Thursday, May 8, 2025
Homeవిశ్లేషణవియత్నాం అద్భుత అభివృద్ధి

వియత్నాం అద్భుత అభివృద్ధి

వియత్నాంతో సరితూగగల పోరాటం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పవచ్చు. ఆ దేశ వీరోచిత ఉద్యమం స్ఫూర్తిదాయకం. విద్య, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో వియత్నాం ఎంతో విశిష్టత సాధించింది. ప్రపంచంలో సంపదగల, పేద, పెద్ద దేశాలున్నప్పటికీ వాటిన్నికంటే ఇంత త్యాగం చేసిన దేశం మరొకటి లేదు. అమెరికా వినియోగించిన రసాయనిక ఆయుధాల ఫొటోలతో కూడిన వార్‌ మ్యూజియం అమెరికా నాటి దుశ్చర్యలను కళ్లకట్టినట్టు చూపింది.

కె.రామకృష్ణ
సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి

వియత్నాం పేరు వినగానే, ఒక గొప్ప పోరాట చరిత్ర మన కళ్లముందు మెదులుతుంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చూసిన, ఎంతో సహనాన్ని, త్యాగాన్ని నిలబెట్టుకున్న దేశం వియత్నాం మాత్రమే. ఇటీవలే హోచిమిన్‌ సిటీలో జరిగిన వియత్నాం పునరేకీకరణ 50వ వార్షికోత్సవ కార్యక్రమానికి వియత్నాం ప్రభుత్వ ఆహ్వానంపై హాజరై వచ్చాను. అక్కడి అనుభవాలు, చరిత్ర, ప్రజల చైతన్యం నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి థు లామ్‌ను మన భారతీయ సంప్రదాయం ప్రకారం సత్కరించే అవకాశం కలిగింది. వియత్నాం ఆగ్నేయ ఆసియాలోని ఒక దేశం. 2016 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9 కోట్ల 46 లక్షలు. జనసంఖ్యలో ప్రపంచంలో 15వ స్థానంలో, ఆసియాలో 9వ స్థానంలో ఉంది. 1976లో ఉత్తర, దక్షిణ వియత్నాంలు కలిసిపోయినప్పటి నుంచి హనోయ్‌ నగరం రాజధానిగా ఉంది. హోచిమిన్‌ నగరం అత్యధిక జనాభా గల నగరం. యుద్ధంతో సర్వం కోల్పోయి తాగేందుకు మంచినీరు లేని వియత్నాం… ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందింది. నేటి వియత్నాంను చూస్తుంటే అక్కడ యుద్ధం జరిగిందా? లేదా? అనే సందేహం కలుగుతోంది. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌, చికాగో తదితర నగరాలకు దీటుగా వియత్నాం రాజధాని హోచిమిన్‌ నగరం అభివృద్ధి చెందింది.
అమెరికా సామ్రాజ్యవాదులపై సుదీర్ఘకాలం పోరాడిన అద్భుతమైన విప్లవగాథ వియత్నాంది. అమెరికాతో యుద్ధం ముగిసి… ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం ఏకీకరణ జరిగి ఏప్రిల్‌ 30వ తేదీకి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఉత్సాహపూరిత వాతావరణంలో వేడుకలు జరిగాయి. చారిత్రక హోచిమిన్‌ నగరం ఎరుపెక్కింది. నగర వీధులన్నీ జనంతో కోలాహలంగా మారాయి. జాతీయ పతాకాలతో ప్రజలు వేడుకల్లో పాల్గొని, తమ అభిమానాన్ని చాటుకున్నారు. వియత్నాం విప్లవ యోధుడు హోచిమిన్‌ చిత్రపటం, వియత్నాం చిహ్నం ‘ల్యాక్‌ బర్డ్‌’తో సైన్యం కదం తొక్కారు. హో చి మిన్‌ నగర వీధుల్లో పరేడ్‌ ముందుకు సాగగా, వేలాది మంది ప్రజలు వీక్షించారు. ఈ సందర్భంగా శాంతిపై దృష్టితో ముందుకెళుతున్నట్లు నాయకులు సందేశమిచ్చారు. ఒకప్పుడు సైగన్‌గా పిలిచే హో చిమిన్‌ నగర వీధులన్నీ జనంతో కిటకిటలాడాయి. యుద్ధానికి ముగింపు పలికిన చోటు ‘ఇండిపెండెన్స్‌ ప్యాలెస్‌’ వద్ద యుద్ధ విమానాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలలో వివిధ దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భారతదేశం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి మాత్రమే అధికారికంగా ఆహ్వానం అందింది. సీపీఐ ప్రతినిధిగా నేను హాజరుకావడం నాకు ఎంతో గర్వకారణం. ఈ వేడుకల్లో శాంతి, ఐక్యత, జాతీయ అభివృద్ధి అంశాలు ప్రధానంగా ప్రతిధ్వనించాయి. ప్రతినిధులలో విదేశీ సైనిక బృందాలు, యుద్ధంలో పాల్గొన్న యోధులు ఉన్నారు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి టూ లామ్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం జరిగిన 30 ఏళ్ల పోరాటం ముగింపునకు, వలసవాదం అంతానికి ఏప్రిల్‌ 30వ తేదీ చరిత్రలో నిలిచిందన్నారు. భావి తరానికి మెరుగైన ప్రపంచాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, అందుకోసం తమ వంతు కృషి చేస్తున్నట్లు టూ లామ్‌ వెల్లడిరచారు.
వియత్నాంతో సరితూగగల పోరాటం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పవచ్చు. ఆ దేశ వీరోచిత ఉద్యమం స్ఫూర్తిదాయకం. విద్య, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో వియత్నాం ఎంతో విశిష్టత సాధించింది. ప్రపంచంలో సంపదగల, పేద, పెద్ద దేశాలున్నప్పటికీ వాటిన్నికంటే ఇంత త్యాగం చేసిన దేశం మరొకటి లేదు. అమెరికా వినియోగించిన రసాయనిక ఆయుధాల ఫొటోలతో కూడిన వార్‌ మ్యూజియం అమెరికా నాటి దుశ్చర్యలను కళ్లకట్టినట్టు చూపింది.
టన్నెల్స్‌: హోచిమిన్‌ సిటీలోని కుచ్‌ జిల్లాలో సుమారు 250 కిలోమీటర్లకు పైగా విస్తరించిన భూగర్భ టన్నెల్స్‌ మానవ శక్తి ఎంత దృఢంగా ఉండగలదో చూపిస్తున్నాయి. ఇవి గెరిల్లా యుద్ధ కేంద్రాలుగా, ఆయుధ నిల్వ కేంద్రాలుగా, ఆసుపత్రులుగా, వంట గదులుగా, రాజకీయ సమావేశం గది లాగా యుద్ధకాలంలో ఉపయోగించేవారు. 1940లో మొదట ఫ్రెంచ్‌ వలస పాలనకు ప్రతిఘటనగా తవ్విన టన్నెల్స్‌, అమెరికాతో యుద్ధంలో మరింతగా పెంచి ఉపయోగించారు.
‘‘డోయ్‌ మోయ్‌’’తో పునర్నిర్మాణం: 1975 యుద్ధం తర్వాత వియత్నాం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 1986లో ప్రారంభించిన ‘‘డోయ్‌ మోయ్‌’’ ఆర్థిక సంస్కరణల ద్వారా, వియత్నాం కేంద్ర ప్రణాళిక విధానాల నుంచి మార్కెట్‌ ఆధారిత విధానాలవైపు సాగింది. అయితే, ప్రజల అవసరాలే కేంద్రబిందువుగా కొనసాగాయి. ఫలితంగా పేదరికం 70శాతం నుంచి 1.9శాతానికి తగ్గింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో వియత్నాం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కొత్త పుంతలు తొక్కి విజయవంతం కాగలిగింది. విదేశీ పెట్టుబడులకు అవకాశాలు ఇచ్చినప్పటికీ ప్రజల ప్రయోజనాలే కేంద్రంగా ఉంటున్నాయి. 1990 తర్వాత వియత్నాం జీడీపీ 6శాతానికి పైగా పెరుగుతూనే ఉంది. 2024లో వియత్నాం జీడీపీి 476.3 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది, ఇది 2023లోని 5.05శాతం వృద్ధితో పోలిస్తే 7.09శాతం వృద్ధిని సూచిస్తోంది. ఎగుమతులు 14.3శాతం పెరిగి 405.53 బిలియన్‌ డాలర్లకు చేరాయి, దేశ ఆర్థిక వృద్ధికి ఇది ముఖ్య కారణం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 9.4శాతం పెరిగి 25.35 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసింది. ఇదంతా కమ్యూనిస్టు పాలనలో వియత్నాం సాధించిన అభివృద్ధి.
వియత్నాంలో సైన్యానికి, యువతకు, మహిళలకు ప్రాధ్యాన్యత ఇస్తున్నట్లు కనబడిరది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన సౌత్‌, నార్త్‌ వియత్నాంల ఏకీకరణ 50వ వార్షికోత్సవంలో వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి టూ లామ్‌, ఆర్మీ మేజర్‌ జనరల్‌ చాన్‌ నాక్‌ థు తో పాటు యువత తరఫున ఒక యువతి మాట్లాడడం చూస్తే ఆ దేశంలో యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్ధమవుతోంది. వియత్నాంలో కమ్యూనిస్టుపార్టీ తప్ప వేరే పార్టీ లేదు. వియత్నాం ప్రభుత్వ విధానాలు కమ్యూనిస్టులే కాకుండా కమ్యూనిస్టేతరులనూ అకట్టుకుంటున్నాయి.
వియత్నాం విజయం సైనికమైనదేగాక, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా విజయవంతమైన ప్రయోగం. ప్రజల చిత్తశుద్ధి, నాయకత్వ నిబద్ధత, గణనీయమైన యువత పాత్ర, భాగస్వామ్య పాలన వంటి అంశాలు, భారత్‌ వంటి దేశాలు నేర్చుకోవాల్సిన అంశాలు. పారదర్శకతతో కూడిన కమ్యూనిజం ఎలా ప్రజల మద్దతుతో విజయవంతమవుతుందో అన్నదానికి వియత్నాం ఉదాహరణ. అంతిమంగా చెప్పాల్సిందేమంటే విజయం అనేది సాధన కాదు, అది ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవ డమే. ఈ ఉత్సవాలకు స్పెయిన్‌ నుంచి వచ్చిన మహిళా ప్రతినిధి నా పక్కనే కూర్చుని వున్నప్పుడు ‘‘ఇక్కడ ప్రతిపక్షం లేకుండా ప్రజల అసంతృప్తి వంటివి ఉండవా?’’ అన్న చర్చ వచ్చింది. దానికి ఆమె సమాధాన మిస్తూ, ‘‘ప్రజలను పాలనలో భాగస్వా ములుగా చేసి వారికి అవసరమైనవి సమకూ ర్చగలిగితే వారిలో అసంతృప్తికి చోటుండదు. బహుళ పార్టీ వ్యవస్థతో వాళ్లకు పనీ లేదు’’ అని పేర్కొన్నారు. ఇది వియత్నాం విజయ రహస్యానికి అద్భుతమైన వ్యాఖ్యానం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు