ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక మలుపులు కొనసాగుతున్నాయి. టీడీపీ గన్నవరం కార్యాలయం దాడి కేసులో అరెస్టయిన వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించింది. ఇదే కేసులో గతంలో 36మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా, అనంతరం వారంతా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. అక్కడ ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు అంగీకరించలేదు. ప్రస్తుతం జైల్‌లో ఉన్న వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఈనెల 19న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ముందుకు వచ్చింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరముందని, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో 11మంది నిందితులు ఉన్నారని, వారిలో ఐదుగురు మాత్రమే అరెస్ట్ అయ్యారని, మరో ఆరుగుర్ని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందన్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ తరపు లాయర్ వాదించారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతడిని విచారిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఇద్దరు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేయడంతో, విచారించారు. వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆందోళన చెందుతు న్నారు. దీంతో మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు అధ్వ ర్యంలో వంశీ బెయిల్ కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. హైకోర్టులో వంశీకి చుక్కెదువ్వడంతో ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానాన్ని వంశీ ఆశ్రయించడం అనివార్యమైంది.