. విపక్ష నేతలపై పదేళ్లలో 193 కేసులు
. 2022`23లో అత్యధికంగా 32 కేసులు
. ఇప్పటివరకు శిక్షించింది ఇద్దరినే
న్యూదిల్లీ : మోదీ పదేళ్ల పాలనలో ప్రతీకార రాజకీయాల ధోరణి నడుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఐటీ వంటి వ్యవస్థలను దుర్వినియోగమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతలను తమ దారికి తెచ్చుకునేందుకు ఈ వ్యవస్థలను అస్త్రాలుగా ఎన్డీయే మల్చుకున్నది. గత పదేళ్లలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంఘాల సభ్యులపై మొత్తం 193 కేసులను ఈడీ పెట్టింది. ఇందులో రెండు కేసులు… 201617లో, 2019
20లో పరిష్కారమయ్యాయి. చాలా కేసుల్లో నాయకులపై ఆరోపణలను రుజువు చేసేందుకు సరైన సాక్ష్యాధారాలు లేవని విపక్షాలు దుయ్యబట్టాయి. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి స్వతంత్ర సంస్థలను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్డీయే దుర్వినియోగిస్తుందని ఆరోపించాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ మూడు శాతం ఈడీ కేసులే రాజకీయ నేతలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే 2014 నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన 95శాతం మంది నాయకులు ఈడీకి టార్గెట్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. బీజేపీలో చేరిన 23 నేతలపై కేసులు కొట్టివేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వివక్షపూరిత రాజకీయ విధానాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో 2024లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కేసులో అరెస్టు కాగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
యూపీఏ పాలన చాలా పారదర్శకంగా సాగిందని, 2జీ కుంభకోణం వెలుగు చూసినప్పుడు నాయకులు ఎ.రాజా, కనిమొళి వంటి వారిని జైళ్లకు పంపినట్లు కాంగ్రెస్ చెప్పుకున్నది. మోదీ హయంలో ఐటీ, ఈడీ, సీబీఐ వంటి వ్యవస్థలు రాజకీయపరమైన అవసరాలను తీర్చే అస్త్రాలుగా మారి దుర్వినియోగమవుతున్నట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదే క్రమంలో ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఈడీ కేసులపై రాజ్యసభలో సీపీఎం ఎంపీ ఏఏ రహీం ప్రశ్నించారు. పదేళ్లలో రాజకీయ నేతలపై ఈడీ పెట్టిన కేసులు ఎన్ని? వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి? ఎంత మందిపై నేరారోపణలు రుజువు అయ్యాయి? ఏయే పార్టీల నేతలపై ఎక్కువ కేసులు ఉన్నాయి? వంటి ప్రశ్నలను సంధించారు. సమగ్ర సమాచారాన్ని కేంద్రం నుంచి కోరారు. ఈడీ విచారణలో పారదర్శకత, సామర్థ్యం పెరిగేలా ఎలాంటి సంస్కరణలు చేపట్టారో చెప్పాలన్నారు. ఎంపీ రహీం ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులపై ఈడీ కేసులకు సంబంధించి పార్టీల వారీగా లేదా రాష్ట్రాల వారీగా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఇటీవల కాలంలో విపక్ష నేతలపై ఈడీ కేసులు పెరిగాయో లేదో కూడా చెప్పలేమన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం, సాక్ష్యాధారాలు ఆధారంగానే ఈడీ విచారణ ఉంటుందని, దర్యాప్తు సంస్థ చర్యలపై జుడిషియల్ రివ్యూకు అవసరం ఉంటుందని మంత్రి వివరించారు. కాగా, 2019 నుంచి 2024 వరకు దాఖలైన కేసుల సంఖ్యలో పెంపుదల ఉన్నట్లు డేటా చెబుతోంది. ఈ కాలంలో మొత్తం 138 కేసులు నమోదు కాగా 2022`23లో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు 13 కేసులు నమోదయ్యాయి.
కేంద్రం చెప్పినదాని ప్రకారం ….
01.04.2015 నుంచి 31.03.2016 వరకు రాజకీయ నేతలపై 10 ఈడీ కేసులు నమోదయ్యాయి. అలాగే 01.04.2016 నుంచి 31.03.2017 వరకు 14Ñ 01.04.2017 నుంచి 31.03.2017 వరకు 7Ñ 01.04.2018 నుంచి 31.03.2019 వరకు 11Ñ 01.04.2019 నుంచి 31.03.2020 వరకు 26Ñ 01.04,2020 నుంచి 31.03.2021 వరకు 27Ñ 01.04.2021 నుంచి 31.03.2022 వరకు 26Ñ 01.04.2022 నుంచి 31.03.2023 వరకు 32Ñ 01.04,2023 నుంచి 31.03.2024 వరకు 27Ñ 01.04.2024 నుంచి 28.02.2025 వరకు 13 కలిపి 193 కేసులు నమోదయ్యాయి. ఇందులో 01.04.2016 నుంచి 31.03.2017 వరకు ఒకరికి, 01.04.2019 నుంచి 31.03.2020 వరకు మరొకరికి శిక్షలు పడ్డాయి. జార్ఖండ్ మాజీ మంత్రి హరి నారాయణ్ రాయ్‌కు 2017లో మనీలాండరింగ్ కేసులో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5లక్షల జరిమానా విధించారు. అదే రాష్ట్రానికి చెందిన మరొక మాజీ మంత్రి అనూశ్ ఎక్కాకూ 2020లో రూ.2కోట్ల జరిమానా, ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.