. రాష్ట్ర ప్రభుత్వంతో హిందూజా ఒప్పందం
. లండన్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీలు
. ఈవీ తయారీ-నెట్వర్క్ ప్లాంట్ల ఏర్పాటుకు అంగీకారం
. విశాఖ సదస్సుకు ఆహ్వానం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. వ్యక్తిగత పర్యటన కోసం చంద్రబాబు లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించడం కోసం దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం సోమవారం వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు. పరిశ్రమలు స్థాపించడంతో పాటు జీసీసీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతంలో… ఏయే రంగాలను అభివృద్ధి చేస్తున్నామనే విషయాన్ని వివరించడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చి పెట్టి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు స్థాపిస్తే…ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వివరిం చారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీలను వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంబిస్తున్నామని పారిశ్రామికవేత్తల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. లండన్‌లోని ది లాంగ్లీ, బకింగ్హామ్షైర్లో హిందుజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందుజా, ఆ సంస్థ యూరప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం ముందుగా వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వానికి హిందూజా గ్రూప్‌తో కీలక ఒప్పందం కుదిరింది. దశలవారీగా ఏపీలో రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం పైనా సంతకాలు చేసింది. విశాఖలోని హిందూజా సంస్థకు ప్రస్తుతమున్న 1,050 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌కు అదనంగా మరో 1,600 మెగావాట్ల వరకు సామర్ధ్యాన్ని విస్తరించనుంది. ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్ధ్యం గల రెండు కొత్త యూనిట్లను స్థాపిస్తుంది. రాయలసీమలో భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. మరోవైపు ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, లైట్ కమర్షియల్ వాహనాల తయారీ లక్ష్యంగా కృష్ణాజిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నెలకొల్పనుంది. వాటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ నెట్వర్క్ తీసుకురానుంది. ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందూజా పరిశీలించనుంది. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో హిందూజా గ్రూప్ పెట్టుబడులు కీలకం అవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. హిందూజా గ్రూప్ ప్రతిపాదనలు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా ప్రత్యేకంగా ఫాస్ట్-ట్రాక్ విండో ఏర్పాటు ద్వారా ట్రాక్ చేస్తామని హిందూజా ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు. అలాగే, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, ఏవియేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై పారిశ్రామికవేత్తలతో భేటీల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం ఆహ్వానించారు. అమరావతి, విశాఖలో కొత్త టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా, నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం రూపొందించిన పాలసీలను తెలిపారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు ప్రతిపాదనలతో రావాలని ఆక్టోపస్ ఎనర్జీ సంస్థను సీఎం ఆహ్వానించారు. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ రోల్స్ రాయస్ గ్రూప్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆ సంస్థ సీటీఓ నిక్కీ గ్రేడిస్మిత్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏరో ఇంజిన్స్, డీజిల్ ప్రోపెల్షన్ సిస్టమ్స్ తయారీలో అంతర్జాతీయస్థాయిలో ప్రముఖ బ్రాండ్‌గా రోల్స్ రాయస్ సంస్థకు పేరుంది. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్ రిపెయిర్స్ ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) యూనిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం చెప్పారు. ఎస్ఆర్ఏఎం, ఎంఆర్ఏఎం గ్రూప్ చైర్మన్ శైలేశ్ హీరనందానీ, శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయతో చంద్రబాబు భేటీ అయ్యారు.


