శ్రీశైలం ఎడమగట్టు కాలువకు చెందిన సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు శనివారం ఉదయం నుంచి చిక్కుకుపోయి ఉన్నారు. ఈ సొరంగంలోకి నీరు ఇంకుతున్నందు వల్ల సొరంగంలో చిక్కుకు పోయిన వారిని వెలికి తీసే ప్రయత్నాలకు విపరీతమైన విఘాతం కలుగుతోంది. ఆ సొరంగం అంతా బురద, నీటితో నిండిపోయింది. సోమవారం సాయంత్రానికి సహాయక చర్యలు ముగిశాయి. కానీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించే అవకాశం కనిపించలేదు. దేవరకొండ ప్రాంతంలోని సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది. సైన్యం, నౌకా దళం, జాతీయ విపత్తులను ఎదుర్కొనే దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్.), విపత్తులను ఎదుర్కునే రాష్ట్ర విభాగం (ఎస్.డి.ఆర్.ఎఫ్.) బృందం, జాతీయ జలసంబంధ దర్యాప్తు సంస్థతో పాటు మరికొన్ని విభాగాలు సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి శనివారం నుంచి నిరంతరం కృషి చేసినా కార్మికులు చిక్కుకున్న చోటికి చేరుకోవడానికి సాధ్యం కాలేదు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక బృందాలతో పాటు సొరంగంలోకి వెళ్లి సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సహాయ కార్యక్రమాలలో నిమగ్నమైన వివిధ విభాగాల బృందాలు సుదీర్ఘ కాలం పరిస్థితిని సమీక్షించారు. కానీ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడగలిగే పరిస్థితి కనిపించలేదు. సొరంగంలో గోడలాంటి బురద సహాయ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తోంది. ఆ అవాంతరాన్ని ఎలా ఎదుర్కోవాలో సహాయక బృందాల వారికి తోచడంలేదు. సహాయక బృందాల వారు రెండు మూడు గంటలకొకసారి సహాయక చర్యలను ఎలా నిర్వహించాలో చర్చిస్తున్నా విపత్తు మరింత తీవ్రమవుతోందే తప్ప వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఏ మార్గమూ కనిపించడం లేదు. గంట గంటకు కొత్త అవాంతరాలు ఎదురవుతున్నాయి. సైన్యం, నౌకా దళానికి చెందిన ఉన్నతాధికారులు నిశితంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నా చిక్కుకున్న వారిని వెలికి తీసే మార్గం చూపలేక పోతున్నారు. శనివారం ఉదయం దాదాపు 70 మంది ఈ సొరంగంలోకి వెళ్లారు. వీరు లోపలికి వెళ్తున్నప్పుడు ఒక చోట నీరు స్రవిస్తున్నట్టు గమనించారు. కానీ సొరంగం లాంటివాటిలో ఇలా నీరు జాలువారడం సహజమే అనుకున్నారు. కానీ హఠాత్తుగా నీరు స్రవించడం ఎక్కువైంది. సహాయక చర్యల కోసం సొరంగంలోకి తీసుకెళ్లిన యంత్రం ఆ నీటి తాకిడికి వెనక్కు వచ్చేసింది. ప్రాణాలను రక్షించుకోవడానికి కార్మికులు తలోవేపు పరుగెత్తారు. నీరు తన్నుకొచ్చిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎనిమిది మంది కార్మికులు దిక్కు తోచక అక్కడ ఏర్పడిన గుంటలో కూరుకుపోయారు. బి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఉన్నప్పుడు అయిదేళ్ల పాటు ఈ సొరంగం పని నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగం పని మళ్లీ మొదలు పెట్టింది. ఈ లోగా ఈ ప్రమాదం జరిగింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2005లో 44 కిలోమీటర్ల పొడవున సొరంగం తవ్వే పని మొదలు పెట్టారు. ఇందులో 35 కిలోమీటర్ల మేర సొరంగం పని పూర్తి అయింది. అమ్రాబాద్ జలాశయం కింద 400 మీటర్ల లోతున ఈ సొరంగం తవ్వకం పని జరుగుతోంది. ఈ సొరంగం శ్రీశైలం నుంచి దేవరకొండ దాకా ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ పథకం పూర్తి అయితే నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ పథకం ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగు నీరు అందుతుంది. ఈ సొరంగం ద్వారా 30శత కోటి ఘనపు అడుగుల నీరు వాడుకోవాలనుకున్నారు.
ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సాగునీటి సొరంగ మార్గం. సొరంగం పూర్తి అయితే దాని ఎత్తు 30.7 అడుగులు ఉంటుంది. సొరంగం తవ్వకం పని అయిపోయిన తరవాత ముందే తయారుచేసిన సిమెంటు బ్లాకులను అమరుస్తారు. అప్పుడు సొరంగం కూలే ప్రమాదం సాధారణంగా ఉండదు. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ సొరంగం తవ్వే పనులు నిర్వహిస్తోంది. ఇది సొరంగాలు తవ్వే పరికరాలను వినియోగిస్తుంది. శ్రీశైలం వేపు 13.9 కిలోమీటర్ల దూరంలో సొరంగంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ మనోజ్ కుమార్, పనిచేసే స్థలంలో బాధ్యుడైన ఇంజినీరు శ్రీనివాస్Ñ జై ప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీ సిబ్బంది అయిన సందీప్ సాహూ, జగత ఎక్సెస్స్, సంతోష్ సాహు, అనుజ్ సాహు – (వీరంతా రోజు కూలీ కార్మికులే)Ñ సొరంగం తవ్వే రాబిన్స్ ఇండియాకు చెందిన తవ్వకం యంత్రం నడిపేవారు – సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్ సొరంగంలో చిక్కుకున్న వారిలో ఉన్నారు. వీరిలో మనోజ్ కుమార్, శ్రీనివాస్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. మిగతా వారందరూ జార్ఖండ్‌కు చెందిన వారు. సన్నీ సింగ్ జమ్మూ-కశ్మీర్‌కు, గురుప్రీత్ సింగ్ పంజాబ్‌కు చెందినవారు. ఆరేడు అడుగుల ఎత్తున బురద పేరుకు పోయినందువల్ల ఆఖరి 150 మీటర్ల మేర సహాయక చర్య పెద్ద సవాలుగా మారింది. నిరంతరం నీరు కారుతూ ఉండడం, బురద పేరుకు పోవడం, మధ్య మధ్యలో పెద్ద పెద్ద రాతి గుండ్లు తగలడం, శిధిలాలు పేరుకుపోవడంవల్ల సహాయ కార్యక్రమాలు ముందుకు సాగకుండా అవాంతరం కలుగుతోంది. సహాయక బృందాల ప్రయత్నాలు వృథా ప్రయాసగా మిగిలి పోతున్నాయి. జల వనరులను వినియోగించుకోవడానికి, సాగు నీటి సదుపాయాలు ఏర్పాటు చేసి సేద్యపు మడులను సస్యశ్యామలం చేయడం, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడానికి సకల చర్యలు తీసుకోవడం ఎక్కడైనా అవసరమే. ప్రకృతి మీద ఆధిపత్యం సాధించకపోతే మానవ మనుగడలో పురోగతి స్తంభించి పోతుంది. అంచెలంచలుగా ప్రకృతి మీద మానవుడు ఆధిపత్యం సాధిస్తూనే ఉన్నాడు. కానీ క్రమంలో పర్యావరణానికి విఘాతం కలుగుతూనే ఉంది. ఈ రెండిరటి మధ్య సమతూకం సాధించడం చిన్న పనేం కాదు. ప్రకృతి వికటించినా, బాధకు గురి కావాల్సిందీ మనిషే. ప్రకృతికి-మనిషికి మధ్య ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. అయితే ఎంత తక్కువ ప్రాణ నష్టంతో మానవావసరాలు తీర్చగలం అన్నదే అసలైన చిక్కు ముడి. గనులు తవ్వడం లాంటి పనులకు తోడ్పడే ఆధునిక యంత్రాలు, అధునాతన సాంకేతిక ప్రక్రియ అందుబాటులోకి వచ్చి ఉండొచ్చు. అవి మానవ వికాస క్రమంలో అమోఘమైన పాత్ర నిర్వహిస్తూ ఉండొచ్చు. కానీ పరిస్థితి వికటించినప్పుడే మనసు కలుక్కుమనే సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ప్రకృతి మీద మనిషి ఆధిపత్యం సాధించినప్పుడల్లా మహదానంద పడతాం. ప్రకృతి ఎదురు సవాలు విసిరినప్పుడల్లా మనిషి పునరాలోచనలో పడిపోతాడు. ఇదంతా ప్రకృతికి, మనిషికి మధ్య సాగే నిరంతర పోరాటంలో భాగమే.