Tuesday, July 15, 2025
Homeఆగస్టులో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు

ఆగస్టులో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు

పేదలకు ఇళ్ల స్థలాలపై మంత్రులతో సబ్‌ కమిటీ
అభ్యంతరం లేని నివాస స్థలాలకు డిసెంబర్‌లోగా రెగ్యులరైజేషన్‌
2027 డిసెంబర్‌ నాటికి రీ సర్వే 2.0 పూర్తి
దృశ్యరూపంలో భూ వివరాలకు ప్రత్యేక పోర్టల్‌
మంత్రి పర్యటనలకు సంబంధిత శాఖాధికారులకే బాధ్యతలు
రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సర్వే పూర్తయిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు నుంచి అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే ముద్రణ పూర్తియిన 21.86 లక్షల మంది పాస్‌పుస్తకాలను క్యూఆర్‌ కోడ్‌, ఆధార్‌ కార్డు ఆధారంగా పట్టాదారుకు అందజేయాలని సూచించారు. ప్రతి భూ యజమాని తమ భూమి వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఆధార్‌ కార్డుతో అనుసంధానం ద్వారా భూములను గుర్తించే సౌకర్యం ఉండాలన్నారు. ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. రెండు గంటల పాటు భూ సమస్యలు, ప్రజల అర్జీలు, సేవలు సులభతరం చేసే చర్యలతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు సాంత్వన చేకూర్చాలన్నారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం గ్రాంట్స్‌ కింద ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ‘ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉండటంతో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంలో న్యాయ సలహాలు తీసుకోండి. రాష్ట్రంలో ఇల్లు, ఇంటి స్థలం లేని వాళ్లు ఉండకూడదు. రెండేళ్లలో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి. మరో రెండేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. అంటే వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఒక్కరి సొంతింటి కల సాకారం కావాలి’ అని చంద్రబాబు అన్నారు. ఇళ్ల స్థలాల కోసం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 99,390 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనికోసం 2,051 ఎకరాలు అవసరం. ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్లు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్ల కోసం భూ సేకరణ సేకరణ చేసి ఇద్దాం. అర్బ న్‌లో టిడ్కో ఇళ్లు ఇస్తాం’ అని సీఎం చెప్పారు. దీనిపై రెవెన్యూ, హౌసింగ్‌, మునిసిపల్‌ మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ అక్రమాలకు వేదికగా చేసుకున్న భూముల ఫ్రీ హోల్డ్‌ అంశానికి పరిష్కారం చూపాలని, అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సర్వే రాళ్లపై బొమ్మల తొలగింపు పూర్తి
గత ప్రభుత్వంలో 77.9 లక్షల సర్వే రాళ్లపై జగన్‌ పేర్లు, బొమ్మల తొలగింపు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలు, విధానాలను అనుసరించి, అన్ని ఉత్తర్వులతో కలిపి కొత్త రెవెన్యూ మాన్యువల్‌ ఆగస్టు నాటికి తేవాలని సీఎం సూచించారు. ప్రజలు అనధికారికంగా ఉంటున్న అభ్యంతరం లేని స్థలాలను డిసెంబర్‌ లోపు క్రమబద్ధీకరించాలన్నారు. వారసత్వ భూముల విషయంలో రూ.100 చెల్లించి సక్సెషన్‌ చేసుకోవచ్చు. రూ.10 లక్షల విలువైన భూమికి రూ.100, అంతకంటే ఎక్కువ విలువైన భూమికి రూ. 1000 చెల్లించి సక్సెషన్‌ చేసుకోవచ్చునని తెలిపారు. ఆర్థిక సమస్య రాకుండా 2027 డిసెంబర్‌ నాటికి ప్రతి గ్రామంలో రీసర్వే 2.0 నూరు శాతం పూర్తి కావాలని ఆదేశించారు.
రెవెన్యూ ఉద్యోగులకు ప్రోటోకాల్‌ డ్యూటీల నుంచి మినహాయింపు
పని ఒత్తిడి కారణంగా సేవల విషయంలో పూర్తి స్థాయి ఫలితాలు రావడంలేదని సీఎంతో అధికారులు అన్నారు. జిల్లాలకు, ఏ మంత్రి వచ్చినా, మరే అధికారి వచ్చినా ప్రోటోకాల్‌ విధులను తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు చూస్తున్నారన్నారు. దీంతో అసలు పని మరుగున పడుతుందని చెప్పారు. రెవెన్యూ అధికారులకు ఇకపై ప్రోటోకాల్‌ విధుల నుంచి మినహాయింపు ఇస్తామని సీఎం వెల్లడిరచారు. జిల్లాల్లో కూడా జీఏడీ తరపున ప్రోటోకాల్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం జిల్లా స్థాయిలో అవసరమైన విధంగా ప్రోటోకాల్‌ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు సంబంధిత శాఖ అధికారులు బాధ్యత తీసుకుంటే సరిపోతుందని సీిఎం అన్నారు. రెవెన్యూ శాఖ కొత్త పోర్టల్‌ గురించి అధికారులు సీిఎంకు వివరించారు. రాష్ట్ర పరిధిలో ఏ రకమైన భూమి అయినా పోర్టల్‌ ద్వారా చూడవచ్చు. పోర్టల్‌లో సదరు భూమిని గుర్తించి, యజమాని నుంచి హద్దులతో సహా వివరాలు తెలుసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఉన్న అడవులు, ప్రభుత్వ భూములు, రోడ్లు, నీటి ప్రాంతాలు, చెరువులు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న స్థలాల గురించీ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఈ పోర్టల్‌ ఉపయుక్తంగా ఉంటుంది అని అధికారులు వివరించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పోర్టల్‌ను సమగ్రంగా తీసుకురావాలని సీఎం వారికి సూచించారు. సమీక్షలో మంత్రి అనగాని సత్య ప్రసాద్‌, సీసీిఎల్‌ జి.జయలక్ష్మితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు