Friday, May 2, 2025
Homeమద్యం కుంభకోణంకసిరెడ్డే కీలకం

మద్యం కుంభకోణంకసిరెడ్డే కీలకం

రూ.3,200 కోట్ల అవినీతి జరిగిందని సిట్‌ నిర్ధారణ
వైసీపీ కీలక నేతల్లో వణుకు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డి కటకటాలపాలు కావడంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన మద్యం నూతన పాలసీ ద్వారా రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ధృవీకరించడంతో పాటు ఇందులో రాజ్‌ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖరరెడ్డి) కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారించింది. న్యాయస్థానం రిమాండ్‌ ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో నెంబర్‌ `2 గా వెలుగొందిన అప్పటి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ఈ కేసులో నిందితుడుగా ఉండగా, ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాత మద్యం వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన పాలసీపై తమ ఇంట్లోనే రెండు సార్లు భేటీ జరిగినట్లు, వంద కోట్లు అప్పుగా ఇప్పించినట్లు చెప్పారు. మద్యం వ్యవహారంలో కసిరెడ్డి కీలక వ్యక్తి అని చెప్పారు. దిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం పది పదిహేను రెట్లు పెద్దదని మొదటి నుంచి టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్‌ అధికారులు ధృవీకరిస్తుండగా, అనధికారికంగా (ఎన్‌డీపీ, నాన్‌ డ్యూటీ పెయిడ్‌) జరిగిన విక్రయాలతో ముడుపుల కైంకర్యం వేలాది కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసి అవినీతి దందాను కసిరెడ్డి నిర్వహించారనేది ప్రధాన ఆరోపణ. ఏపీ మద్యం కుంభకోణం దిల్లీ కుంభకోణం కంటే అతిపెద్దదని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో కోరడంతో పాటు ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు స్వయంగా అందజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కసిరెడ్డి మారుపేరుతో దేశం విడిచి పరారయ్యే ప్రయత్నంలో ఉండగా, సిట్‌ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అంతకు ముందే కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు కెసిరెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులు, కంపెనీల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచి ముడుపులను తను ఏర్పాటు చేయించిన షెల్‌ కంపెనీలకు వచ్చేలా చేయడంలో కసిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్‌ అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని రిమాండ్‌ రిపోర్టులోనూ ప్రస్తావించారు. మద్యం ముడుపులను కొన్ని కంపెనీలు కసిరెడ్డి సూచించిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, సినిమాలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. సినిమాలో పెట్టుబడులు పెట్టేందుకు బినామీ పేర్లతో ఈడీ క్రియేషన్స్‌ అనే సంస్థను నెలకొల్పారని అంటున్నారు. ఇప్పటికే వివిధ సినిమాల నిర్మాణంలో కసిరెడ్డి భాగస్వామిగా ఉన్నారు. కూతురు ఇషానీ పేరుతో కసిరెడ్డి ఓ ఇన్ఫ్రా సంస్థను నెలకొల్పారని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో సిట్‌ అధికారులు 29 మందిని నిందితులుగా గుర్తించగా, ఏ 1 కెసిరెడ్డి, ఏ 2 గా వాసుదేవరెడ్డి, ఏ 3గా, వెంకట సత్యప్రసాద్‌, ఏ 4 గా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఏ 5 గా విజయసాయి రెడ్డి, ఏ 6 గా సజ్జల శ్రీధర్‌ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీకి చెందిన కీలక వ్యక్తులు, వారికి మద్దతుగా ఉండే కంపెనీల నిర్వాహకులు ఉన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి భారీ ఎత్తున జరిగిన నగదు బదిలీ వ్యవహారాలు, హవాలా లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాలను సిట్‌ సేకరించి, ప్రధాన నిందితుడు కసిరెడ్డిని కటకటాల పాలు చేయడంతో ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వైసీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నేడో రేపో న్యాయస్థానం అనుమతితో కసిరెడ్డిని సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
కస్టడీ విచారణలో ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తాయో అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సిట్‌ అధికారులే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు నడిపించాలన్న ఆలోచనతో ఉండటంతో వైసీపీలో ఈ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు