హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోన్న ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన లుక్‌టెస్ట్‌ను పూర్తి చేశారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రెండో సినిమా రానున్న విషయం తెలిసిందే. మెగా 158గా ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమా అప్‌డేట్‌ను దర్శకుడు పంచుకున్నారు. ఈ రోజు లుక్‌టెస్ట్ పూర్తయిందని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చిరు ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ ‘హింసకు ముందు నిశ్శబ్దం’ అనే క్యాప్షన్ రాశారు. దీంతో భారీ స్థాయి యాక్షన్ చిత్రంగా ఇది రానున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో గతంలో ‘వాల్తేరు వీరయ్య’ రూపొందింది. 2023లో వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణను సొంతం చేసుకోవడంతో వీరి రెండో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’తో హిట్ అందుకున్న చిరంజీవి మూడు సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు శ్రీకాంత్ ఓదెల చిత్రం లైనప్‌లో ఉంది.


