అయోధ్యలోని రామ మందిరానికి భక్తులు కానుకలుగా, విరాళాలుగా సమర్పించిన వెండి, బంగారు వస్తువులు, నగదు దొంగతనానికి గురయ్యాయని ఆరోపణ వచ్చిన మూడు వారాలకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ విషయంలో దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం గురవారం నివేదిక విడుదల చేసింది. మామూలు సందర్భాలలో అయితే ఆరోపణలు వచ్చిన వెంటనే అరెస్టులు జరిగిపోయేవి. కానీ రామ మందిర అంశం ఘరానా వ్యవహారం కనక సిట్ దర్యాప్తు పూర్తయ్యాక గానీ ఆ ఎనిమిది మందిని అరెస్టు చేయలేదు. ఇందులో దొంగతనానికి రాం శంకర్ యాదవ్ (టిన్ను), సుభాశ్ శ్రీవాత్సవ అసలు సూత్రధారులంటున్నారు. అయితే రామ మందిర తీరœ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, చంపత్ రాయ్, అనిల్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేయలేదు. వారు గౌరవనీయమైన స్థానాల్లో ఉన్నారు కనక రాజీనామా చేయడానికి అవకాశం ఇచ్చారు. నైతిక బాధ్యత తీసుకుంటూ తాము రాజీనామా చేశామని వారిద్దరూ అంటున్నారు. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన అయోధ్య రామమందిరంలో దొంగతనం జరిగితే నైతిక బాధ్యత తమదేనని గ్రహించడానికి వీరిద్దరికీ మూడు వారాలు పట్టింది. అందుకే బుద్ధిమంతులకు ఆలస్యంగా జ్ఞానోదయం అవుతుందంటారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇంతవరకు ప్రాథమిక దర్యాప్తు మాత్రమే చేసింది. చాలా పకడ్బందీ వ్యూహంతో భక్తులు సమర్పించిన నగదు, నగలు దోపిడీ చేశారని ఈ దర్యాప్తులో తేలింది. దొంగతనానికి గురైన మొత్తం సొమ్ము విలువ ఎంత అన్న విషయంలో అనేక అంచనాలు ఉన్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయలని చాలా మంది అంచనా వేశారు. అయితే సిట్ దర్యాప్తులో రూ.7 నుంచి రూ.7.5 కోట్ల నగదు మాత్రమే మాయమైందని తేల్చారు. సమగ్ర దర్యాప్తు సవ్యంగా సాగితే ఇంకా అనేక పెద్ద చేపలు బయటపడొచ్చు. పోయిన సొమ్ము విలువ కూడా పెరగవచ్చు. రామ జన్మ భూమి తీరœ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడైన కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్. దాఖలైంది. కానీ అసలు దొంగల పేర్లు ఎఫ్.ఐ.ఆర్.లో కనిపించలేదు. ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఈ వ్యవహారంలో అసలు దొంగలను కాపాడే ప్రయత్నం పక్కా వ్యూహంతో సాగుతూ వచ్చింది. అందుకోసమే సిట్ ఏర్పాటు చేశారు. వాస్తవం కప్పి పుచ్చడానికి అబద్ధాలను ఆలంబనగా చేసుకున్నారు. కర్నాటకకు చెందిన రాయ్ సాహెబ్, ఆయన దగ్గరి బంధువు సంచుల్లో డబ్బును కర్నాటక తరలించే వారన్న ఆరోపణ బలంగా ఉంది. అయినా ఎఫ్.ఐ.ఆర్.లో కానీ, రాజీనామా చేసిన “గౌరవనీయులైన” వారిలో గానీ ఆ ఇద్దరి పేర్లే లేవు. అరెస్టు అయిన ఎనిమిది మంది చిన్న చేపలే. పెద్ద చేపలన్నీ “సిట్” వల నుంచి తప్పించుకోవడానికి సకల బందోబస్తులూ చేసినట్టు స్పష్టం అవుతోంది. “సిట్” లో ఉన్న వారు పెద్ద అధికారులే. కానీ వారు రామ మందిర ట్రస్ట్‌లో కూడా అధికారులే. అంటే దొంగతనానికి పాల్పడ్డ వారినే దర్యాప్తు కమిటీలో వేసి రక్షించవలసిన తిమింగలాలను రక్షించడానికి గట్టి ఏర్పాట్లు చేశారన్న మాట. రామ మందిర్ ట్రస్ట్ ఆడిటర్, బ్యాంకు సీనియర్ అధికారి మహిపాల్ సింగ్ ముందు నుంచి దేవుడి సొమ్ము తరలిపోతోందన్న ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అనేక ఏళ్ల ముందే ఆయన ఈ దొంగాటను బయటపెట్టారు. ఆయన చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయించడానికి బదులు ఆయనను ట్రస్ట్ నుంచి తొలగించారు. మహిపాల్ సింగ్ పరాయివాడేమీ కాదు. ఆయనకు రామ మందిర ఉద్యమంతో సంబంధం ఉంది. సంఘ్ పరివార్‌తోనూ సంబంధం ఉన్నవారే. 2021లోనే సొమ్ము తరలిపోతోందన్న ఆరోపణ ఆడిట్ నివేదికలోనే వచ్చింది. అప్పుడు చంపత్ రాయ్ చేసిందేమీ లేదు. అంటే దొంగతనం కొనసాగించారు. అప్పుడే నగదు, నగలు లెక్కించే చోట కెమెరాలు బిగించారు. కెమెరాలు కెమెరాల్లాగే ఉన్నాయి కాని లెక్కించేటప్పుడు ఒక వ్యక్తి వాటికి అడ్డంగా నిలబడితే మరో వ్యక్తి దోచేయాల్సింది దోచేసే వారు. ఈ దొంగతనం ఒక్క రోజుకు పరిమితమైంది కాదు. అనేక రోజులుగా జరుగుతూనే ఉంది. మందిర నిర్మాణం కోసం అనేక మంది వెండి ఇటుకలు తయారు చేయించి ఇచ్చారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది. వీటికీ లెక్కా పత్రం లేదు. అవి ఇచ్చిన వారికీ రసీదులు ఇవ్వలేదు. వాటిని చూపించనూ లేదు. ఇవన్నీ చంపత్ రాయ్ చేతికే ఇచ్చారు. వీటన్నింటికీ చంపత్ రాయ్ బాధ్యత లేదా! చంపత్ రాయ్ నిర్వహిస్తున్న ట్రస్ట్‌లో అనేక అవకతవకలు జరుగుతూ ఉంటే ఆయనకు తెలియలేదనుకోలేం. ఒకవేళ తెలియకపోతే అది ఆయన అసమర్థతకు చిహ్నం. తెలిసినా ఏ చర్యా తీసుకోలేదంటే అవకతవకల్లో ఆయనకూ భాగస్వామ్యం ఉన్నట్టే. ట్రస్ట్ కోసం భూములు కొనడంలో నానా గందరగోళం జరిగిందన్న ఆరోపణలు చాలా రోజుల నుంచే వస్తున్నాయి. ఒక భూమిని కొన్న కొన్ని నిముషాల్లోనే అదే భూమిని ట్రస్ట్ చేత అనేక రెట్ల ధరకు కొనిపించారు. ఈ అవకతవకలకు పాల్పడ్డ వారందరూ ఎవరో కాదు. ట్రస్ట్‌తో బాధ్యతలు నిర్వహించే వారికి సన్నిహితులే. రామ జన్మ భూమి ట్రస్ట్ కోసం ఏ భూములు కొనాలో, ఎవరి దగ్గర కొనాలో, ఎంతకు కొనాలో, ఆ లావాదేవీలు సవ్యంగా ఉన్నాయో లేదో చూడవలసిన బాధ్యత చంపత్ రాయ్ మీదే ఉన్నప్పుడు ఆయన కిమ్మనకపోవడంలో ఆంతర్యం ఏమిటి? చంపత్ రాయ్, అనిల్ కుమార్ మిశ్రా, బీజేపీ మాజీ మేయర్ హృషీకేశ్ ఉపాధ్యాయ్, ఆయన దగ్గరి బంధువు దీప్ నారాయణ్ పాత్ర ఉందంటున్నారు. రామ మందిరం కోసం భూముల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి 2021లో రాధే శ్యాం మిశ్రా కమిటీ ఏర్పాటు చేశారు. అయిదేళ్లయినా ఈ కమిటీ నివేదిక ఊసే లేదు. రామ మందిర ట్రస్ట్‌లో జరిగిన కుభకోణం, దైవ ద్రోహంలో కింది స్థాయిలో ఏ గొడవా జరగలేదు. ప్రతి విషయంలోనూ పెద్దల హస్తమే ఉంది. చంపత్ రాయ్ వారి దోపిడీకి చేయూత అందించారు. ఆయనా దండిగానే లాభపడి ఉండొచ్చు. ఆ పెద్దలకు ఈ సెగ తగలకూడదంటే చంపత్ రాయ్‌ను రెక్కల కింద దాచి కాపాడాల్సిందేగా! కానీ ఈ పెద్దలెవరి మీదా ఈగైనా వాలలేదు. చిన్న చేపలు మాత్రం “సిట్”కు చిక్కాయి. వారినే అరెస్టు చేశారు. చిన్న చేపల మీద ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయడం కూడా మహానాటకంలో అంతర్నాటకమే అయి ఉంటుంది. మోసపోతున్నది అమాయక భక్తులు.


