Homeవిశ్లేషణమోదీ శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు

మోదీ శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు

- Advertisement -

చలసాని వెంకట రామారావు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు. ఈ కాలంలో అప్పడప్పుడు కొన్ని అపశృతులు ఉన్నా దేశ ప్రజాస్వామిక వ్యవస్థ పార్లమెంటరీ విధానంలో పరిఢవిల్లుతున్నది. రాజ్యాంగ వ్యవస్థలు ఎవరిపని వారు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమ లక్ష్యాల ను పరిపూర్తి చేసే క్రమంలో ఎన్నో ఉద్యమాలు నడిచాయి. ప్రజలను శాంతియుత సహజీవనం వైపు, భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు కృషి జరిగింది. దేశం కులమతాల ప్రాతిపదికలేని లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థగా రూపొందించటంలో, సోషలిస్టు సమాజ నిర్మాణ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఎన్ని అవాంతరాలెదురైనా ఆ సవాళ్లను అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నం జరిగింది. ఈ 80 ఏళ్ల కాలం ప్రతి ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించటం, దేశ ప్రధానమంత్రి జాతి ప్రజలనుద్దేశించి ఎర్రకోట బురుజుపై ప్రసంగించటం జరగుతుంది. ప్రధాని ప్రసంగంలో సాధించిన విజయాలను చెప్పి భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉంటారు. కానీ పుష్కర కాలంగా దేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రధానిగా ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తన వాగాడంబర ఉపన్యాసాలతో ప్రజలను మోసగిస్తున్నారు లేని గొప్పలు ప్రచారం చేస్తున్నారు. 12 ఏళ్ల పాలనలో “ఇంట్టో ఈగల్ మోత బయట పల్లకీ మోత” అన్నట్లుగా దేశం పరిస్థితి ఉంది.
ఐనా ప్రధాని ఆగస్టు 15న అద్దెకు తీసుకున్న ఎర్రకోట బురుజు పైనుండి దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గత 12ఏళ్లుగా ఒక సంకల్పం, లక్ష్యం కోసం తన ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఆ సంకల్పం ఏమిటో, లక్ష్యం ఏమిటో అది ఎంతవరకు సాధించారో చెప్పలేదు. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తాం అని చెప్పారు. పెద్ద కలలు ఉంటేనే సంకల్పం ఉంటుందని మోదీ శెలవిచ్చారు. కానీ ఆచరణలో కలలు కల్లలుగా మిగిలిపోతున్నాయి. వర దల్లో నష్టపోయిన వారికి అండగా ఉంటాం అని చెప్పారు. కాని దశాబ్దకాలంలో అనేక రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, ఏపీ వంటి బీజేపీయేతర రాష్ట్రాలలో ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించిన సందర్భాలలో కేంద్రం సాయ మందించకపోవటం తెలిసిన విషయమే. ఏపీలో ‘హుద్ హుద్’ వంటి తుఫాను వలన భారీ నష్టం జరిగినా కేంద్రం స్పందించలేదు. 12 ఏళ్ల కాలంలో మోదీ ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసాలు దేశం ప్రాథమిక అవసరాల కల్పన నుంచి, స్వయం సమృద్ధి, వికసిత్ భారత్2047 లక్ష్యాల వైపు దేశ ప్రయాణం గురించి ప్రస్తావిస్తున్నారు తప్ప వేసిన ముందడుగేమిటో చెప్పటం లేదు. మోదీ ప్రసంగాలు వినసొంపుగా ఉంటున్నాయి తప్ప కలిగే ప్రయోజనాలు నామమాత్రమే. 2014లో పేదరిక నిర్మూలన, మరుగుదొడ్ల నిర్మాణం, మహిళల గౌరవం గూర్చిన వాగ్దా నాలు నిరరÝకంగా మిగిలాయి. గ్రామీణ రోడ్లు, డిజిటలైజేషన్, అంతరిక్ష ఉప గ్రహాల ప్రయోగంలో కొంత పురోగతి ఉన్నా మహిళా సాధికారత, యువశక్తి వినియోగంలో స్పష్టత కొరవడింది. మహిళల భద్రత ప్రశ్నార్థకంగా ఉంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కొర్రీలతో అమలుకు రావటంలేదు. రక్షణ రంగంలో ప్రైవేటీకరణ వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడింది. భారత సైన్యంలో చేరటానికి తెచ్చిన ‘అగ్నివీర్’ లు నాలుగేళ్ల తరువాత దిక్కుతోచని పరిస్థితులతో ఇబ్బందులకు గురవుతున్నారు. “నీటిలో గాలిబుడగల్లా” వారి కుటుంబాలు అల్లాడుతున్నాయి. యువతకు ఉపాధి కల్పన ప్రసంగాలకే పరిమితంగా ఉంది. అమెరికా వీసా ఆంక్షల వల్ల యువత విదేశీ ఆకాంక్షలకు విఘాతం ఏర్పడింది. దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీనితో అసంతృప్తి చెందిన యువత జెన్జీ, కాక్రోచ్ ఉద్యమాలలో పాల్గొంటూ తమ ఆగ్రహాన్ని రోడ్లపై ప్రదర్శిస్తున్నారు. ఐనా 2047 నాటికి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ వెలిగిపోతుందని ప్రధాని ప్రచారం చేస్తున్నారు. మరోపక్క అంత ర్జాతీయంగా మన రూపాయి విలువ దిగజారిపోతోంది. మన దేశ ఎగుమతులపై ట్రంపు విచక్షణారహితంగా సుంకాలు విధించినా మనం స్పందించలేకున్నాం. అంతర్జాతీయంగా మనకు అవసరమైన చమురు, గ్యాస్ దిగుమతులపై ఆంక్షలు విధించినా నోరు మెదపని ప్రధానమంత్రి దేశస్వావలంబనపై పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇవ్వటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వికసిత భారత్, విజన్2024 అంటూ ప్రజలను మభ్యపెడుతున్న ప్రధాని ప్రజల మౌలిక అవసరాలను గురించి గాని, దారిద్య్ర నిర్మూలనా చర్యల గురించి గాని, నిరుద్యోగ సమస్యపైగాని, దొంగ నిల్వల వెలికితీతపై గాని, బ్లాక్మనీ నియంత్రణ గూర్చిగాని, ప్రజల నడ్డి విరుస్తున్న పన్నుల భారం గూర్చిగాని, దేశ పారిశ్రామికీకరణ గూర్చిగాని వాస్తవాలను ప్రజలకు చెప్పరు. కానీ 12 ఏళ్ల తమ వృద్ధి గాధను అభూత కల్పనలతో ఏకరువు పెడతారు. దేశ ప్రగతికి 140 కోట్ల ప్రజల సంకల్పం, సామర్థ్యాలే చోదక శక్తిగా మాట్లాడే ప్రధాని రైతుల గిట్టుబాటు ధర గురించి, రైతుల ఆదాయం రెట్టింపు గురించి, దేశం ఎదుర్కొంటున్న ఎరువుల కొరత, నీటికొరత గురించి ప్రస్థావించటంలేదు. 12 ఏళ్ల వృద్ధిని గూర్చి ఏకరువుపెట్టే మోదీ మొబైల్ఫోన్లు, డిజిటల్ చెల్లింపుల గూర్చి మాట్లాడుతున్నారు తప్ప పేదల గృహ వసతి, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం పంపిణీ వంటి వాగ్దానాల గూర్చి మాట్లాడరు. 25 కోట్ల మంది ప్రజలను దారిద్య్రరేఖ దిగువ నుండి బయటకు తెచ్చామని చెబుతూ ఇంకా ఎందుకు 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నారో చెప్పటం లేదు. ఇక మోదీ వికసిత భారత్ నినాదం ఎంత హాస్యాస్పదంగా ఉందో కొన్ని నిర్మాణాలు పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఈ సంవత్సరం ఏప్రియల్ 2న 37వేల కోట్లతో నిర్మించిన “గంగా ఎక్స్‌ప్రెస్ మార్గం” ఆరు మాసాలకే ధ్వంసమై అనేకచోట్ల భూమిలోకి కుంగిపోయింది. కాల్వలు, డ్రైనేజీలు కూలిపోయాయి. ఇంకా నూతనంగా నిర్మించిన అనేక హైవేలు, జాతీయ రహదారులు ప్రారంభానికి నోచుకోకుండా రెండు మూడు నెలలకే ధ్వంసం అవుతున్నాయి. ప్రారంభం కాకుండానే చాలా వంతెనలు కూలి పోతున్నాయి. ఈ విషయంలో బీహార్ అగ్రస్థానంలో కన్పిస్తోంది. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. గంగానదిపై నిర్మించిన బ్రిడ్జిలు, గుజరాత్‌లో వంతెనలు కూలి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఐనా ప్రధాని మౌలిక వసతుల రంగంలో గొప్ప మార్పులు తెస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలలో శెలవిస్తు న్నారు. అంతేకాదు యువతను ఆశల శిఖరాలు ఎక్కించే ప్రయత్నం మోదీ చేశారు. 70 ఏళ్లలో సాధించలేనిది ఏడేళ్లలో సాధిస్తామని చెబుతున్నారు. దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్తామని, యువశక్తిని దేశ నిర్మాణం కోసం వినియోగిస్తామని చెబుతున్నారు. జెన్జీ, కాక్రోచ్ ఉద్యమాలు మోదీని ఎంతగా భయపెట్టాయో దీన్నిబట్టి అర్థం అవుతుంది. మోదీవి “శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు” అని భారత్ యువత గ్రహించే నేడు పోరాటపంధాను అనుసరించింది. దిల్లీ జంతర్ మంతర్ అందుకు వేదికగా మారింది. ప్రజలను మరోసారి మోసం చేయాలనే సంకల్పంతోనే మోదీ ఇప్పుడు ‘సప్తధార’ సూత్రాలను తెరపైకి తెస్తున్నారు. తయారీ రంగం గ్రోత్ ఇంజన్ అని మాట్లాడుతున్నారు. రైతులకు స్వేచ్ఛా మార్కెట్ ఒప్పందాలు మేలు చేస్తాయంటున్నారు. మన ఉత్పత్తులను అంతర్జాతీయ బ్రాండ్‌లుగా మారుస్తామంటున్నారు. భారత్ను టెక్నాలజీ హబ్‌గా మారుస్తామని, మేడిన్ ఇండియా సిక్స్‌జి దేశమంతా రావాలని చెబుతున్నారు కానీ మన బీఎస్‌ఎన్‌ఎల్ 4జీని దాటటం లేదు. గతిశక్తి పేరుతో దేశమంతా వేగవంతమైన కనెక్టివిటీ పెంపొందిస్తామంటున్నారు. కానీ మన ఎక్స్‌ప్రెస్‌వేలు, వంతెనలు, బ్రిడ్జిలు ఏ గతిశక్తికి నిదర్శనాలో ఆలోచించాలి. రక్షశక్తి పేరుతో దేశీయ రక్షణ రంగ పరిశ్రమలను ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేస్తూ దేశ భద్రతకు తిలోదకాలు ఇస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో పరిశోధనకు ప్రాధాన్యం అంటూనే పర్యావరణం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. యోగా, చేతివృత్తుల ద్వారా స్టార్ పవర్‌ను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఆకలి సూచీలో భారత్ స్థానం ఏమిటో చెప్పలేని ప్రధానమంత్రి వివిధ రంగాలలో ప్రగతి శిఖరాలకు చేరుకున్నామని, తమను ఎవరూ అడ్డుకోలేరని గొప్పలు పోతున్నారు. దేశంలో సామాన్య పౌరుల జీవితాలు మెరుగుపడే విధంగా జీవన ప్రమాణాలు మారాయని చెబుతూన్న ప్రధాని దేశంలో ఆర్థిక అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయో, అదానీ, అంబానీ ఆస్తులు పెరిగినట్లు మిగతా ప్రజల ప్రమాణాలు ఎందుకు పెరగటం లేదో చెప్పలేకపోతున్నారు. ఆర్థిక అసమానతలను, పాలకుల అవినీతిని, రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రశ్నించిన వారిని ఇప్పటివరకు “అర్బన్ నకస్లైట్లు” గా ముద్రవేసిన ప్రధాని స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో “దిమాగీ నకస్లైట్లు” అనే కొత్త ప్రయోగాన్ని చేశారు. ఈ దేశంలో మొదటి నుండి దేశ ఐక్యతకు, సార్వభౌమత్వ పరిరక్షణకు, లౌకికవాదానికి మద్ధతు ఇస్తున్న వామపక్ష, ప్రజాస్వామిక శక్తులను, ప్రశ్నించే మేధావులను సాయుధ నకస్లైట్ల వలే అణచివేసే కుట్రలో భాగంగా “దిమాగీ నకస్లైట్లు” అనే ముద్రవేయమన్నారు. హింస, అశాంతి పేరుతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో భాగమే ఇది. 2047 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా చెప్పకునే ప్రధాని విద్వేష ప్రసంగాలతో, కార్యాచరణతో విజయాలను సాధించుకోగలం అనుకోవటం పగటి కల మాత్రమే అవుతుంది.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, సెల్ : 9490952093

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు