Homeవిశ్లేషణమతాల మధ్య చిచ్చుపెడుతున్న అమెరికా

మతాల మధ్య చిచ్చుపెడుతున్న అమెరికా

- Advertisement -

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

“మతం మత్తు మందు” అన్న మాటను కార్ల్ మార్క్స్ ఒక సామాజిక విమర్శగా ఉపయోగించాడు. అదే మతం రాజకీయ అధికారానికి, జాతీయ ఆధిపత్యానికి ఆయుధంగా మారినప్పుడు సమస్య మొదలవుతుంది. స్వీయ మత ఐక్యత పేరుతో పరమత ద్వేషాన్ని పెంచడం, ఇతర దేశాలపై శత్రుత్వాన్ని నిర్మించడం, ప్రజల మధ్య విభజనలను సృష్టించడం ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతుంది. అభ్యుదయ భావాల్ని ఆరపోస్తున్న ప్రగతిశీల దృక్పథాలకు పెద్దపీట వేస్తున్న, సామాజిక దృకÎధాలకు చెల్లుచీటీ రాస్తూ, గతంలో మనిషి అంటకాగుతూ అరిగిపోయిన, ఆరిపోయిన మతం పిచ్చి కూటముల వెంట మళ్లీ పరుగెడుతూ స్వీయ ఐక్యత కోసం స్వీయమత దేశాల ఐక్యత కోసం వివిధ దేశాల రాజ్యాధినేతల సామరస్యపు చర్చలకు తెరతీసిందనే చెప్పొచ్చు. ఈ చర్చల్లో ఒక దేశం అన్ని దేశాల మీద నెరుపుతున్న దురాగతాలకు బదులు, స్వీయ మతస్థులైన దేశాలన్నీ ఒక తాటి మీదకు ఎందుకు రాకూడదనే అంశాలే చర్చనీయాంశాలుగా సాగి ఐక్యత సాధించడం, మతం ప్రభావం తరతరాలకు తరిగిపోదనే భావన తేటతెల్లమవుతుంది. అంటే ఇంకా ప్రపంచం మీద మతం మౌఢ్యం తిష్టవేసి కూర్చున్నదనే చెప్పుకోవాలి. ప్రపంచంలో యుద్ధాలు జరగడం, భావ సారూప్యం లేకపోవడం, రాష్ట్ర విస్తరణ కాంక్ష ప్రబలడం, ఆర్థిక ఉత్పాదక లావాదేవీల అసమానతలు తలెత్తడం, లావాదేవీల్లో తేడాలు రావడం సర్వసాధారణం. వీటిని నిలకడగా, నిజాయితీగా చర్చించుకొని, అన్యా యంగా, అక్రమంగా ఆధిపత్య ధోరణితో ఏ దేశం ఎందుకు తన స్నేహ హస్తాలకు విషపూరిత నఖాలను తగిలించుకొని రక్కడానికి ప్రయత్నిస్తుందో అనే కుయుక్తిని కుట్రను బట్టబయలు చేసి ఎండగట్టడం . అగ్ర దేశమనే అహంభావంతో, గర్వంతో చిన్న దేశాల మీద చులకన భావం చూపెడుతూ, దండయాత్రకు దిగడం అగ్రరాజ్య నియంతృత్వ ధోరణికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇటువంటి సంఘటనే ఈ మధ్య అమెరికా ఇరాన్ మధ్య చెలరేగిన యుద్ధం సారాంశం. ఇరాన్ లొంగుబాటు విధానానికి స్వస్తి పలికి అమెరికాకు ధీటుగా నిలబడి యుద్ధం కొనసాగించిందో అప్పుడే అమెరికా గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ట్రంప్ స్టేట్మెంట్స్‌ అన్నీ ‘ఉత్తరకుమార ప్రగల్బాలుగా తేలిపోతున్నాయి’. తాచెడ్డకోతి ‘వనమంతా చెరచినట్లు’ ట్రంప్ రాజనీతి ప్రపంచ దేశాల్లో పెద్ద చిచ్చే పెట్టేట్టు కనిపిస్తుంది. రాబోయే కాలంలో నిరంకుశ భావజాలంతో అమెరికా చిన్న దేశాలను శాసించాలను కుంటే మతపరమైన భావజాలం అనుసరిస్తున్న దేశాలన్నీ ఒక గొడుగు కిందకు చేరే ప్రమాదం వుంది. ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు వారి అంతర్గత కలహాలను పక్కనబెట్టి అన్నీ ఒక తాటి మీదకు రావాలనే మంతనాలు మొదలయ్యాయి. అంటే అగ్రదేశమైన అమెరికా తెలివి ఇస్లామిక్ ఒకటిగా చేయడానికి పనికి వచ్చిందనుకోవాలి. ఇంతకు మినహా సాధించిందేమి లేదు. డోనాల్డ్ ట్రంప్ దూకుడు తగ్గించుకోకపోతే అణ్వాస్త్రాలు బయటకు తీయాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధినేత మొహసెన్ రెజాయ్ వ్యాఖ్యానించడాన్ని తేలిగ్గా తీసిపారెయ్యలేము. అణ్వా యుధాలు లేని దేశం కూడా తమ భద్రత కోసం వాటిని సమీకరించు కోడానికి ప్రయత్నిస్తాయి అనడం సత్యదూరమైన విషయం కాదు. మూర్ఖంగా సాగుతున్న అమెరికా-ఇరాన్ అణ్వాయుధాల వ్యాప్తికి అవకాశం కల్పించిందిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయం. ట్రంప్ చర్యలు ప్రపంచ దేశాల్లో సరికొత్త భద్రతా ఏర్పాట్లకు తెరలేపుతుందనుకోవడం అతి శయోక్తి కాదు. ఇరాన్ తనదైన అస్తిత్వ భావజాలాన్ని యుద్ధభయంతో వదులు కోకుండా, గట్టిగా ఎదురొడ్డి పోరాడటం ప్రపంచంలోని బడుగు, బలహీన దేశాల్ని ఒక అస్థిత్వపు ఆలోచనల్లోకి నెట్టేస్తుందనడం సత్యదూరమైన అభిప్రాయం కాదు. ‘ఆర్థిక దిగ్బంధం’ ద్వారా అగ్రదేశాలు, బడుగుబలహీన దేశాల మీద ఒత్తిడి తెచ్చి లొంగదీసుకోవాలనుకోవడం ‘కలలో మాట’గా రెజాయ్ తేల్చి చెప్పేశాడు. ఏది ఏమైనా అమెరికాకు భయపడి హోర్మూజ్‌ని తెరవడం జరుగదని “రెజాయ్” ఘంటాపథంగా ప్రకటించాడు. మనం నిశితంగా పరిశీలించినట్లయితే పర్షియన్ గల్ఫ్ తీరంలోని హోర్మూజ్ సగానికి పైగా ఇరాన్ ఆధీనంలోనే వుంది అని, జలసంధిని కంట్రోల్ చేసే పూర్తి అధికారం ఇరాన్కే ఉందని రెజాయ్ ఉద్ఘాటించారు. ఆంక్షలు పెట్టి ఇరాన్‌ను లొంగదీసుకోవాలనే తెలివిని అమెరికా ప్రదర్శిస్తుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి రెజాయ్’ అభిప్రాయపడ్డాడు. అమెరికా అనుకుంటున్నంత శక్తిహీనంగా ఇరాన్ లేదనే భావన ‘రెజాయ్ మాటల్లో వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క దౌత్యమార్గంలో సమస్య పరిష్కరించుకోవాలనే భావాన్ని వ్యక్తపరుస్తూ ఈజిప్టు మధ్యవర్తిత్వం నెరపటానికి వినియోగించుకుంటూ మరో పక్క క్షిపణుల దాడులు చేస్తూ ఇరాన్‌కు నష్టం కలిగిస్తూ ద్వంద్వ వైఖరిని అమెరికా పాటిస్తుంది. ఆమెరికా ఆంతర్యం చమురు సరఫరాకు కీలకమైన హోర్మూజ్ జలసంధిని ఏదో విధంగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది ప్రగాఢమైన కోరికగా భావించాలి. కానీ అది జరగదు అని చెబుతుంది ఇరాన్. అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తు ఇస్లామిక్ దేశాలన్నీ ఏకమయ్యే మంతనాలు జరుగుతున్నాయ్. బహుశ ఈ యుద్ధం చిలికిచిలికి గాలివానగా మారినట్లు మతపరమైన అంటే క్రిష్టియన్ ఇస్లామ్ మతాల మధ్య రగిలే చిచ్చుగా చరిత్రలో నిలిచిపోయే ప్రమాదముంది. ఇరాన్‌ను ఓడించి హోర్మూజ్ జలసంధిని అమెరికా నూతన భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ చేసిన ప్రకటన యుద్ధం సరికొత్త భావావేశాల్లోకి పోయి, యుద్ధ విరమణకు, దౌత్య కార్యకలాపాలకు ఆటంకం కలుగవచ్చుననేది విజ్ఞుల అభిప్రాయం. ఏదిఏమైనా అగ్రదేశమైన అమెరికా ఉగ్రరూపం దాల్చడం, ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమేననే అభిప్రాయం ఇప్పటికే ముస్లిం దేశాల్లో విపరీతంగా వ్యాప్తి చెందింది. లొంగిపోకుండా చివరి వరకు పోరాడాలనే ఇరాన్ ధైర్యాన్ని స్వాగతించాల్సిందే! అగ్రదేశం అమెరికా మతాల మధ్య చిచ్చుపెడుతుందనే వాదం ప్రపంచమంతా కోడై కూస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు