ధన్కర్ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై దాడి
. దేశంలో ఎమర్జెన్సీ ముందు పరిస్థితులు
. ఆవుల మృతిపై దిగజారుడు రాజకీయాలు
. వక్ఫ్ సవరణ చట్టంపై చంద్రబాబు తీరు మారాలి
. పారదర్శకంగా రాజధాని నిర్మాణం
. ప్రచారం కోసమే అమరావతికి మోదీ
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని, సాక్షాత్తు రాజ్యాంగ పదవిలో ఉన్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్…న్యాయవ్యవస్థను కించపర్చే రీతిలో వ్యాఖ్యల దాడి చేయడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ధ్వజమెత్తారు. దేశంలో నాడు ఎమర్జెన్సీకి ముందున్న ప్రమాదకర, విపత్కర పరిస్థితులు నడుస్తున్నాయని, వాటిని అంతం చేయకుంటే… మరింత తీవ్ర రూపందాల్చే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజతో కలిసి శుక్రవారం రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. గవర్నర్లలో అందరూ ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లేనని, దీంతో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు అమలు చేసిన బిల్లుల్ని అమలు చేయకుండా, ఏళ్ల తరబడి తొక్కిపట్టి… ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వైఖరిని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పులో తప్పుపట్టిందని, అలాంటి బిల్లులను తొక్కిపెట్టే అధికారం గవర్నర్లకు లేదని తేల్చిచెప్పిందన్నారు. ఈ తీర్పును దేశంలోని ప్రజ్వామ్య వాదులంతా స్వాగతించగా… అది జీర్ణించుకోలేని భారత ఉపరాష్ట్రపతి ఏకంగా న్యాయవ్యవస్థపైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు విషయంలోనూ అదే ధోరణితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. దానిపై సుప్రీంకోర్టు…వక్ఫ్‌బోర్డులో అన్యమతస్తులకు స్థానం కల్పిస్తే…దేవాలయ కమిటీల్లోను ఇతరులను పెడతారా? అని ప్రశ్నించిందన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ…లౌకికవాదులు, ప్రజాస్వామిక వాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా… దానిపైనా ఉప రాష్ట్రపతి అవమానించేలా వ్యాఖ్యానించడం సిగ్గుచేటని, ఇది సుప్రీంకోర్టుపై దాడి చేయడమేనని అన్నారు. రాజ్యాంగ బద్ధంగా శాసన వ్యవస్థకు, ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థకు దేనికుండే అధికారాలు దానికే ఉంటాయని రామకృష్ణ వివరించారు. వచ్చిన బిల్లులు రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయా? లేదా? అనే దానిపై తీర్పు చెప్పే బాధ్యత అంతిమంగా న్యాయవ్యవస్థదేనని స్పష్టంచేశారు. సెక్యులర్ వ్యక్తులుగా ఉన్న సీఎంలు చంద్రబాబు, నితీశ్‌కుమార్ ప్రమాదకరమైన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇచ్చి..దేశ వ్యాప్తంగా చిచ్చుపెట్టేలా మారారని, వాస్తవంగా వాళ్లు తలచుకుంటే ఆపేవాళ్లని చెప్పారు. రాజ్యాంగ మనుగడకు విఘాతం కలుగుతున్న ఈ తరుణంలోనైనా చంద్రబాబు ముందుకు వచ్చి… ఈ ప్రతిష్టంభన నుంచి బయటపడడానికి చొరవ చూపాలని కోరారు. దేశంలో ఎక్కడికక్కడ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారని వివరించారు. దేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టుపై ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలపై, వక్ఫ్ సవరణ చట్టంపై, రాష్ట్రాల అధికారాలపైన చర్చ జరుగుతుంటే…ఇవన్నీ పక్కన పెట్టి…రాష్ట్రంలో తిరుపతిలో పక్కా కామెడీ రాజకీయాలు నడుస్తున్నాయని ఎద్దేవాచేశారు. ఎంతసేపూ తిరుపతిలో ఆవులు చనిపోవడం నుంచి నాడు లడ్డూలో కల్తీ సంఘటనలపైనే చర్చ జరుగుతోందన్నారు. ఆవులు వయస్సుమీరి, అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం సహజమేనని… దానిపై టీటీడీ పూర్వపు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చర్చకు పట్టుపడితే… కూటమి పార్టీలు స్వీకరించి ఆయన సూచనలు తీసుకోవడం లేదా అందరూ చర్చించి చర్యలు తీసుకుంటే సరిపోదా అని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
ఆవుల మృతి పై తిరుపతిలో అధికార కూటమి పార్టీల నేతలు, ప్రతిపక్ష వైసీపీ నేతలు సవాళ్లు విసురుకోవడం, రాళ్లు విసురుకుంటూ… ఆంధ్రప్రదేశ్ పరువును దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి రాజధానికి అదనంగా మరో 43వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూ సమీకరణ అంశంపై అడిగిన ఓ ప్రశ్నకు రామకృష్ణ సమాధానమిస్తూ…రాజధానికి తాము సంపూర్ణ మద్దతిస్తున్నామని, నాడు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులను పక్కాగా వ్యతిరేకించామని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో సీఎం చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. తొలుత రాజధానిపై బడ్జెట్ భారం ఉండదని, ఇది స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారన్నారు. తర్వాత కేంద్రం నుంచి నిధులు వస్తాయని, ఆ తర్వాత మనం చేసే అప్పులకు కేంద్రమే షూరిటీ ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదంటూ కూటమి పార్టీలు ప్రచారం చేసుకున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం అమరావతి రాజధానికి హడ్కో, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ నుంచి తెచ్చిన రూ.31వేల కోట్ల అప్పలు చాలదన్నట్లుగా మరో రూ.31వేల కోట్ల అప్పులకు ప్రతిపాదించారని, ఆ మొత్తం వెరసి రూ.62వేల కోట్లకు అప్పు చేరిపోయిందన్నారు. రాజధాని కోసం చేస్తున్న అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదా?, కేంద్ర ప్రభుత్వమేమైనా నిధులిచ్చిందా? లేక ఈ అప్పులను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా? ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఇప్పుడు 62వేల కోట్లు అప్పలు తెస్తూ…అది చాలదన్నట్లుగా మరో 43వేల ఎకరాలకుపైగా భూసమీకరిస్తామంటూ ప్రతిపాదించడం చూస్తుంటే…మీరంతా ఒకే ప్రదేశంలో రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ, దానిని కూటమి నేతలు అడగడం లేదన్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో డెయిరీ ఉత్పత్తులు నిలిచిపోయాయని చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయకుండా…కేవలం అమరావతిపైనే దృష్టి పెట్టడం తగదన్నారు. ఈ ప్రభుత్వం వైఖరితో..రాష్ట్రాభివృద్ధి అంటే…కేవలం అమరావతి, పోలవరమేనా? అని వెనుకబడి ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి నాలుగుసార్లు భూమి పూజలు చేసినా…నాలుగు అడుగులు ముందుకెళ్లలేదని ఎద్దేవా చేశారు. అత్యధికంగా వలసలు ఉండే కర్నూలుజిల్లాలో కనీసం ఒక ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకుండా, గోదావరి`బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రకటించడం తగదన్నారు. మే 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి రాజధానికి రావడంలో ఉపయోగమేమిటని ప్రశ్నించారు. నాడు ప్రధానితో శంకుస్థాపన చేయించగా… ఆయన ముంత మట్టి, చెబుండు నీళ్లు తెచ్చారని, ఈ సారైనా సిమెంటు ఏమైనా తెస్తారా? అని ప్రశ్నించారు. ఒకే కార్యక్రమానికి మళ్లీ..పదేళ్ల తర్వాత అదే ప్రధానితో శంకుస్థాపన చేయడం ప్రచారం కాదా? అని రామకృష్ణ నిలదీశారు.