Sunday, November 16, 2025
Homeవిశ్లేషణఅమెరికా ముసుగు తొలగించిన ట్రంప్‌

అమెరికా ముసుగు తొలగించిన ట్రంప్‌

- Advertisement -

జి.నవీన్‌
డోనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ అమెరికా అధ్యక్షుడై తొమ్మిది నెలలే అయింది. కానీ అంతర్గతంగానూ, అంతర్జాతీయంగానూ ఆయన తీసుకున్న తలకిందుల నిర్ణయాలు చూస్తే అధికారంలోకి వచ్చి తొమ్మిది అయినట్టుగా ఉంది. అయితే ట్రంప్‌ అస్తవ్యస్త విధానాలు అమెరికా అనుసరించే విధానాలకు భిన్నమైనవని చాలామంది అనుకుంటారు. నిజానికి ట్రంప్‌ వ్యవహారం చూస్తే ఆయన అమెరికా నిజ స్వరూపాన్ని చూపిస్తున్నారు. అమెరికా ఎప్పుడూ క్రూర మృగంగానే ఉంది. వాస్తవానికి అమెరికా ఇన్నాళ్లుగా కనిపిస్తున్న తీరు అసలు స్వరూపాన్ని చూపించినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. అమెరికా ఆధిపత్యం మళ్లీ సంపాదించలేని రీతిలో తగ్గుతోంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికే దిక్కుతోచని స్థితిలో ట్రంప్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నిస్సిగ్గుగా ఇస్రాయెల్‌కు మద్దతు: ఇస్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ పలస్తీనియన్లపై కొనసాగిస్తున్న కిరాతకమైన దాడికి ట్రంప్‌ గట్టి మద్దతు ఇచ్చారు. ఈ మారణకాండలో ఇప్పటికే 20,000 మంది బాలలతో సహా 65 వేలకుపైగా జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు. నెతన్యాహు విధ్వంసాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా మారణ హోమం అంటోంది. అయినా వేలాదిమంది పలస్తీనియన్లను గజా నుంచి తొలగించి ఆ ప్రాంతాన్ని ‘‘శుద్ధి చేస్తాం’’ అని ట్రంప్‌ బహిరంగంగానే చెప్పారు. అంటే పలస్తీనియన్లకు అస్తిత్వాన్ని శాశ్వతంగా తొలగించడమే. ఇస్రాయెల్‌ మారణకాండను ఇదివరకు అమెరికా ఇలాగే సమర్థించింది. కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని అడ్డుకోవడానికి మాజీ అధ్యక్షుడు బైడెన్‌, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ అమెరికాకు ఉన్న వీటో అధికారాన్ని ఇప్పటికే ఆరుసార్లు వినియోగించుకున్నారు. ఇంకెన్ని సార్లు ఉపయోగించుకుంటారో తెలియదు. పలస్తీనియన్ల భూమి ఆక్రమించుకుని దాన్ని ‘‘బీచ్‌ ఒడ్డున ఉన్న ఆస్తిగా’’ మలుచుకుంటామని ట్రంప్‌ బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా దక్షిణాఫ్రికాఫ్రికాలోని జాతి వివక్ష ప్రభుత్వాన్ని అమెరికా చివరిదాకా సమర్థించింది. ఓ వైపున అంతర్జాతీయ సమాజం ఎన్ని విమర్శలు చేస్తున్నా అమెరికా ఈ పనే చేసింది. 1955 నుంచి 1975 దాకా వియత్నాం మీద అమెరికా దాడి చేసింది. డ్వైట్‌ డి.ఐసెన్‌ హోవర్‌ నుంచి రిచర్డ్‌ నిక్సన్‌ దాకా నలుగురు అమెరికా అధ్యక్షుల హయాంలో ఇదే దాడి కొనసాగింది. అప్పటి అమెరికా అధ్యక్షులు వియత్నాం మీద దాడిని ‘‘న్యాయమైన యుద్ధం’’, ‘‘సదుద్దేశం’’, ‘‘ఆఖరి ప్రయత్నం’’ అన్న చక్కెర పూత మాటలే చెప్పారు. ట్రంప్‌ మాత్రం తనకు మర్యాదపూరిత మాటలు చెప్పాల్సిన అవసరం లేదనుకునే వ్యక్తి. ఆయన పలస్తీనియన్లను అంతం చేయడాన్ని బాహాటంగానే సమర్థిస్తారు. అంటే ట్రంప్‌ నుంచి ఎదురయ్యే పరిణామాలేమిటో మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. దీనికి సంతృప్తి పడాల్సిందే.
తమ నగరాల మీదే ట్రంప్‌ యుద్ధం: మళ్లీ అధికారంలోకి వచ్చిన తరవాత ట్రంప్‌ తన పౌరుల మీద సైన్యాన్ని, భీకరమైన బలప్రయోగాన్ని వినియోగించారు. ‘‘ప్రజాభద్రత, అత్వవసర పరిస్థితి’’ పేరున ఆయన దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ‘‘జాతీయ రక్షణ దళాలను’’ ప్రయోగించారు. నేరాలను తగ్గించడానికి ఈ పని చేశామని ట్రంప్‌ చెప్తున్నప్పటికీ కొన్నేళ్లుగా అక్కడ నేరాలు తగ్గుతున్నాయి. ఆయన మెంఫిస్‌లోకి కూడా తమ బలగాలను పంపించారు. చికాగోలో కూడా అదే పని చేస్తామని ఆయన బెదిరిస్తున్నారు. వలస, కస్టమ్స్‌ నిబంధనలను అమలు చేయడానికి ఇదివరకే లాస్‌ఏంజెల్స్‌లో బలగాలను వినియోగించారు. ఈ నగరాలన్నీ ఆఫ్రికన్‌ అమెరికన్లు, హిస్పానిక్‌ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. ట్రంప్‌ చర్యల వెనక ఉన్న జాతి వ్యతిరేకతను విస్మరించడం కుదరదు. స్వదేశీయులను నియంత్రించడానికి సైనిక బలగాలను వాడుకోవడం సామాన్య ప్రజల జీవనాన్ని దుర్భరం చేయడమే. పశ్చిమ దేశాలకు ఆశాకిరణమైన ప్రజాస్వామ్యం అంటే ఇదేనేమో! పౌరులపై అమెరికా ప్రభుత్వం సైన్యాన్ని లేదా పోలీసులను వినియోగించడం అమెరికాకు కొత్తేమీ కాదు. 2005లో కత్రీనా ఉత్పాతం వచ్చినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ హయాంలో సైన్యం కాల్పులు జరిపి ఆఫ్రికన్‌-అమెరికన్‌ పౌరులను హతమార్చారు. జనం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని డానిజెగర్‌ వంతెన దాటుతున్న సమయంలో సైన్యం జరిపిన కాల్పుల్ల్లో అనేక మంది గాయపడ్డారు. దశాబ్దాలుగా అక్కడ ఆఫ్రికన్‌ అమెరికన్ల మీద హింసాకాండ కొనసాగుతూనే ఉంది. దీనికీ పసిపిల్లలు కూడా బలయ్యారు. తెల్లవారు కాని వారు కూడా ఇలాంటి హింసాకాండకే గురయ్యారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌, ఎరిక్‌ గర్నెర్‌, సండ్రా బ్లాండ్‌, తమీర్‌ రైచు లాంటి వారందరూ ఈ హింసాకాండకు గురైన వారే. పోలీసుల బల ప్రయోగం నుంచి పౌరులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మునుపటి అమెరికా అధ్యక్షులు ఊరట కలిగించడానికైనా చెప్పేవారు. ట్రంప్‌ పోలీసు బలగాలను సైనికీకరిస్తున్నారు.
విస్తరణవాద ఎజెండా: కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చేస్తామని, గ్రీన్‌లాండ్‌, చివరకు పనమా కాలవను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్‌ బీరాలు పలికారు. ప్రస్తుతం సమాజంలో ఇవి అసాధారణమైన ప్రకటనలే. అమెరికా అవతరణే అత్యంత ఆశ్చర్యకరమైంది. విస్తరణావాదం ఆ దేశ మూలుగల్లో ఉంది. అమెరికాలోని మూలవాసులను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు. మొదట యాత్రికులుగా, వర్తకులుగా వచ్చిన వారు 13 కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. చివరకు అవి 50 రాష్ట్రాలైనాయి. ఇదంతా అనైతిక ఎత్తుగడలు, నియమోల్లంఘన, మూలవాసులను లక్ష్యపెట్టకుండానే జరిగింది. సుదూరంగా ఉన్న హవాయ్‌ని అదే రీతిలో కబళించి కేవలం 65 ఏళ్లు మాత్రమే అయింది. ప్రపంచమంతటా అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. 80 దేశాల్లో అమెరికాకు 750 సైనిక స్థావరాలు ఉన్నాయి. పరాయి దేశాల్లో ఇన్ని సైనిక స్థావరాలున్న మరో దేశం లేదు. అందువల్ల ట్రంప్‌ బీరాలు పలకడానికి ఎల్లలు లేని అమెరికా విస్తరణవాదానికి భిన్నమైందేమీ కాదు. ఎలాన్‌మస్క్‌ లాంటి వారికి ఇదంతా అంగారక గ్రహాన్ని ఆక్రమించుకోవడం లాంటిదే. ఇతర గ్రహాల విషయంలోనూ అమెరికాది విస్తరణవాదమే.
ప్రభుత్వాలు పడదోయడం: వెనిజులా, ఇరాన్‌లో ప్రభుత్వాలను మార్చడంలో ట్రంప్‌ దాహం ఎన్నటికీ తీరనిది. ఇరాన్‌ అణుకేంద్రాల మీద నేరుగా దాడి చేయడానికి ట్రంప్‌ సకల నియమాలనూ ఉల్లంఘించారు. వెనిజులా పౌరులను అంతర్జాతీయ సముద్ర జలాల్లో హతమార్చారు. ఇలాంటి దుస్సాహసాలు అమెరికాకు కొత్తేమీ కాదు. ఒబామా లాంటి వ్యక్తి హయాంలోనూ విదేశాల నుంచి తమ పౌరులని అమెరికా తీసుకొచ్చేసింది. జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ హయాంలో ‘‘మానవ విధ్వంసక అయుధాలు’’ ఉన్నాయన్న నెపంతో ఇరాక్‌ మీద అమెరికా దండయాత్ర చేసింది. ఈ విషయం ఇంకా స్మృతిలోనూ ఉంది. లిండ్‌ సన్‌ ఓ రూర్కె రాసిన ‘‘కోవర్ట్‌ రెజీం చేంజ్‌: అమెరికాస్‌ సీక్రెట్‌ కోల్డ్‌ వార్‌’’ గ్రంథంలో 1947 నుంచి 1989 మధ్య కనీసం 64 దేశాలలో ప్రభుత్వాలను కూల్చేశారని రాశారు. అంటే మొత్తం ప్రపంచంలో మూడోవంతు దేశాలలో అమెరికా ప్రభుత్వాలను పడదోసింది. అయితే ట్రంప్‌ ఏలుబడిలో రహస్యంగా ప్రభుత్వాలను దించేయాల్సిన అవసరమే ఉన్నట్టు లేదు. ఆయన ప్రసంగాల ద్వారా చిటెకలో ఈ పని చేసేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలను బయటికి లాగడానికి రహస్య సమాచారాలను వెలికి తీసే వికీలీక్స్‌ అవసరం ఇప్పుడు ఎంతమాత్రం లేదు. ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ప్రభుత్వాలను పడదోయడానికి బాగా ఉబలాట పడ్తున్నారు. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇదే ఆత్రుత ప్రదర్శిస్తున్నారు. రక్షణ శాఖ పేరును ట్రంప్‌ యుద్ధ విభాగంగా మార్చేశారు. అంటే అమెరికా పోషిస్తున్న దుష్ట పాత్రను నిజాయితీగా అంగీకరిస్తున్నారన్న మాట.
ఈ విషయంలో అమెరికా ఇప్పటికే పరాకాష్టకు చేరుకుంది. ఇటీవల చైనా పురోగమనాన్ని ట్రంప్‌ జీర్ణించుకోలేక పోతున్నారు. అనేక ధృవాల ప్రపంచాన్ని ట్రంప్‌ సహించడం లేదు. సుంకాల విధింపునకు చైనా భయపడడం లేదని ఇటీవల జరిగిన షాంఘై సహకార సంఘ సమావేశంలో చైనా తెగేసి చెప్పింది. విజయోత్సవం రోజు చైనా ప్రదర్శించిన సైనిక బల ప్రదర్శనను చూస్తే ప్రపంచ గమనం మారిపోతోందని అర్థం అవుతోంది. వలస వచ్చే వారిని నిరోధించడానికి ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలు చూస్తే వలస వచ్చిన వారి స్వేదం, చాకిరీవల్లే అమెరికా అంతర్జాతీయ శక్తి కాగలిగిందన్న వాస్తవాన్ని దాచేస్తున్నారు. గత 250 ఏళ్లుగా అక్రమంగానో, సక్రమంగానో వలస వచ్చిన వారి శ్రమతోనే అమెరికా ఈ ఆధిపత్య స్థాయికి చేరుకుంది. అంతర్గత, బహిర్గత శత్రువులతో ట్రంప్‌ ఘర్షణ పడే ధోరణి అమెరికాకు మేలుచేయదు. ప్రస్తుత పరిస్థితి ఒక్క అమెరికా కోసమే కాదు మొత్తం ప్రపంచానికే ఎగుడు దిగుళ్ల ప్రయాణం. ఇందులో కనిపిస్తున్నదల్లా అమెరికా ఆధిపత్యం క్షీణించడమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు