Tuesday, December 24, 2024
Homeఅదానీ ముడుపులపై మౌనమేంటి?

అదానీ ముడుపులపై మౌనమేంటి?

. చంద్రబాబుకు రామకృష్ణ సూటిప్రశ్న
. జగన్‌ను కాపాడటమే లక్ష్యమా?
. ఒప్పందాలన్నీ రద్దు చేయాలని డిమాండ్‌

విశాలాంధ్ర-విజయనగరం: వందల కోట్ల రూపాయల అదానీ కుంభకోణంపై ప్రజలంతా చర్చించుకుంటున్నా… తమకేమీ తెలియదన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని, సమాచారం సేకరిస్తున్నామంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయనగరంలో శుక్రవారం రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదానీ కుంభకోణం న్యూయార్క్‌లో బయటపడిరదని, ఈ కేసుకు సంబంధించిన మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నాయని రామకృష్ణ చెప్పారు. అయినా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దీనిపై స్పందించకపోవడం దారుణమన్నారు. అదానీ ముడుపుల విషయంలో చంద్రబాబు వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2021లో సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడే… ప్రజలపై మోయలేని భారం పడుతుందని సీపీఐ హెచ్చరించిందని గుర్తుచేశారు. కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చివరకు తాను దీనిపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ కూడా వేశానని చెప్పారు. ప్రస్తుత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ కూడా కోర్టులో పిల్‌ దాఖలు చేశారన్నారు. తాను కోర్టులో కేసు వేయడంతో అజిజ్‌ కంపెనీ విద్యుత్‌ సరఫరాలో వెనక్కి తగ్గిందన్నారు. కానీ అదానీ మాత్రం దాదాపు 7వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కోసం రాష్ట్ర ప్రజలపై లక్షా పదివేల కోట్ల భారం మోపినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో 1750 కోట్ల రూపాయల ముడుపులు నాటి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినట్లు ఆధారాలు లభించినా ముఖ్యమంత్రి పునరాలోచనలో పడటం అనుమానాలకు తావిస్త్తోందన్నారు. కార్పొరేట్‌ పెద్దల ఆదేశాలతో దేశాన్ని పాలిస్తున్న మోదీ సర్కారు…. దానికి తొత్తులుగా ఉన్న కూటమి ప్రభుత్వాలు అదానీ విషయంలో కావాలనే తాత్సారం చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు సెకీకి సంబంధించిన కేసులో తనపేరు లేదని, తనకు సత్కారం చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. చంద్రబాబుకు ఆధారాలు లేకపోతే తాము అందజేస్తామని, త్వరలోనే నేరుగా ముఖ్యమంత్రిని కలుస్తామని రామకృష్ణ చెప్పారు. అదానీ చేతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నందున తనను ఏమీ చేయలేరనే ధీమాతో జగన్‌మోహనరెడ్డి ఉన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అదానీతో ఒప్పందా లను వెంటనే రద్దు చేయాలని, కృష్ణపట్నం, గంగవరం పోర్టు లను అదానీ నుంచి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శులు బుగత అశోక్‌, అలమండ ఆనందరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు