ధన్కర్ వ్యాఖ్యలపై రాజా ఆగ్రహం
న్యూదిల్లీ : ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు అణగదొక్కుతున్నారని, గవర్నర్ల వ్యవస్థను బీజేపీఆర్‌ఎస్‌ఎస్ దుర్వినియోగం చేస్తున్నాయని, దీనికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వంతపాడటం దురదృష్టకరమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. రాష్ట్రపతి, గవర్నర్ల రాజ్యాంగబద్ధ బాధ్యతలను నిర్దేశించే సుప్రీంకోర్టు అధికారాన్ని ప్రశ్నించేలా ధన్కర్ మాట్లాడటాన్ని సీపీఐ ఖండిస్తోందని రాజా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మన రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగమే సర్వోన్నతమని రాజా నొక్కిచెప్పారు. రాజ్యాంగానికి మించిన ఏ పదవీ లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ‘చెక్స్ Ê బ్యాలెన్స్’ (రాజకీయ వ్యవస్థలో అధికారాన్ని పంపిణీ చేసే పద్ధతి) అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు తమ వద్ద పెండిరగ్‌లో పెట్టుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, సుదీర్ఘకాలం బిల్లులు పెండిరగ్‌లో ఉండకుండా సుప్రీంకోర్టు న్యాయపరంగా మార్గం సుగమం చేసిందని రాజా తెలిపారు. మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నడుచుకోవాలని అధికరణ 74(1) స్పష్టం చేస్తుందని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్రపతి ఇలాంటి విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోరని, ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల అణచివేతకు గవర్నర్ వ్యవస్థను ఆర్ఎస్ఎస్
బీజేపీ దుర్వినియోగించడాన్ని చట్టబద్ధంగా సమర్థించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదకర ధోరణి ఇటీవల పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రాజ్యాంగబద్ధ అత్యున్నత స్థానం చేపట్టారు. ఈ స్థానం సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగించే వివక్షపూరిత ప్రణాళికలకు ముసుగుగా వినియోగించుకోవడం ఆందోళనకరం. జడ్జి ఇంటి నుంచి భారీగా నగదు లభ్యం కావడం వంటి ఘటనలు దర్యాప్తు, దిద్దుబాటు చర్యల అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇటువంటి కేసులతో న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తికి విఘాతం కలిగించే అజెండా బహిర్గతమవుతోంది’ అని రాజా అన్నారు. సీపీఐ సహా 55 మంది పార్లమెంటు సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టి… అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేసిన మతతత్వ, విభజన వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చను కోరితే… చైర్మన్ స్థానంలో ఉన్న ఉప రాష్ట్రపతి అందుకు అనుమతించలేదని రాజా గుర్తుచేశారు. న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తి`స్వాతంత్య్రాన్ని, సమాఖ్యవాదాన్ని బలహీనపర్చడానికి, నిరంకుశ పాలకుల చేతిలో అధికారాన్ని కేంద్రీకరించే ప్రమాదకరమైన వ్యూహానికి ఇలాంటి చర్యలు దారితీస్తాయని సీపీఐ హెచ్చరిస్తోందన్నారు.