వామపక్షాల పిలుపు – ఆర్థిక బిల్లుకు 8 సవరణలు
న్యూదిల్లీ : పేదలకు వ్యతిరేకంగా… కార్పొరేట్లకు అనుకూలంగా ‘గొప్పల’ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని వాపమక్షాలు విమర్శించాయి. సంపన్నుల బడ్జెట్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాయి. బడ్జెట్లో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను డిమాండ్ చేశాయి. ప్రజా అనుకూల విధానాలతో బడ్జెట్ ఉండాలని కేంద్రానికి సంయుక్త ప్రకటనలో స్పష్టంచేశాయి. కేంద్రబడ్జెట్ దేశ ప్రజలను మోసం చేసేదిగా ఉందని దుయ్యబట్టాయి. బడ్జెట్ కోసం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ పిలుపునిచ్చాయి. కనీస అవసరాలు తీర్చే విషయంలోనూ దేశ ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్‌ను కేంద్రం తీసుకువచ్చిందని విమర్శించాయి. ప్రజల్లో తగ్గిన కొనుగోలు శక్తి పెరిగేందుకు, నిరుద్యోగ నియంత్రణ, అరకొర వేతనాల మెరుగునకు బడ్జెట్లో ప్రతిపాదనలు లేకపోవడాన్ని ఆక్షేపించాయి. గొప్పల బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించాయి. సంపన్నులు, దిగ్గజ సంస్థలపై పన్నుల విధించడం ద్వారా వనరులను సమకూర్చుకోవడానికి బదులు… ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించడం ద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా కనీస వేతనానికి హామీకి బదులుగా ప్రైవేటు పెట్టుబడులకు బడ్జెట్ పెద్ద పీట వేసిందని దుయ్యబట్టాయి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణలో కేంద్రం దూకుడు ప్రదర్శిస్తోందని ఆక్షేపించాయి. నిరుద్యోగం, ఆహార ధరలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, సామాజిక సంక్షేమం, పట్టణాభివృద్ధి వంటి కీలకాంశాలను బడ్జెట్లో పూర్తిస్థాయిలో విస్మరించినట్లు పేర్కొన్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్ ఉన్నప్పటికీ కేటాయింపు రూ.86వేల కోట్లలో మార్పు లేదని గుర్తుచేశాయి. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయించారు కానీ అధిక ధరలు, జీఎస్టీ వంటి పరోక్ష పన్నుల భారం మోస్తున్న శ్రామిక వర్గానికి ఏం ఇచ్చారని కేంద్రాన్ని వామపక్షాలు ప్రశ్నించాయి. పన్ను మినహాయింపు పరిధిని పెంచడం వల్ల కలిగే నష్టాన్ని సంపన్నులు, కార్పొరేట్లపై పన్ను రేట్లు పెంచడం ద్వారా పూడ్చకుండా కార్పొరేట్లకు, కుబేరులకు బొనాంజా ఇవ్వడాన్ని దుయ్యబట్టాయి.
బడ్జెట్లో చేసిన ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలు అన్నింటినీ తిరస్కరిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) ప్రధాన కార్యదర్శులు డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య, మనోజ్ భాట్టాచార్య, జి.దేవరాజ్, సీపీఎం సమన్వయకర్త ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ప్రజలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను బడ్జెట్లో చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడానికి దోహదమవ్వడమే కాకుండా ఉపాధి/ఉద్యోగావకాశాల కల్పనకు, వేతనాలు పెంచేందుకు ఉపయుక్తంగా ఉండేలా…విద్య, ఆరోగ్యం, సామిజిక భద్రతకు హామీనిచ్చేలా ప్రతిపాదనలు ఉండాలని కేంద్రానికి సూచించారు. ఆర్థిక బిల్లుకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అందులో 1) దేశంలోని 200 బిలియనీర్లపై నాలుగు శాతం ఆస్తి పన్ను విధించాలి. కార్పొరేషన్ పన్ను పెంచాలి. 2) వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ కార్యాచరణ ముసాయిదా చట్టం ఉపసంహరించాలి, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టపరమై హామీ కల్పించాలి. 3) ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, జాతీయ మొనెటైజేషన్ పైప్‌లైన్ ద్వారా ప్రైవేటు రంగానికి ఆస్తుల ధారాదత్తం చేయడాన్ని నిలుపుదల చేయాలి. బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐ విధానాన్ని ఉపసంహరించాలి. 4) ఎంన్ఆర్ఈజీఏ కేటాయింపులో 50శాతం పెంచాలి, పట్టణ ఉపాధి హామీ పథకం తేవాలి, వృద్ధుల పింఛన్లు, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరించాలి. 5) జీడీపీ నుంచి విద్యకు ఆరు శాతం, ఆరోగ్యానికి మూడు శాతం చొప్పున ఖర్చు పెట్టాలి. 6) ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతానికి ఆహార సబ్జిడీ పెంచాలి. 7) ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలి, ఐసీడీఎస్ కోసం వ్యయ పరిమితి పెంచాలి, స్కీమ్ వర్కర్ల కోసం గౌరవ వేతనంలో కేంద్ర వాటా పెంచాలి. 8) రాష్ట్రాలకిచ్చే దాంతో పాటు కేంద్ర పథకాలకు నిధులు పెంచాలి. పెట్రోలియం ఉత్పత్తులపై సెస్‌లు, సర్చార్జిలు రద్దు చేయాలి.
ఇదిలావుంటే, ఆర్థిక బిల్లు ద్వారా బడ్జెట్‌ను ఆమోదించే ముందు తమ డిమాండ్లు/ప్రతిపాదనలకు స్థానం కల్పించేలా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రచారోద్యమాన్ని చేపట్టనున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని చైతన్య పరిచి తమ ప్రతిపాదనలకు మద్దతు పొందేందుకుగాను ఇంటింటి ప్రచారం, వీధి కూడళ్లలో సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాల రూపేణ కార్యక్రమాల కార్యాచరణను వామపక్షాల రాష్ట్ర శాఖలు సిద్ధం చేస్తున్నాయి.