. ఏపీ, తెలంగాణ అధికారులకు కేంద్ర హోంశాఖ సూచన
. విభజన అంశాల పెండిరగ్ సమస్యలపై లోతుగా చర్చ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విభజన అంశాల పెండిరగ్ సమస్యలపై సమన్వయంతో చర్చించి పరిష్కరించుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. రాష్ట్ర పునర్విభజన అంశాలపై దిల్లీలోని కేంద్రహోంశాఖ కార్యాలయంలో సోమవారం కీలక సమావేశం జరిగింది. హోంశాఖ కార్యదర్శి అధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధానాంశాలపై, విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా చర్చ జరిగింది. రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తయినా కొన్ని ముఖ్యమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలకు సంబంధించిన సమస్యలు ఎన్నిసార్లు భేటీలైనా కొలిక్కిరావడం లేదు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత విభజన చట్టం అమలుపై హోంశాఖ లోతుగా సమీక్షించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత, వాటిలో కొన్నింటిని ఏ విధంగా సమన్వయంతో పరిష్కరించుకోవచ్చో సూచించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఉంటుందని తెలిపారు. నిధుల పంపకాల్లో సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉండాలని హోంశాఖ సూచించింది. తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే ఇద్దరికీ నష్టం వస్తుందని చెప్పినట్టు తెలిసింది. 9, 10 షెడ్యూల్లోని సంస్థల విషయంలో న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. తదుపరి భేటీలో పరిష్కారం కాని సమస్యలపై నిర్ణయం తీసుకుందామని హోంశాఖ కార్యదర్శి చెప్పినట్టు తెలిసింది.