. విశాలాంధ్ర బుక్‌స్టాల్‌లో పుస్తకం తగలబెట్టడంపై సీపీఐ ఖండన
. హిందుత్వ భావజాలపక్ష పొత్తులతోనే దాడులు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం తీర్మానం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాజ్యాంగంలో పొందుపర్చిన భావప్రకటన స్వేచ్ఛపై మతోన్మాద శక్తులు దాడులకు పాల్పడడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్రంగా ఖండిరచింది. హైదరాబాద్ పుస్తక మహోత్సవంలో ఎన్.వేణుగోపాల్‌పై జరిగిన దాడి, తిరుపతి పుస్తక మహోత్సవంలో విశాలాంధ్ర బుక్‌హౌస్ స్టాల్‌లో ఒక పుస్తకాన్ని చించి తగలబెట్టడానికి చేసిన ప్రయత్నం, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ ఇంట్లోకి చొరబడి ఆయనపై చేసిన దాడులను సీపీఐ తీవ్రంగా తప్పుపట్టింది. విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం మంగళవారం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కర్తవ్యాలను వివరించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, జి.ఈశ్వరయ్య, పి.రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్, డి.జగదీశ్, జంగాల అజయ్‌కుమార్, డేగా ప్రభాకర్ హాజరయ్యారు. సమావేశం ఈ దిగువ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. భావజాల వ్యతిరేకులతోపాటు భావజాల సమర్ధకులు దాడికి లక్ష్యంగా మారుతున్నారని, హిందుత్వ అనుకూలవాదులు నడిపే యూట్యూబ్ ఛానెళ్లలో అది కొంతకాలంగా కొనసాగుతోందని, ‘ధర్మరక్షణ’కు విరాళాల సేకరణ పేరిట డబ్బు కోణం కూడా దీనికి జతపడడం స్పష్టంగా కనిపిస్తోందని సమావేశం అభిప్రాయపడిరది. ‘ధర్మరక్షణ’ లక్ష్యం కాస్తా డబ్బు సంపాదన లక్ష్యంగా మారినప్పుడు వ్యతిరేకులు, అనుకూలురన్న తేడా చెరిగిపోవడం సహజమేనని, ఇలాంటివి ముందు ముందు ఇంకా చూసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పది, పదకొండేళ్లుగా ఉత్తరభారత రాష్ట్రాల్లో… అందులోనూ హిందుత్వ భావజాలపక్షం, దానితో పొత్తు ఉన్న పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి దాడులు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయని, ఇప్పుడు ఇతర పక్షాలు అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లోనూ పుంజుకుంటున్నాయని సమావేశం తెలిపింది. ఈ విధంగా పార్టీ భేదాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా హిందుత్వ జనాన్ని ‘ఒకటి’గా ముడివేస్తున్నారని పేర్కొంది. 21వ శతాబ్దం నుంచి స్వాతంత్య్రం కన్నా ముందు రోజులకు, బ్రిటిష్ పాలన తొలిరోజులకు, ఇంకా అంతకన్నా వెనుకబడిన రోజుల్లోకి వెళుతున్నామని, రాచరిక కాలంలో శాంతిభద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉండేది కాదని, దోపిడీ దొంగలు స్వైరవిహారం చేసేవారని వివరించింది.
ఇవన్నీ స్థూలంగా దేశంలో ఒకప్పుడు శాంతిభద్రతల వ్యవస్థ ఎంత ఘోరంగా ఉండేవో చెబుతాయని, రెండు శతాబ్దాల విరామం తర్వాత ఇప్పుడు భారత్ తన స్వరూపాన్ని ఆసేతు హిమాచల పర్యంతం మరోసారి చాటుకుంటోందని పేర్కొంది. రాజుల కాలంలో కనీసం ఇంటి దగ్గర అయినా ఎంతోకొంత రక్షణ ఉండేదేమో కానీ… నేటి రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ ప్రజాస్వామ్య భారతంలో ఇంటిదగ్గర కూడా రక్షణ కరువైందని రంగరాజన్‌పై దాడి రుజువు చేస్తున్నట్లు సమావేశం స్పష్టం చేసింది.