Homeవిశ్లేషణఆకాశవాణి….మీరు చదువుతున్నది జానకమ్మ పాట

ఆకాశవాణి….మీరు చదువుతున్నది జానకమ్మ పాట

- Advertisement -

లోటు కాదు కానీ… ఓ వెలితి. ఆమె వెళ్లిపోయిందని అనుకుంటున్నాం కానీ వేలాది పాటలతో మనతోనే నడుస్తోంది కదా…! “నీ లీల పాడెద దేవా” అలనాడెప్పుడో పాడారు కదా… ఆ లీలలో భాగమే ఆమె వెళ్లిపోవడం. మా అమ్మ ప్రేమకి పాత్రురాలీ జానకమ్మ. నా భార్య పాటల పిచ్చికి ఆనంద భైరవి ఈ తల్లి. నా కూతురు ఆధునికతను “అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ… అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా” అంటూ హెచ్చరికలు జారీ చేసిందీ ఈ జానకమ్మే. ఒక మనిషి మరణించడమంటే మానవత్వం ఊపిరి బిగపట్టడమే… కానీ శిష్ట్లా వారమ్మాయి జానకి మరణించడమంటే కొన్ని సెకన్ల పాటు ఊపిరి నిలిచిపోవడం. “నా ప్రతిభ ఇది… మీరు గుర్తించడం లేదు. అందుకే నేనే తిరస్కరిస్తున్నా” అనడానికి ఎన్ని గుండెలు కావాలి…! “అబ్బే… ఎన్నో గుండెలు అవసరం లేదు… ఒక్క గుండె చాలు. అది నా గుండే” అంటూ దేశంలో అతి పెద్ద పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ను నచ్చని పాటని పాడను అన్నంత సులువుగా తిరస్కరించింది కూడా జానకమ్మే. ఇద్దరు గాయనీమణులను కోల్పోయాం ఈమధ్యనే. వాళ్ల పాటలతో పరవశించాం. వాళ్ల జీవితాలను తెలుసుకుని ఓ కంటి నుంచి కన్నీరయ్యాం. అవును… నేను రావు బాల సరస్వతి గురించే చెబుతున్నాను. ఆమెతో పాటు ఎస్.జానకి గురించి కూడా మాట్లాడుతున్నాను. పురుషాధిక్యానికి బలైన రావు బాల సరస్వతి గాత్రం గురించే ప్రస్తావిస్తున్నాను. మరో పురుషుడి పట్టుదల కారణంగా ఆరు దశాబ్దాలకు పైగా 50 వేల పాటలు పాడిన జానకమ్మ గాత్రం అలరించిన వైనాన్ని వివరిస్తున్నాను. గానానికి పరదాలు కట్టి షరతుల నరకాన్ని చూపించిన ఆ పురుష పుంగవుడు మనకి చేసిన ద్రోహం గురించే మాట్లాడాలి అంటున్నాను. జానకమ్మ గొంతు ముడి విప్పి ప్రపంచానికి పాటల పూదోటను అందించిన ఆ తోటమాలిని ప్రస్తుతించాలి కదా అంటున్నాను. జెమినీ స్టూడియో వారికి “మా దగ్గర ఓ అమ్మాయుంది. చక్కగా పాడుతుంది. మీరు అవకాశం ఇవ్వండి” అంటూ తండ్రి చేత ఉత్తరం రాయించి మరీ ఈ జానకమ్మను సినీ సంగీత లోకానికి తీసుకువచ్చిన ఆ రామ్ప్రసాద్‌కు మనమంతా రుణపడి ఉండాలని కూడా చెబుతున్నాను. అన్నట్లు ఆ రామ్ప్రసాద్ అప్పుడు బ్యాచిలర్. జానకమ్మలో ప్రతిభనే గుర్తించిన మనిషి. అప్పుడప్పుడే ఆ రామ్ప్రసాద్ ఫొటోను పర్సులోను, రూపాన్ని గుండెల్లోనూ ప్రతిష్టించుకున్నారు జానకమ్మ. ఓ గుర్తింపు… మరో ప్రతిభ కలయికల కారణంగా లక్షలాది అభిమానులకు దశాబ్దాల పాటు వీనుల విందు అయ్యింది. మనం ఆమె గానాన్ని ప్రేమించాం. అతగాడు గాత్రంతో పాటు ఆమె మనసును గెలుచుకున్నాడు. హఠాత్తుగా ఆమె జీవితం నుంచి మృత్యువు రూపంలో మాయ మయ్యాడు. ఆ గాత్రం తడారిపోయింది. ఆ గాత్రం గుండెలో మూగబోయింది. ఆ గాత్రం కన్నీరుమున్నీరు అయ్యింది. అతను పట్టుకున్న చిటికెన వేలుకి గోరుచుట్టు అయ్యింది. విషాదం ఆ జానకమ్మను చాలాకాలం వేధించినా కొడుకు కోసం మళ్లీ పాటయ్యింది. దేవుడు ఉన్నాడనుకోవడం ఎంత వాస్తవమో లేడని వాదించాల్సి రావడం కూడా అంతే వాస్తవం. లేకపోతే పండుటాకు లాంటి ఆమె జీవితంలోకి మరో విషాదం తొంగి చూడడమేమిటి…! “నేనూ వెళ్లిపోతున్నానమ్మా” అంటూ మాట మాత్రమైనా పలకకుండా ఆ కొడుకు కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. కొన్ని సంవత్సరాల వ్యవధిలో జానకమ్మ అంతర్ ప్రాణం… బహిర్ ప్రాణం ఆమె నుండి విడివడి వెళ్లిపోయాయి. కవి అన్నట్లు ఒంటరి చేల మధ్య ఆ అమ్మ ఒక్కతే మిగిలిపోయింది. ఆ చేలలో ఆమె కన్నీళ్లతో దుఖం అలా అలా పెరిగింది. అలా పెరిగిన దుఖాన్ని మనందరికీ పంచి జానకమ్మ కూడా వెళ్లిపోయింది. చాల సంవత్సరాల క్రితం నా భార్య ఈశ్వరి, నేను మణికొండకు దగ్గరలోని ఓ ఇంట్లో జానకమ్మను కలిశాం. ఆ రోజు ఈశ్వరి కళ్లలో ఓ మెరుపు చూశాను. ఓ సోఫాలో కూర్చున్న జానకమ్మ మమ్మల్ని తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోమన్నారు. ఈశ్వరి మాత్రం ఆమె కూర్చున్న సోఫా దగ్గరకు వెళ్లి జానకమ్మ కాళ్ల దగ్గర కూర్చుంది. “అయ్యయ్యో… ఇక్కడ కాదమ్మ… సోఫాలో కూర్చోమ్మా” అన్నారు. “దేవతల పక్కన కూర్చోకూడదు. ఆమె ముందు దీపపు కుందెలా ఒద్దిగా ఉండాలి” అన్నాను.

  • సీనియర్ జర్నలిస్ట్, 99120 19929
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు