Homeవిశ్లేషణయూసీసీ చట్టమా… ఎన్నికల నినాదమా ?

యూసీసీ చట్టమా… ఎన్నికల నినాదమా ?

- Advertisement -

పి.పి శాస్త్రి

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలుపై కేంద్రం స్పష్టమైన లక్ష్యాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కేవలం నెలల వ్యవధిలో వివిధ వర్గాల నుండి ఆభిప్రాయాలు అడƒగడం, వారి నిశ్ఛయానికి సూచన. ఇక దానిని సపోర్టు చేసే వారి అభిప్రాయం డైరెకుట్‌గా మోదీని బలపరచడమే. రాజ్యాంగంలో అదేశిక సూత్రాలలో ఉంది మానిఫెస్టోలో పెట్టారు, అంతే వారు చెప్పేది. మిగిలిన అదేశిక సూత్రాల సంగతి మాట్లాడరు. దేశంలో మిగిలిన సమస్యలు, అధిక ధరలు, నిరుద్యోగం, ఏవీ వద్దు. 21వ లా కమిషన్ రిపోర్టు యూసీసీ గురించి చెప్పిన విషయం మాట్లాడరు. గత పన్నెండేళ్లుగా బీజేపీ పనితీరు, మతాల మధ్య పెరుగుతున్న వైషమ్యాలు, అప్రజాస్వామిక విధానాలు, మైనారిటీలను, ఇతర మతస్థులను, ప్రజాస్వామిక, మానవతావాదులను యూసీసీ అంటే భయపడేట్టు చేస్తున్నాయి. అందుకే వారు వ్యతిరేకిస్తున్నారు. విపక్షాల భయంలో, వ్యతిరేకతలో అర్థం ఉంది. యూసీసీలో ఏమి ఉంటుందో ఎవరికీ తెలీదు. నిజానికి అది అన్ని మతాలలో ఉన్న ఛాందస భావాలకు వ్యతిరేకంగా, నవీన ఆలోచనలతో ఉండాలి. అప్పుడే అది యూసీసీ అవుతుంది. లేకపోతే ఎవరూ పాటించని ఒక మృత చట్టం అవుతుంది. ఉదాహరణకు హిందూ వారసత్వ చట్టంలో సవరణ ద్వారా కూతురు, కొడుకుతో సమానంగా ఉమ్మడి ఆస్తిలో భాగం ఇవ్వాలని చట్టం చేసుకున్నాం. కానీ ఈనాటికీ అది అమలు జరగడం లేదు. ఆడపిల్లకు చాలా ఖర్చుపెట్టి పెళ్లి చేశామని, కొడుకు తమ బాగోగులు చూస్తాడని సర్ది చెప్తారు. దీనికి వారు చెప్పే కారణాలు చట్ట వ్యతిరేకమైనవి. అంటే ఆడపిల్లను కొడుకుతో సమానంగా చూసే విధంగా మన సమాజం ఎదగలేదు. సంస్కారం పెరిగితే చట్టం అవసరం లేదు, ఇప్పుడు ఆడవాళ్లను సతీసహగమనం చేయమని బలవంతం చేయలేం అంటారు కొడవటిగంటి కుటుంబరావు. కనుక మనకు కావలిసినది యూసీసీ కాదు. మన చట్టాలలో ఉన్న అనాగరిక, సనాతన భావాలను వదిలించుకోవడం. దానికి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అప్పుడు బలవంతంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతానికి బ్రహ్మ పదార్థం లాగా ఉన్న కామన్ సివిల్ కోడ్ గురించి ఏమని చెప్పగలరు. అందులో ఏ విధమైన నిబంధనలు ఉంటాయి? అందరికీ ఒకే చట్టం అంటే, అందులో ఏ మత చట్టంలోని నిబంధనలు ఉంటాయి? మేనరికం పెళ్లిళ్లు అనుమతి ఇస్తారా? నాలుగు పెళ్లిళ్లు నిషేధిస్తారా? మతం మారితే ఆ కారణంగా విడాకులు కోరవచ్చునా? మతం ఆధారంగా, మత ఆచారాలతో పెళ్లిళ్లు చేసుకోవచ్చా? భిన్న మతాలలో ఏ పద్ధతిలో పెళ్లి, ఇతర కార్యక్రమాలు అమోదిస్తారు లేదా గుర్తింపు ఇస్తారు? విడాకులు కోరవచ్చునా? ఏ నిబంధనలు పెడతారు? పరస్పర అంగీకారంతో విడాకులు కోరవచ్చునా? దత్తతకు అనుమతిస్తే ఏ పద్ధతిలో తీసుకోవాలి వాటి హక్కులు ఎలా ఉంటాయి? ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయా? ఇప్పటికీ చట్ట సభలలో స్త్రీలకు 33 శాతం బిల్లుకు మోక్షం లేని నేపధ్యంలో, ఈ ఉమ్మడి చట్టం ఆడపిల్లలకు ఆస్తి హక్కులు కల్పిస్తుందా ? మెజారిటీ మతం ఇప్పటికే ఇతర మతాలను రెండో తరగతి పౌరులుగా చూస్తున్న నేపథ్యంలో, ఉమ్మడి చట్టం ఏమి నిబంధనలు పెడుతుందో అని భయపడడం సమంజసమే కదా! భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న బాషలు, భిన్న ఆదివాసీ గిరిజన జాతులు ఉన్న దేశంలో, ఎలాంటి ఉమ్మడి చట్టం తేవాలని అనుకుంటున్నారు. ఏది ముసాయిదా బిల్లు? ఏదీ చెప్పకుండా దేనికి అమోదం తెలుపమని అడుగుతున్నారు? ఏదీ చెప్పని చట్టం గురించి భయం ఉండకుండా ఎలా ఉంటుంది ? పార్లమెంటు తలుపులు మూసి చట్టాలు చేసిన ప్రభుత్వాలను మరిచిపోయామా? చర్చే లేకుండా ప్రతిపక్షాలను బయటకు పంపించి చేసిన చట్టాలు ఏలా మర్చిపోతాము. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయని ప్రభుత్వాలను ఏలా నమ్ముతారు? చట్టాల మార్పు అనివార్యమే, అది పురోగతి వైపు అయినప్పుడు. అది సమగ్రమైన చర్చల తరువాత జరిగిన మార్పు అయినప్పుడు. ఆలోచన చేయాల్సిందే!! ప్రభుత్వం, వారి అనుయాయిలు మానసికంగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి) ప్రవేశ పెడితే హిందువుల చట్టాలలో వచ్చే మార్పులు-యూసీసీ యూనిఫాం సివిల్ కోడ్ అనేది నాలుగు విషయాలకు సంబంధించిన చట్టాలను రూపొందించడం జరుగుతుంది. అవి-వివాహం, విడాకులు, వారసత్వం దత్తత. వీటికి సంబంధించి అన్ని మతాలకు వర్తించేలాగా ఓకే యూనిఫారం చట్టం తీసుకురావాలనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 నిర్దేశిస్తుంది. ఆ రకంగా చేయవలసి వచ్చినప్పుడు హిందువులకి సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టాలలో ఎటువంటి మార్పులు తీసుకురావాల్సి ఉంటుందనేది పరిశీలించాలి. మొదటగా హిందూ వివాహ చట్టం. ఈ చట్టంలో ఉన్నట్లు హిందువులకు మాత్రమే అనే నిబంధన ఉమ్మడి చట్టంలో ఉండదు. కనుక ఉమ్మడి పౌర స్మృతిలో వివాహం విషయంలో మతాల ప్రస్థావన లేకుండా జరుగవచ్చు అని ఉంటుంది. వివాహం హిందూ సంప్రదాయ ఆచారాలు ప్రకారం జరగాలి అని ఉండదు. హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకునే వ్యక్తుల మధ్య నిషేధించబడిన బంధుత్వం ఉండకూడదు. ఇప్పటి వరకు, ఆ కుటుంబాలలో ఉండే ఆచారాలు అనుమతిస్తే వారు వివాహం చేసుకోవచ్చు. ఈ ఆచారాలు కల్పించిన వెసులుబాటు వలనే హిందువులలో మేనరికం పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కామన్ సివిల్ కోడ్ ప్రకారం అందరికీ ఒకే విధానం ఉండాలి కనుక, సైంటిఫిక్ గాను, ఈ రకమైన ఆచారాల గుర్తింపు వీలుకాదు. అంటే కామన్ సివిల్ కోడ్ ప్రకారం మేనరికం పెళ్లిళ్లు చేసుకోవడం నిషేధం కావచ్చు. రెండవది హిందూ వివాహ చట్టంలోని విడాకుల సెక్షన్‌లు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌లు 11 నుండి 28ఏ వరకు వివాహం రద్దు, విడాకులు, పరస్పర అంగీకారంతో విడాకులు, విడాకుల తర్వాత పర్యవసానాలు గురించిన పద్ధతుల వివరాలు పేర్కొన్నారు. కామన్ సివిల్ కోడ్ వచ్చిన తరువాత ఈ సెక్షన్‌లు అన్నింటినీ పునఃసమీక్ష చేయవలసి ఉంటుంది. సెక్షన్ 13లో విడాకులు తీసుకోవడానికి అవతలి పార్టీ హిందూ మతం నుండి మరొక మతంలోకి మారడం ఒక కారణంగా చూపి విడాకులు కోరవచ్చు. కామన్ సివిల్ కోడ్ ప్రకారం మతం మార్పిడి అనేది విడాకులు అడగడానికి కారణంగా ఉండడానికి వీలవదు. మూడవది హిందూ వారసత్వ చట్టం. హిందూ వారసత్వ చట్టం 1956లో రూపొందింది. తర్వాత దానికి 2005లో సవరణలు చేసి హిందూ జాయింట్ ఆస్తిలో కూతురుకి కూడా కొడుకుతో సమానంగా ఆస్తి ఇవ్వడం జరిగింది. ఇది మహిళలకు ఎంతో మేలు చేసిన చట్ట సవరణ. అయితే ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ ఈ వారసత్వ చట్టానికి ఎటువంటి సవరణలు చేస్తుందో తెలియదు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించలేని నేటి ప్రభుత్వాలు, వారసత్వ చట్టాలలో మహిళలకు ఎంతవరకు న్యాయం చేస్తాయన్నది అనుమానించవలసిన విషయమే. నాలుగోది హిందూ దత్తత, మనోవర్తి చట్టం. ప్రస్తుతం ఉన్న ఈ చట్ట ప్రకారం ఒక హిందూ పురుషుడు కనుక కొడుకును గాని కూతుర్‌ని గాని దత్తత చేసుకోవాలనుకుంటే, తనకి భార్య ఉన్నట్టయితే భార్య యొక్క అనుమతి తప్పనిసరి.హిందూ మహిళ కొడుకును గాని కూతుర్‌ని గాని దత్తత తీసుకోవాలనుకుంటే, ఆమెకు భర్త ఉన్నట్టయితే భర్త అనుమతి తీసుకోవడం తప్పదు. ఆ భార్య గాని భర్త గాని హిందూ మతం నుండి మారి వేరే మతానికి వెళ్లినట్లయితే ఆమె నుంచి గాని అతని నుంచి గాని అనుమతి అవసరం లేదు అనేది, నిబంధనకు సడలింపు. ఇప్పుడు ప్రవేశ పెట్టాలనుకుంటున్న ఉమ్మడి పౌరస్మృతి ప్రకారం ఈ మతమార్పిడి అనే సడలింపు ఉండకపోవచ్చు. అంటే ఆమె గాని అతను గాని మతమార్పిడి చేసుకున్నా కూడా వారి అనుమతి తప్పనిసరి అవుతుంది. అలాగే భార్యకు మనోవర్తికి సంబంధించి కొన్ని పరిస్థితుల్లో భర్త నుంచి పొందడానికి చట్టంలో చెప్పటం జరిగింది. భర్త కనక మతమార్పిడిగా హిందూ మతం నుంచి మారినట్టు అయితే భార్య అతని నుంచి మనోవర్తి పొందవచ్చును. కామన్ సివిల్ కోడ్‌లో ఈ రకమైన మతమార్పిడి అనే నిబంధన ఉండకపోవచ్చు. ఇవి పై నాలుగు హిందూ చట్టాలలో కామన్ సివిల్ కోడ్ వల్ల వచ్చే ముఖ్యమైన మార్పులు కావొచ్చు. ఇప్పుడు ప్రవేశ పెట్టాలనుకుంటున్న ఉమ్మడి పౌరస్మృతిలో, ప్రతి విషయంలోనూ, ప్రతి అంశం పైనా, హిందువు అయితే ఇలా, పలానా మతం అయితే ఇలా, అని ఉండదు అనేది స్పష్టం. అలా ఎవరికి వారికి వేరు వేరుగా నిబంధనలు పెడితే అది ఉమ్మడి చట్టం అవదు. పాలకుల ఉద్దేశం అది కాదు కనుక ఉమ్మడి పౌరస్మృతిలో మతాల ప్రసక్తి, వారికి సంబంధించిన నిబంధనలలో సడలింపులు ఉండవు. కనుక పైన నేను చెప్పిన మార్పులు హిందువుల జీవనవిధానం మీద ప్రభావం చూపుతుంది. విచిత్రం ఏమిటంటే కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫాం సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌరస్మృతి అని చెప్పడమే గాని దానిలో ఏ రకమైన నిబంధనలు ఉంటాయనేది చెప్పలేదు. మన దేశంలో ఏ మతానికి సంబంధించి వారి పర్సనల్ సివిల్ చట్టాలు ఉన్నాయి. క్రిమినల్ చట్టాలు అందరికీ ఒకే రకంగా ఉన్నాయి. సివిల్ చట్టాలు అందరికీ ఒకే చట్టంగా తీసుకురావాలనేది మన రాజ్యాంగ నిర్మాతలు ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించారని చెప్తున్నారు. కానీ ముసాయిదా బిల్లు రూపొందించలేదు. ఇవన్నీ తెలియకపోయినా హిందూ సంఘాలు, బీజేపీ సపోరటర్స్‌, ఈ ఉమ్మడి పౌరస్మృతిని సపోర్ట్ చేస్తున్నారు. యూసీసీ ప్రస్తుతం ఎన్నికల నినాదం మాత్రమే. ముస్లింల జనాభా పెరిగిపోతోంది అని గగ్గోలు పెట్టేవారు, బీజేపీ, సంఘ పరివార్ చెప్తున్న అఖండ భారత్ నినాదాన్ని వ్యతిరేకించాలి. అఖండ భారత్ అమలయితే (అది సాధ్యం కాదని వారికే కాదు, కాస్త పరిజ్ఞానం ఉన్న వారికీ తెలుసు) హిందువులు, ముస్లింల జనాభా నిష్పత్తి సమానమవుతుంది.కానీ అఖండ్ భారత్ నినాదాన్ని వ్యతిరేకించరు. ఎందుకంటే అది సెంటిమెంటల్గా హిందువులను రెచ్చగొట్టే నినాదం. మన దేశం అన్ని మతాలు, జాతులకు, ఎన్నో ఆదిమ తెగలకు, భాషలకు, విభిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు, ప్రతీకగా ఉండాలని, సౌభ్రాతృత్వం, సమానత్వం కోసం చాటి చెప్పే వైభవ సిద్దాంతం మన రాజ్యాంగ నిర్మాతలది. యూనిఫారం సివిల్ కోడ్ ద్వారా మెజారిటీ మతం అధికారాన్ని, అజమాయిషీని, మైనారిటీ మతం మీద ప్రయోగించి, మైనారిటీ మతస్థులను అణిచి ఉంచాలనేది ఇప్పటి పాలకుల ఉద్దేశం, లక్ష్యం. అందుకే ప్రపంచ మానవాళి సభ్యులుగా ఇప్పటి పాలకుల దురుద్దేశంతో తయారయ్యే యూనిఫారం సివిల్ కోడ్‌ను వ్యతిరేకించాలి.
అడ్వకేట్, ఏలూరు. ఫోన్ : 9885286643

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు