Sunday, February 23, 2025
Homeస్కాచ్‌ సీసాల్లో చీప్‌ లిక్కర్‌

స్కాచ్‌ సీసాల్లో చీప్‌ లిక్కర్‌

. అంతర్రాష్ట్ర ఎన్‌డీపీఎల్‌ సరఫరా చైన్‌ భగ్నం
. చెన్నైలో కీలక నిందితుడి అరెస్ట్‌
. ఉభయగోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పట్టుబడిన సీసాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో కొన్నేళ్లుగా జరుగుతున్న నాన్‌-డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ సరఫరా చైన్‌ను అధికారులు భగ్నం చేశారు. ఖరీదైన బ్రాండ్‌ సీసాల్లో నాసిరకం మందు పోసి ఈ ముఠా ఎక్జైజ్‌ శాఖ కళ్లుగప్పి జోరుగా విక్రయాలు సాగిస్తూ లక్షలు ఆర్జిస్తోంది. స్కాచ్‌ బాటిల్స్‌లోని మద్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ దళాలు దీనిపై ప్రత్యేక దృష్టిసారించి ఎట్టకేలకు చేధించాయి. ఇప్పటికే ఈ కేసులో కొందరిని అరెస్టు చేయడంతో పాటు పెద్ద మొత్తంలో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్‌ రవాణా సేవలు, డిజిటల్‌ లావాదేవీల ద్వారా నడిచిన ఈ విస్తృత నెట్‌వర్క్‌ను టాస్క్‌ఫోర్స్‌ వెలుగులోకి తీసుకొచ్చింది. చెన్నైకు చెందిన సరఫరాదారు ఎస్‌.ప్రభు ఈ అక్రమ మద్యం సరఫరా వ్యవస్థకు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. గత ఏడాది డిసెంబర్‌ 27న తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి (ఉత్తరం) పోలీసులు ఎక్సైజ్‌ సవరణ చట్టం 2020 కింద సెక్షన్‌ 34(ఎ)(1) మేరకు ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 378/2024 నమోదు చేశారు. మొత్తం 112 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు, అందులో జానీ వాకర్‌, గ్లెన్‌మోరాంజీ, చివాస్‌ రిగల్‌, జాక్‌ డేనియల్స్‌ వంటి ప్రీమియం బ్రాండ్లు ఉన్నాయి. రాజమండ్రికి చెందిన బుర్ల బాలకృష్ణ, ముప్పన రవికుమార్‌ను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలలోని నాణ్యతా లోపాలు, మూతలలో తేడాలు కనిపించడంతో అవి కేవలం ఎన్‌డీపీఎల్‌ కాదని, నకిలీ మద్యం అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తమైంది. దర్యాప్తులో ఈ మద్యం చెన్నైలోని ఎస్‌.ప్రభు నుండి సరఫరా జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ నిర్ధారణ చేసింది. ప్రభు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక అక్రమ విక్రయ దారులకు ప్రధాన సరఫరాదారుగా గుర్తించబడ్డారు. కీలక ఆధారాలపై ఎస్‌టీఎఫ్‌ దర్యాప్తును ముమ్మరం చేసి జనవరి 8న భీమవరంలో మరో కేసును గుర్తించింది. ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 09/2025 కింద కేసు నమోదు చేశారు. మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు నుండి 25 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు భీమవరానికి చెందిన కొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో కూడా మద్యం సరఫరా ప్రణాళికాబద్ధంగా సాగిందని, చెన్నైకి చెందిన ప్రభు ద్వారానే వీరికి చేరినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
విజయవాడ కేంద్రంగా మరో అక్రమ రవాణా
గత నెల 12వ తేదీన విజయవాడలో ఇదే తరహా మరో కేసును పోలీసులు గుర్తించారు. చివాస్‌ రిగల్‌, జానీ వాకర్‌ గోల్డ్‌ లేబుల్‌ రిజర్వ్‌ లాంటి 12 సీసాలు స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 4/2025 నమోదు చేశారు. ఈ కేసులో వెంకటరమణ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. నిందితుల విచారణలో చెన్నై నుండి ప్రైవేట్‌ రవాణా సేవల ద్వారా మద్యం అక్రమ రవాణా జరుగుతోందని తేలింది. వెంకటరమణ ట్రాన్స్‌పోర్ట్‌లో మద్యం తరలింపునకు సహకరించిన మేనేజర్లు ఇంకా పరారీలో ఉన్నారు. జనవరి 13న నెల్లూరు జిల్లాలో ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 12/2025 ప్రొహిబిషన్‌ చట్టం 1995 కింద మరో కేసు నమోదైంది. 25 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని మునిసామి నాగరాజు అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతను ఎనిమిదేళ్లుగా అక్రమ మద్యం వ్యాపారంలో ఉన్నాడు. 2017లో ఇదే ఆరోపణలపై అరెస్టు అయినా, కోర్టులో అతనికి విముక్తి లభించింది. విచారణలో చెన్నై నుండి ప్రైవేట్‌ రవాణా సేవల ద్వారా మద్యం సరఫరా చేసినట్లు తేలింది.
నెట్‌వర్క్‌ ప్రధాన నిందితులు
చెన్నైకి చెందిన ఎస్‌. ప్రభు, వ్యాసర్‌పాడికి చెందిన మాణిక్యం ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులుగా గుర్తిం చారు. వీరు ఫోన్‌ కాల్స్‌ లేదా వాయిస్‌ మెసేజ్‌ ద్వారా మద్యం ఆర్డర్లు తీసుకుంటారు. మద్యం సీసాలను ప్యాక్‌ చేసి వెంకటరమణ ట్రాన్స్‌పోర్ట్‌, ఎస్‌ఆర్‌కేఏ ఎల్‌టీ ట్రాన్స్‌ పోర్ట్‌ ద్వారా పంపి, డిజిటల్‌ చెల్లింపు విధానాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మద్యం నిల్వ చేయకుండా డిమాండ్‌ ఆధారంగా సరఫరా చేయడం వీరి ప్రత్యేకత.
చెన్నైలో కీలక సరఫరాదారు పట్టివేత
గత నెల 28వ తేదీన విజయవాడ నగరానికి ఎన్‌డీపీఎల్‌ సరఫరా చేస్తున్న సమయంలో ఎస్‌.ప్రభు చెన్నై పోలీసులకు చిక్కాడు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చగా పుజల్‌ సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వెంటనే నెల్లూరు ప్రధాన న్యాయమూర్తి కోర్టు నుండి పీటీ వారెంట్‌ పొందడంతో నెల్లూరు-1 టౌన్‌ పోలీసులు చెన్నై వెళ్లి అతనిపై విచారణ ప్రారంభించారు. ఈ కీలక ఆపరేషన్‌ను ఎస్‌.మధు, జగదీశ్వర రెడ్డి ఇతర అధికారుల సమన్వయంతో నిర్వహించారు. ఎక్సైజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముకేశ్‌ కుమార్‌ మీనా, ఎక్సైజ్‌ కమిషనర్‌ నిషాంత్‌కుమార్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ తదితర ఉన్నతాధికారులు రాష్ట్ర టాస్క్‌ ఫోర్స్‌, ఎక్సైజ్‌ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు