Wednesday, May 14, 2025
Homeసంక్షేమ క్యాలెండర్‌

సంక్షేమ క్యాలెండర్‌

. ప్రతినెలా పేదలకు పథకాలు
. జూన్‌ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ
. అదేరోజు లక్ష మందికి పెన్షన్ల పునరుద్ధరణ
. రెండు నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
. ఇకపై 3 సిలిండర్ల నగదు ఒకేసారి జమ
. టీడీపీ పొలిట్‌ బ్యూరో కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలు ఇకపై ప్రతి నెలా అందేలా ఏడాది క్యాలెండర్‌ రూపకల్పనకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం దాదాపు మూడు గంటలపాటు సాగిన జరిగిన తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో పార్టీ పరంగా ఒకే పదవిలో 3 సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రతిపాదనను పొలిట్‌ బ్యూరో ఆమోదించింది. దీని ప్రకారం మూడు పర్యాయాలు.. ఆరేళ్లుగా ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు. మూడు సార్లు మండల పార్టీ అధ్యక్షులుగా చేసిన వారికి ఆ పైస్థాయి పదవి లేదా ఇతర సమాంతర పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పొలిట్‌బ్యూరో నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. దీపం పథకం నగదు చెల్లింపులు ఇకపై ముందుగానే ఒకేసారి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. లబ్ధిదారులు సిలిండర్‌ ఎప్పుడు బుక్‌ చేసుకున్నా, సిలిండర్‌ తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి ఖాతాల్లో జమ చేస్తారు. జూన్‌ 12న ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు గత ప్రభుత్వం నిలుపుదల చేసిన ఫించన్లు పునరుద్ధరించనున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు జూన్‌ 12న ప్రారంభించాలని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా రెండు నెలల్లో ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడిరచారు. ఉగ్రదాడిలో అమరులైన వారికి సంఫీుభావంగా ఈనెల 16, 17, 18 తేదీల్లో తిరంగా ర్యాలీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అన్ని నియోజకవర్గాల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీ, త్రివిధ దళాలను పొలిట్‌ బ్యూరో అభినందిస్తూ తీర్మానం చేసిందని, అలాగే పద్మభూషణ్‌ అందుకున్న పొలిట్‌ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణకు పొలిట్‌ బ్యూరో అభినందనలు తెలిపిందన్నారు. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు పొలిట్‌ బ్యూరో నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఈ నెల 27న చంద్రబాబు నామినేషన్‌ దాఖలు చేస్తారని తెలిపారు. మహానాడు లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, కమిటీలు పూర్తి చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. కడపలో తొలిసారి నిర్వహించే మహానాడుకు భారీ ఏర్పాట్లు చేపడతామని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. తక్కువ సమయమే ఉన్నా ఎవరికీ ఏ లోటూ లేకుం డా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు చెప్పారు. లోకేశ్‌ కూడా మహానాడు ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు