Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయ సమాజానికి సిగ్గుచేటు

అంతర్జాతీయ సమాజానికి సిగ్గుచేటు

- Advertisement -

ఐరాసలో గజా సంక్షోభంపై మాక్రాన్

న్యూయార్క్: పశ్చిమాసియాలో సంక్లిష్ఠ పరిస్థితులపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికా అనుసరిస్తున్న గజా దౌత్య విధానాన్ని విమర్శించారు. గజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కనీసం మానవతా సాయం అందని దుస్థితి నెలకొన్నదని, ఇది అంతర్జాతీయ సమాజం సిగ్గుపడాల్సిన విషయమని న్యూయార్క్ వేదికగా జరిగిన ఐరాస సమావేశంలో మాక్రాన్ వ్యాఖ్యానించారు.శాంతి స్థాపన ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేదని ఆయన భావోద్వేకంగా ప్రసంగించారు. పలస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. దేశంగా గుర్తిస్తే సమస్య పరిష్కారమైపోదన్నారు. హోర్మూజ్ జల సంధిని నియంత్రించే ప్రయత్నాలను దుయ్యబట్టారు. కీలక జల సంధిని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం ఆపాలన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి, వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ జల మార్గం కీలకమని, దీనిని తక్షణమే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడం ప్రాధాన్యతాంశమని మాక్రాన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘ఏడాది క్రితం నేను ఇదే వేదికపై ప్రసంగించిన సమయంలో గజా భీకర యుద్ధం సాగుతోంది. ఆ తర్వాత కొన్ని వారాలకే యుద్ధాన్ని ముగించి, వేలాది ప్రాణాలు కాపాడాం’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన కొద్ది సేపటికే మాక్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలకT ప్రాధాన్యత ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధం గురించీ ఆయన ప్రస్తావించారు. పౌర, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలన్నారు. ఇది కొత్త శకానికి నాంది పలుకుతున్న అనాగరిక చర్య అని వ్యాఖ్యానించారు. వెస్ట్ బ్యాంక్ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలస్తీనా ప్రజల మనుగడ హక్కును కాలరాసే విధంగా పరిణామాలు జరుగుతున్నాయన్నారు. పొరుగు దేశాలపై ఇజ్రాయిల్ సైనిక చర్యలు ఆ దేశ భద్రతను మరింత బలహీనపరుస్తాయని హెచ్చరించారు. మళ్లీ ఆటవిక పాలన దిశగా వేళుతున్నామా? నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నామా? అని తేల్చుకోవడానికి సమయం ఆసన్నమైందని మాక్రాన్ వ్యాఖ్యానించారు. కాగా పలస్తీనియన్లకు, ఇజ్రాయిల్ ప్రజలు, సుదూర ప్రాంతాల భద్రతకు ‘టూ స్టేట్’ విధానం ఒక్కటే పరిష్కారమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ మరోమారు స్పష్టంచేశారు. రెండు సార్వభౌమ, ప్రజాస్వామ్య దేశాలు పరస్పర శాంతియుత వాతావరణంలో జీవించడమే ఈ సమస్యకు ఉన్న ఏకైక పరిష్కారమని, దీనికి ప్రత్యామ్నాయం లేదని ఆయనన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు