. అప్పుడు ఉద్రిక్తత తీవ్ర స్థాయికి చేరింది. 2019 ఆగస్టు 5న మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేసింది. ఆ సమయంలో కాల్పుల విరమణకు అనేక సార్లు భంగం కలిగింది. ఈ యుద్ధాల చరిత్ర రెండు దేశాల మధ్య వివాదాలు సమసి పోయేట్టు చేసిన దాఖలాలైతే లేవు. పహల్గాం దాడుల తరవాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు సింధు నదీ జలాలు అందకుండా చేస్తామని హుంకరించింది. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదని తేలిపోయింది. పహల్గాం ఘాతుకాన్ని అనేక దేశాలు ఖండిరచిన మాట వాస్తవమే. కానీ మనం పాకిస్థాన్‌ మీద నిజంగా యుద్ధానికి దిగితే ఈ దేశాల్లో అనేకం మనకు అండగా నిలబడే అవకాశం కనిపించడం లేదు. మాట వరసకు మద్దతివ్వడం వేరు. ఆచరణలో యుద్ధానికి దిగినప్పుడు అండగా ఉండడం వేరు. చైనా మాత్రం పాకిస్థాన్‌కు అండగా ఉంటానంటోంది. కానీ యుద్ధం జరిగే పరిస్థితే వస్తే చైనా కూడా పాకిస్థాన్‌ తరఫున యుద్ధంలో భాగస్వామి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మనం సింధు నదీ జలాలను స్థగితం చేస్తామంటే పాకిస్థాన్‌ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామంటోంది. నిజానికి సిమ్లా ఒప్పందాన్ని పాకిస్థాన్‌ పాటించిన సందర్భాలే తక్కువ. ఈ ఒప్పందాన్ని బాహాటంగా ఉల్లంఘించి పాకిస్థాన్‌ ద్వైపాక్షిక అంశానికి కట్టుబడాలన్న సూత్రాన్ని జవదాటి అంతర్జాతీయ వేదికల మీద అనేకసార్లు కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తింది. ఇలాంటి విషయాలలో గానీ, మన దేశంలో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టండంలో కానీ పాకిస్థాన్‌ ఏనాడూ నియమాలకు కట్టుబడిరది లేదు. ఇలాంటి వైఖరిని చూపించడానికి యుద్ధం పరిష్కారం కాదు. దౌత్యపరంగా ఒత్తిడి తీసుకోవడం ఒక్కటే మార్గం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు