Homeసంపాదకీయంఈ ఉద్యమం ఆగేదికాదు!

ఈ ఉద్యమం ఆగేదికాదు!

- Advertisement -

భారతీయ విద్యా వ్యవస్థను, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ‘ప్రశ్నాపత్రాల లీకేజీల’ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. నీట్ సహా పలు రిక్రూట్మెంట్ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలు, లీకేజీలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందడం, ముఖ్యంగా జెన్ జెడ్ యువత పెద్దఎత్తున తరలిరావడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. సీజేపీకి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి, యువజన సంఘాలు సైతం సంఘీభావం ప్రకటించి, రాష్ట్రాల్లో ఆందోళనలకు నాయకత్వం వహించడంతో పోరాటంలో సమష్టితత్వం గోచరించింది. రైతు మోద్యమం తర్వాత మెజారిటీ పక్షాలు ఏకతాటి పైకి రావడం ఇదే మొదటిసారి. లీకేజీలపై సీజేపీ ఆందోళనలో భాగంగా ప్రముఖ సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష, అనంతరం దానికి లభించిన ప్రజా మద్దతు ఫలితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటన చేయాల్సి రావడం, లీక్‌లకు చెక్ పెట్టేందుకు కొత్త చట్టాలు, మార్గదర్శకాలను తీసుకువస్తామని ప్రకటించడం ఈ పోరాట ఫలితమే. ఎట్టకేలకు కేంద్ర మంత్రివర్గం లీకేజీ వ్యవస్థపై ఒక నిర్ణయానికి రావడం ముదావహం. కఠినతరమైన ‘యాంటీ పేపర్ లీక్ బిల్లు’కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
లీక్‌లకు పాల్పడిన వారికి కఠిన శిక్షలను ప్రతిపాదించింది. గరిష్ఠంగా పదేళ్ల జైలు, 10 కోట్ల రూపాయల అపరాధ రుసుము విధించాలని బిల్లులో ఖరారు చేశారు. పోటీ పరీక్షల సమగ్రత పరిరక్షణకు ఈ మాత్రం చర్యలు అవసరమే. అయితే ఈ లీకేజీకి బాధ్యత వహించాల్సిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రధాని మోదీ ఎందుకు స్పందించ లేకపోయారు? శుక్రవారం మంత్రులతో సీజేపీ నేతలకు జరిగిన చర్చల్లో రెండు అంశాలకు మంత్రుల బృందం అంగీకరించినా, ధర్మేంద్ర రాజీనామాపై ఒక రోజు గడువు అడగడం హాస్యాస్పదం. కాకపోతే, మంత్రి రాజీనామాయే తమ ప్రధాన అజెండా అని తేల్చి చెప్పిన సీజేపీని అభినందించకుండా ఉండలేం. మంత్రి రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదన్న వారి పట్టుదలకు శెల్యూట్ చెప్పాల్సిందే. ఎందుకంటే, ఇప్పుడు ఉద్యమం నేతల చేతుల్లో లేదు. అది పూర్తిగా యువత చేతుల్లోకి వెళ్లిపోయింది. దీక్ష విరమించిన వాంగ్‌చుక్ విశ్రాంతి తీసుకోవచ్చు. ఉద్యమం సీజేపీని, వాంగ్‌చుక్‌ను దాటి జెన్ జెడ్ హస్తగతమైంది. మంత్రి రాజీనామా చేయకపోతే, అది ఏ దశకైనా చేరవచ్చు. యువత ఆగ్రహం రాజకీయ, సామాజిక మార్పులకు నాంది పలకాల్సిందే. అయితే, కేవలం ప్రకటనలు, నూతన మార్గదర్శకాలు లీకేజీల రక్కసిని అరికట్టగలవా? నిజానికి, భారతదేశంలో చట్టాలు మారినంత మాత్రాన వ్యవస్థ మారుతుందని చెప్పలేం. కాకపోతే, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడానికి కఠినమైన చట్టాలు, నూతన మార్గదర్శకాలు తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత. చట్టాల తయారీ ఒకెత్తయితే, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలుచేయడం మరొక ఎత్తు. ఇప్పటివరకు ఉన్న సాంకేతికత, భద్రతా వ్యవస్థలను దాటుకుని లీకేజీలు జరుగుతున్నాయంటే, దానికి కారణం కేవలం చట్టాల లోపం మాత్రమే కాదు.. వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి, పారదర్శకతలేమి. పరీక్షల నిర్వహణ సంస్థల్లో అంతర్గత నిఘా పెంచడం, డిజిటల్ భద్రతా ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం, ఎన్‌క్రిప్టెడ్ ప్రశ్నాపత్రాల విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి సాంకేతిక మార్పులు అత్యవసరం. కేవలం ఆంక్షలతోనే లీకేజీలను ఆపడం సాధ్యం కాదు. ప్రశ్నాపత్రం తయారీ నుండి అభ్యర్థి చేతికి అందే వరకు ప్రతి దశలోనూ జవాబుదారీతనం ఉండాలి. తప్ప చేసిన వారికి తక్షణమే కఠిన శిక్షలు పడేలా వేగవంతమైన న్యాయ విచారణ జరిగితేనే కొత్త మార్గదర్శకాలకు సార్థకత చేకూరుతుంది.
నీట్ లీకేజీలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో యువత, ముఖ్యంగా జెన్ జెడ్ క్రియాశీలక పాత్ర పోషించింది. సుదీర్ఘకాలంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎదురవుతున్న అన్యాయాలు, నిరుద్యోగం, పారదర్శకత లేని పరీక్షల నిర్వహణపై యువతలో పేరుకుపోయిన అసంతృప్తి ఈ నిరసనల ద్వారా బద్దలై, బయటకు వచ్చింది. వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు, సీజేపీ పిలుపునకు లభించిన ప్రజా మద్దతు, యువత వీధుల్లోకి రావడం ఊరికే జరగలేదు. దానికి ప్రతిపక్షాలు, వాటి ప్రజా సంఘాల నుంచి విపరీతమైన మద్దతు ఉంది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారంనాడు అన్ని రాష్ట్రాల్లో యువత నిరసనకు దిగారు. ఏఐ‌ఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్తోపాటు ఇతర విద్యార్థి, యువజన సంఘాలు పెద్దఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని, పోరాటస్ఫూర్తిని చాటారు. వీటిని అణచివేయడానికి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న దశలో పోలీసులు పౌరదుస్తుల్లో నిరసనకారుల్లోకి చొరబడి, యువతను తీవ్రంగా గాయపరిచిన దృశ్యాలు విజయవాడలో కన్పించాయి. అయినా యువత ఆగలేదు. ఇదొక గొప్ప మార్పు. భారతదేశంలో మెజారిటీ జనాభా యువతే. తమ భవిష్యత్తును దెబ్బతీసే అంశాలపై వారు చూపిస్తున్న ఈ ఐక్యత, రానున్న రోజుల్లో దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. సాంప్రదాయ రాజకీయ సమీకరణాలను పక్కనపెట్టి, ప్రజా సమస్యలు, యువత భవిష్యత్తే అజెండాగా సాగే ఉద్యమాలకు ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. కఠినతరమైన యాంటీ లీకేజీ చట్టం ఏనాడో రావాల్సింది. ఇప్పటికే జాప్యం జరిగింది. ఆలస్యం ఆమోదయోగ్యం కాదు: దేశ భవిష్యత్తుకే ప్రమాదం. ఇంత జరిగినా ఈ చట్టం ఏదో ఉద్దరిస్తుందని ఆశించలేం. ప్రత్యేక సందర్భాల్లో తీసుకువచ్చిన చట్టాలు, ఫాస్ట్ట్రాక్ కోర్టులు విఫలమైన తీరు సర్వవిదితం. విద్యా రంగానికి, యువజన సంక్షేమానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు తాత్సారం చేయడం అంటే దేశ పునాదులను బలహీనపరచడమే.
రాత్రింబవళ్లు కష్టపడి చదివే విద్యార్థులకు లీకేజీల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోంది. డబ్బున్న వారు లేదా అక్రమార్కులు అవకాశాలను దక్కించుకుంటే, నిజమైన ప్రతిభావంతులు నిరాశ నిస్పృహల్లోకి జారుకుంటున్నారు. వ్యవస్థపై నమ్మకం సడలిన నాడు విప్లవం రాకమానదు. అచ్చంగా అదే ఇప్పుడు కన్పిస్తోంది. విద్యా, ఉద్యోగ నియామకాలపై యువతకు నమ్మకం పోతే, అది దేశంలో మేధోవలసకు దారితీస్తుంది. ఆర్థిక, సామాజిక నష్టం అనివార్యం. దేశ జనాభాలో లభిస్తున్న ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ (యువ జనాభా ఆధిక్యత)ను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైతే, అది దేశాభివృద్ధికి పెద్ద ప్రతిబంధకంగా మారుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, జెన్ జెడ్ తిరుగుబాటు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యువత ఇకపై అన్యాయాలను మౌనంగా భరించే స్థితిలో లేదు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక బిల్లును లేదా కొత్త మార్గదర్శకాలను ప్రకటించడంతో తన బాధ్యత పూర్తయిందని భావించకూడదు. పరీక్షల నిర్వహణలో సమూల ప్రక్షాళన జరగాలి. నేరస్థులకు కఠిన శిక్షలు పడాలి. ప్రభుత్వం, విద్యావేత్తలు, యువజన ప్రతినిధులు కలసికట్టుగా చర్చించి, లీకేజీలు లేని, పారదర్శకమైన విద్యా వ్యవస్థను నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. యువత భవిష్యత్తు సురక్షితంగా ఉన్నప్పుడే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు