Homeసంపాదకీయంపునరావాసమా? పరిహాసమా?

పునరావాసమా? పరిహాసమా?

- Advertisement -

పోలవరం సాకారమవుతోందని పదేపదే ప్రకటిస్తున్న ప్రభుత్వం ఈ అభివృద్ధి వెనుక ఆర్తనాదాలను మాత్రం ఇంకా విన్పించుకుంటు న్నట్లుగా కనపడటంలేదు. పోలవరం పునరావాసం పరిహాసంగా మారిపోయింది. 2027 నాటికి పోలవరంలో నీరును నింపేస్తామని చెపుతున్న ప్రభుత్వం, ఇప్పటివరకు సగం పునరావాస ప్రక్రియనూ పూర్తి చేయగలేదు. ప్రాజెక్టు ముంపు ఏరియాలో 41.15 మీటర్ల ఎత్తు నిర్మాణానికి గాను 35,037 కుటుంబాలను తరలించాల్సి వుండగా, నేటివరకు 18,179 కుటుంబాలను మాత్రమే తరలించింది. మిగతావారి పరిస్థితి ఏమిటి? నీళ్లు నింపేముందు నిరాశ్రయులం దరినీ తరలిస్తారా లేదా, వారికి పూర్తిగా నష్టపరిహారం ఇస్తారా లేదా అన్నది ఇంకా ఆగమ్యగోచరంగానే ఉంది. గోదావరి ఉగ్రరూపాన్ని అదుపు చేస్తూ, లక్షలాది ఎకరాలకు జీవజలాలు అందించే బృహత్తర సంకల్పంతో మొదలైన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘జీవనాడి’గా ప్రసిద్ధికెక్కింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, నిర్మాణ బాధ్యతలను స్వీకరించింది.
దాదాపు 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించడం, 23 లక్షల ఎకరాల కృష్ణాగోదావరి డెల్టాలను స్థిరీకరించడం, రాయలసీమకు నీటి తరలింపు, విశాఖపట్నం పారిశ్రామిక నగరానికి, తాగునీటికి సరఫరా చేయడం, 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు. నదుల అనుసంధానానికి ప్రతీకగా నిలిచే ఈ మహత్తర నిర్మాణం సాంకేతికంగా, ఇంజనీరింగ్ పరంగా ఎంతటి అద్భుతమో.. సామాజికంగా, మానవతా కోణంలో చూస్తే అంతటి తీవ్రమైన వ్యథను మోస్తున్న చారిత్రక విషాదం. డ్యామ్ కాంక్రీట్ నిర్మాణం, స్పిల్వే పనులు, కాఫర్డ్యామ్లు, డయాఫ్రామ్ వాల్ వంటి సాంకేతిక మైలురాళ్లను అధిగమిస్తూ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే దశకు చేరుకుంటోంది. పాలకుల ప్రసంగాల్లో, సమీక్షా సమావేశాల్లో ఎంత ఎత్తున నీరు నిల్వ చేయాలనే గణాంకాలే తప్ప, ఆ నీటి ముంపు కింద కనుమరుగవుతున్న లక్షలాది జీవితాల గురించిన చర్చ నామమాత్రంగా మారింది. ‘ముందు పునరావాసంతర్వాతే నీటి నిల్వ’ అనేది ప్రాజెక్టు నిర్మాణంలో రాజ్యాంగబద్ధమైన కనీస సూత్రం. కానీ ఆచరణలో పునరావాస, పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ అమలు తీవ్ర నిర్లక్షాయూనికి గురవుతోందన్నది కఠిన వాస్తవం. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే గ్రామాల సంఖ్య 370కి పైగా ఉండగా, దాదాపు 1,06,000 కుటుంబాలు నిరాశ్రయులవుతాయని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఇందులో సింహభాగం ఆదివాసీలు, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజలే. ఇప్పటివరకు పూర్తయిన పునరావాస ప్రక్రియను పరిశీలిస్తే, తరలించిన కుటుంబాల సంఖ్య కంటే ఇంకా తరలించాల్సిన కుటుంబాలే మెజారిటీగా ఉన్నాయి. ప్రాజెక్టు తొలి దశ (41.15 మీటర్ల కాంటూర్) కింద తరలించాల్సిన కుటుంబాలకే ఇంకా పూర్తిస్థాయిలో నష్టపరిహారం, కాలనీల నిర్మాణం పూర్తికాలేదు. ఇక పూర్తి స్థాయి జలాశయ మట్టం (45.72 మీటర్ల కాంటూర్) వరకు ముంపునకు గురయ్యే లక్షలాది మంది భవితవ్యం నేటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఆర్ అండ్ ఆర్ చట్టం 2013 నిబంధనల ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు ‘భూమికి భూమి’ ఇవ్వాలి. ఇళ్లు కోల్పోయిన వారికి పూర్తి మౌలిక వసతులతో కూడిన కాలనీలు నిర్మించి ఇవ్వాలి. ఉపాధి కోల్పోయిన యువతకు శాశ్వత జీవనోపాధి లేదా ప్యాకేజీ అందించాలి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్మించిన పలు పునరావాస కాలనీల్లో తాగునీరు, డైనేజీ, రహదారులు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి కనీస సదుపాయాలు కొరవడ్డాయి. గోదావరి ఒడ్డున, అటవీ సంపదపై ఆధారపడి స్వేచ్ఛగా బతికిన ఆదివాసీలను కాంక్రీట్ గోడల మధ్యకు చేర్చి, వారి జీవన విధానాన్ని ఛిన్నాభిన్నం చేశారన్న ఆవేదన వారి కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, నష్టపరిహారం చెల్లింపులో చోటుచేసుకుంటున్న జాప్యం, కొర్రీలు అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగినపðడల్లా నిర్మాణ ఖర్చుల ఆమోదం కోసం చూపే శ్రద్ధ, భూసేకరణ`పునరావాస నిధుల సమీకరణలో కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్‌మెంట్ చుట్టూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లభ్యత చుట్టూ బాధితుల జీవితాలు బంతిలా తన్నుకుపోతున్నాయి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ప్రత్యేక యూనిట్‌గా పరిగణించి పరిహారం ఇవ్వాలన్న నిబంధన అమలులో తీవ్ర అలసత్వం కనిపిస్తోంది. సాంకేతిక కారణాలు, ఆధార్ లింకింగ్ లోపాలు, సర్వేల్లో తప్పిదాల పేరుతో వేలాది మంది అర్హుల పేర్లు జాబితాల నుంచి గల్లంతయ్యాయి. ఇటీవల కేంద్ర బృందం పోలవరం పర్యటన నేపథ్యంలో పునరావాసం తీరుపై నిర్వహించిన సమీక్షలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంక్రీటు డ్యామ్ పనులు 92 శాతానికిపైగా పూర్తి చేసినట్లు చెపుతున్న ప్రభుత్వం పేదల తరలింపుపై మాత్రం శ్రద్ధ వహించడంలేదని విమర్శలున్నాయి. సెప్టెంబరు 17వ తేదీ నాటికి ముంపు ప్రాంపతాల నుండి కాలనీలకు 13,737 కుటుంబాలు వెళ్లగా, సొంతంగా ఇళ్లు నిర్మించుకుని 4,442 కుటుంబాలు మాత్రమే తరలివెళ్లాయి. ఫేజ్ 1లో పోలవరం జిల్లాలో 601 కుటుంబాలు, ఏలూరు జిల్లాలో 3,337 కుటుంబాలు, ఫేజ్ 1బిలో పోలవరం జిల్లాలో 11,523, ఏలూరు జిల్లాలో 1,388 మొత్తం 12,920 కుటుంబాలు ఇంకా పోలవరం ముంపు ప్రాంతంలోనే ఉన్నాయి. భూసేకరణ కు సంబంధించి ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో 1,00,099.58 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 94,796 ఎకరాలను మాత్రమే సేకరించారు. భూసేకరణకు రూ.6,166 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, నేటికి రూ.5,221.69 కోట్లు మాత్రమే చెల్లించారు.
వీఆర్.పురం, చింతూరు గ్రామాల తరలింపునకు 263 ఎకరాలు అవసరమవుతుంది. ఇదికాకుండా, మొత్తం ప్రాజెక్టు పరిధిలో గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు 5,040 ఎకరాలు అవసరమవుతుంది. ప్రభుత్వ అంచనాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదనేది వాస్తవం.ఇదిలావుంటే, వరదలు వచ్చిన ప్రతిసారీ కాఫర్డ్యామ్ కారణంగా బ్యాక్వాటర్ ఎగదన్ని ఇంకా ఖాళీ చేయించని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండల పైకి, అడవుల్లోకి పారిపోవాల్సిన దుస్థితి ఏటా పునరావృతమవుతోంది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలనే రాజకీయ తొందరపాటు కనిపిస్తోందే తప్ప, ముంపు బాధితులకు న్యాయం చేయాలనే మానవీయ దృక్పథం పాలకుల్లో కొరవడింది. జాతిసంపదను సృష్టించే క్రమంలో ఒక నిర్దిష్ట ప్రాంత ప్రజలను, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన గిరిజనులను బలిపశువులను చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు శోభనివ్వదు. రాష్ట్రానికి కోట్లాది రూపాయల సంపదను, రైతులకు సమృద్ధిగా నీటిని అందించే పోలవరం నిర్మాణం ఎంత ముఖ్యమో.. తరతరాలుగా తాము నమ్ముకున్న భూమిని, అడవిని, సంస్కృతిని త్యాగం చేసిన నిర్వాసితుల కన్నీళ్లు తుడవడం కూడా అంతే ముఖ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కేటాయింపులో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం మాని, యుద్ధప్రాతిపదికన సమగ్ర పునరావాస ప్యాకేజీని అమలు చేయాలి. ప్రాజెక్టులో ఒక్క చుక్క నీరు నిల్వ చేసే ముందే, చివరి బాధితుడి వరకు పరిహారం అందిందనే భరోసా ఇవ్వాలి. నిర్వాసితుల త్యాగాలపై నిర్మించే ప్రాజెక్టులు వారి దీవెనలతో నడవాలే తప్ప, వారి ఆర్తనాదాల పునాదులపై కాదు. పాలకులు చిత్తశుద్ధితో స్పందించి, బాధితుల హక్కులను కాపాడినప్పుడే పోలవరం అసలైన ప్రజా ప్రాజెక్టుగా సార్థకత సాధిస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు