Homeతెలంగాణపేదలకు గూడు కల్పించడమే లక్ష్యం

పేదలకు గూడు కల్పించడమే లక్ష్యం

- Advertisement -

సామాజిక న్యాయానికి పెద్దపీట – అర్హులందరికీ ఇళ్లు మంజూరు: కూనంనేని

విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: పేదలందరికీ గూడు కల్పించడమే లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 29 డివిజన్లకు, 36 మున్సిపల్ వార్డులకు చెందిన నిరుపేదలకు లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించే ప్రక్రియ గురువారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ… పాతకొత్తగూడెంలో జి-2 విధానంలో 23 బ్లాకులుగా మొత్తం 828 ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయని, గతంలో కొందరిని ఎంపిక చేయడం జరిగిందని గుర్తుచేశారు. మిగిలిన 214 మంది అర్హులైన పేదలను పూర్తి పారదర్శకంగా ప్రజా సమక్షంలో లాటరీ తీసి కేటాయించినట్లు వివరించారు. ఈ ఎంపిక ప్రక్రియలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. 214 ఇళ్లలో 70 ఇళ్లు ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, దివ్యాంగులకు కేటాయించామని పేర్కొన్నారు. 144 ఇళ్లను ఓపెన్ కేటగిరీ కింద లబ్ధిదారులకు అందజేశామన్నారు. గూడు లేని నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే బాధ్యతగా పనిచేస్తున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ అంకిత్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే స్ఙార్ పాషా, మేయర్ గణేష్, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, కొత్వాల శ్రీనివాసరావు, మండే హన్మంతరావు, లలిత కుమారి, కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్రాభివృద్ధి
ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్కే నగర్ కమ్మ సత్రంలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు మండలాల పంచాయతీ సర్పంచులు, సెక్రటరీలు, సిబ్బందికి ‘వీబీ జీ రామ్ జీ’ పథకంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కూనంనేని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు మెరుగుపడే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. శ్రమజీవులకు 125 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. 375 రకాల అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు. ప్రధానంగా నీటి భద్రత, మౌలిక వసతులు, స్థిరమైన జీవనోపాధి అంశాలపై ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. డీఆర్‌డీవో విద్యాచందన, ఎంపీడీవోలు, ఎంపీవోలు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు