Homeవిశ్లేషణడాలర్‌కు దీటుగా ఆర్5 కరెన్సీ

డాలర్‌కు దీటుగా ఆర్5 కరెన్సీ

- Advertisement -

ప్రపంచ జనాభాలో సుమారు 400 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 41 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 26 శాతం వాటా కలిగిన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా తదితర దేశాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి నాయకులు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత రాజధాని న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. అనేక కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నిర్ణయాలకు ఈ శిఖరాగ్ర సమావేశం నాంది పలికే అవకాశం ఉంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్ధమాన దేశాలపై వరుసగా సుంకాలు పెంచుతూ వాటి ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిక్స్‌ 18వ శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి సంస్థల నుంచి కొన్ని నిర్ణయాలకు ఆటంకాలు ఎదురైనా, ఇతర మార్గాల్లో సుంకాలను పెంచే ప్రయత్నాలను ట్రంప్ కొనసాగిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు బ్రిక్స్‌ దేశాలు తమ ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఆర్5 కరెన్సీపై చర్చ : డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్‌ దేశాల మధ్య పరస్పర లావాదేవీలను ప్రోత్సహించేందుకు ‘ఆర్5’ పేరుతో కరెన్సీని తీసుకురావాలనే ప్రతిపాదన గతంలో కూడా చర్చకు వచ్చింది. బ్రిక్స్‌ సభ్యదేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో పెంచుకోవడం, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థల్లో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నాయి.
అగ్రనేతల సమక్షంలో కీలక చర్చలు : భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర సభ్యదేశాల నాయకులు తమ ప్రతినిధి బృందాలతో హాజరుకానున్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా అంకుర సంస్థల ఏర్పాటు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్స హించడం, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని పెంచడం, సుస్థిర సరఫరా గొలుసులను ఏర్పాటు చేయడం వంటి అంశాలు కూడా శిఖరాగ్ర సమావేశంలో ప్రాధాన్యం పొందనున్నాయి. ప్రపంచంలోని అనేక కీలక ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణల కారణంగా సరఫరా గొలుసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాని ప్రభావం ప్రజలపై పడుతోంది. ఈ పరిస్థి తుల్లో సరుకుల రవాణా, సరఫరా వ్యవస్థలను మరింత పటిష్టం చేయడం, నిరంతర సర ఫరాలను కొనసాగించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని విస్తరించడం అన్ని దేశా లకూ అవసరం. సుస్థిర సరఫరా వ్యవస్థల కోసం పరస్పర సహకారం పెంచు కోవడం, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం, బ్రిక్స్‌ బ్యాంకు పాత్రను విస్తరించడం వంటి అంశాల పై దృష్టి సారించే అవకాశం ఉంది.
ఏకపక్ష ఆంక్షలకు ప్రత్యామ్నాయం : సభ్య దేశాలపై ఏకపక్షంగా విధించే ఆంక్షలను ఎదుర్కోవడం, పరస్పర వాణిజ్యాన్ని పెంచుకోవడం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడం వంటి అంశాలపై 11 సభ్య దేశాలు, మరో 10 భాగస్వామ్య దేశాల నేతలు చర్చిస్తారు. ఆఫ్రికన్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి వంటి సంస్థల ప్రతినిధులతో పాటు ఇరాన్, యూఏఈ, ఇండోనేషియా వంటి దేశాల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈజిప్ట్, సౌదీ అరేబియా సభ్య దేశాలుగా, బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేసియా, నైజీరియా, ఉగాండా, వియత్నాం, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలు భాగస్వామ్య దేశాలుగా పాల్గొనడం బ్రిక్స్‌ విస్తరిస్తున్న ప్రాధాన్యాన్ని సూచిస్తోంది.
భారత్-చైనా సంబంధాలకు కొత్త ఊతం ? ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్, చైనా మధ్య ఈ సందర్భంగా జరిగే ఆర్థిక, వాణిజ్య చర్చలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో జరిపే చర్చలు ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు, ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణకు దోహదపడతాయని రెండు దేశాలు ఆశాభావంతో ఉన్నాయి. అత్యధిక జనాభా, భారీ ఆర్థిక వ్యవస్థలు, విస్తారమైన భూభాగం, ప్రాచీన నాగరికతలకు నిలయాలైన భారత్, చైనా మధ్య సుహృద్భావ సంబంధాలు బలోపేతమైతే అది రెండు దేశాల ప్రజలకు మాత్రమే కాకుండా మొత్తం ఆసియాకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొనుగోలు శక్తి సమానత్వం ప్రాతిపదికన చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్, చైనా కలిసి దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇటీవల భారత్, చైనాల మధ్య అనేక నగరాలకు నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కావడం కూడా ఆర్థిక, వాణిజ్య సంబంధాల విస్తరణకు మార్గం సుగమం చేస్తోంది. నగరాలు, విశ్వ విద్యాల యాలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల మధ్య సహకారం కూడా పెరుగుతోంది. ఇది రెండు దేశాలకే కాకుండా ఆసియా, మొత్తం ప్రపం చానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్-చైనా చోదక శక్తులు : భారత్, చైనా సమీప భవిష్యత్తులో ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా నిలిచే అవకాశం ఉంది. రెండు దేశాల ఉమ్మడి జీడీపీ 28.4 శాతం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. పరస్పర సహకారం పెంచుకుంటే ఈ శక్తి మరింత బలపడుతుంది. చారిత్రకంగా భారత్, చైనా మధ్య పంచశీల సూత్రాలు శాంతియుత సహ జీవనం, పరస్పర గౌరవానికి ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ పరస్పర ప్రయోజనాల ఆధారంగా సంబంధాలను బలోపేతం చేయడం రెండు దేశాలకు ఉపయోగ కరంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు సాగుతున్న యువత భవిష్యత్తులో భారత్-చైనా మధ్య కొత్త వారధులుగా నిలిచే అవకాశం ఉంది.
బ్రిక్స్‌ శక్తి పెరుగుతోంది : బ్రిక్స్‌, దాని భాగస్వామ్య దేశాల ఆర్థిక పరిమాణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయంగా పెరుగుతోంది. ఈ దేశాల సమష్టి జీడీపీ 35 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో బ్రిక్స్‌ దేశాల ఆర్థిక వృద్ధి జీ7 దేశాల కంటే 3 రెట్లు ఎక్కువగా వృద్ధి చెందనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా. అయితే బ్రిక్స్‌ శక్తి కేవలం ఆర్థిక పరిమాణంలోనే లేదు. ప్రపంచ జనాభా, సహజ వనరులు, ఇంధనం, తయారీ, వ్యవసాయం, సాంకేతికత, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో ఈ కూటమి దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రాచీన నాగరికతలకు నిలయాలైన బ్రిక్స్‌ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతమైతే దాని ప్రభావం కూటమి దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏకపక్ష ఆధిపత్యాన్ని తగ్గించడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించడం, పరస్పర వాణిజ్యాన్ని పెంచడం, సుస్థిర అభివృద్ధికి మార్గాలు అన్వే షించడం వంటి లక్ష్యాల సాధనలో బ్రిక్స్‌ కీలక వేదికగా మారవచ్చు. ప్రస్తుత ప్రపంచం యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాలు, ఆర్థిక అసమానతలు, ఇంధన సంక్షోభం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో బ్రిక్స్‌ దేశాలు విభేదాలను పక్కనపెట్టి ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపరుచుకుంటే అది విశ్వశ్రేయస్సుకు ఎంతో మేలు చేస్తుంది. సీనియర్ జర్నలిస్ట్, సెల్ : 9440990381

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు