. రాజధానిలో భూములివ్వని రైతులపై సర్కార్ అస్త్రం
. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం
. అమరావతి పనుల వేగవంతానికి ఎస్‌పీవీ
. కారవాన్ పర్యాటకానికి… అమృత్ 2.0కి ఆమోదం
. కుష్టు వ్యాధి పదం తొలగింపునకు చట్టసవరణ
. విద్యుత్ శాఖ చట్టాల్లో కొన్ని సవరణలు
. రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద ముందుకు రాని రైతుల భూములను ఇకపై భూసేకరణ కింద తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశంలో వివిధ కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని నిర్మాణపనులకు కొందరు రైతులు భూములు ఇవ్వకపోవడం వల్ల సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు కొన్ని కీలక నిర్మాణాలకు ఆటంకం కలుగుతోందని మంత్రివర్గం భావించింది. భూసేకరణ కంటే భూ సమీకరణ వల్ల మేలు జరుగుతుందని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. అయినప్పటికీ వారు ఆసక్తి చూపకపోవడంతో భూసేకరణ చట్టం 2013 ద్వారా తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు పథకం ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు, కారవాన్ పర్యాటకానికి, అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి రాజధానిలో నిర్మాణ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు, కుష్ఠు వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖకు సంబంధించి వివిధ ప్రతిపాదనలకు, కార్మిక చట్టాల్లో సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 23 అంశాలపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు
. నీటి వినియోగదారుల సంఘాల్లో యాజమాన్య కమిటీ సభ్యునిగా ఎంపికకు ఇద్దరు పిల్లల నిబంధన తొలగించారు. ఈ సవరణ ద్వారా ఏపీ ఎఫ్‌ఎంఐఎస్ చట్టం, 1997 సెక్షన్ 14లోని సబ్ సెక్షన్ 5 తొలగించబడుతుంది.
. ఎన్‌హెచ్‌ఎస్‌ఎస్ దశ`1లో రాకెట్ల గ్రామం సమీపంలో అమిద్యాల లిఫ్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు రూ.72.30 కోట్ల విలువైన రెండు పనులకు పరిపాలనా ఆమోదాన్ని ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
. ప్రకాశం బ్యారేజీ, దివిసీమ ప్రాంతం రెండిరటి కీలకమైన భద్రత, నిర్మాణ సమగ్రత కోసం రూ.449.92 లక్షల విలువైన పనులకు ఆమోదం
. రూ.3,19,48,000 అంచనా వ్యయంతో ‘వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని మైలవరం ఆనకట్ట మరమ్మతు పనులకు ఆమోదం, ఇవిగాక జలవనరుల శాఖలో వివిధ మరమ్మతులకు అవసరమైన నిధుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం లభించింది.
. రాష్ట్రంలో కారవాన్ టూరిజం ప్రోత్సహించే పాలసీలో మార్పు ప్రతిపాదనకు ఆమోదం. దీనివల్ల కారవాన్ పెట్టే వారికి లైఫ్ టాక్సు రిబేటు, పార్కులు ఏర్పాటు చేసే వారికి స్టాంప్ డ్యూటీలు, ప్రోత్సాహకాలు అందజేయబడతాయి.
. రాష్ట్రంలోహోమ్‌స్టేలు/బెడ్, బ్రేక్‌ఫాస్ట్ అభివృద్ధిని ప్రోత్సహించే ప్రతిపాదనలకు ఆమోదం. దేవాలయాల ప్రాంతాల్లో పెద్ద హోటళ్లు ఉండవు ఆరు రూముల వరకు ఈ హోమ్ స్టేలకు అనుమతి ఇస్తారు.
. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీకి 16.19 ఎకరాలు, గుంటూరు జిల్లా వెటర్నరీ ఆఫీసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు 10 ఎకరాలు, గుంటూరు లామ్‌లోని రీజినల్ పౌల్ట్రీ ఫామ్‌లో 26.19 ఎకరాల కేటాయింపు
. హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్ట సవరణ చేస్తూ కుష్టు వ్యాధితో బాధపడుతున్నారనే పదాల తొలగింపుకు ఆమోదం.
. విజయవాడలోని ఏపీ ట్రాన్స్‌కో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అభ్యర్థన మేరకు జీవో 36, జీవో 20లోని కొన్ని నిబంధనలను సవరించడానికి ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
. ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ వీసీ ప్రతిపాదించిన విధంగా ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ప్రకారం గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పన్నాల ప్రమోషన్ కోసం సలహా కమిటీని ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం నిర్ణయించింది.
. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీల నిషేధం) చట్టం, 1977 (1977 చట్టం ఎన్) లోని సెక్షన్ 2 లోని క్లాజ్ (6), సెక్షన్ 3 లోని సబ్-సెక్షన్ (2), (2ఏ)ల సవరణలకు సంబంధించి ‘ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ (నిషేధ బదిలీలు) బిల్లు, 2025’ను సవరించే ముసాయిదా బిల్లు ఆమోదం కోసం రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు ప్రఖర్ జైన్ పాల్గొన్నారు.


