. 15న కార్యాచరణ రూపకల్పన
. 30న ప్రజా సంఘాల సదస్సు
. రౌండు టేబుల్ సమావేశంలో వక్తలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి వామపక్ష, రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాలు సమాయత్తమయ్యాయి. ఈ నెల 15న ఉద్యమ కార్యాచరణ రూపొందించడం, కార్మిక, ప్రజాసంఘాలతో కలిసి 30న విజయవాడలో సదస్సు నిర్వహణకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీల నాయకుల, మేధావుల సలహాలు, సూచనలు తీసుకుని 15న కార్యాచరణ వెల్లడిరచాలని నిర్ణయించింది. విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవన్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో శుక్రవారం సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, శాసనమండలిలో వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమొక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు సురేశ్, మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, వైసీపీ రాష్ట్ర నాయకులు పి.గౌతమ్ రెడ్డి, వైసీపీ గాజువాక నియోజకవర్గ ఇంఛార్జ్ తిప్పల దేవన్, కాంగ్రెస్ నాయకులు, అనేకమంది ఉక్కు పోరాట కమిటీ నాయకులు హాజరయ్యారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వేగంగా ప్రైవేటీకరించడానికి చేపట్టిన చర్యలను వివరించారు. కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు, పి.ప్రసాద్, సురేశ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు నుంచి రక్షించుకోవడానికి ప్రాణ త్యాగాలకైనా వెనుకాడకుండా పోరాడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి వామపక్షాలన్నీ కృషి చేస్తాయని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలన్నింటిలో వామపక్షాలు అగ్రభాగాన ఉన్నాయన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పనులన్నీ 34 విభాగాలుగా చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కాంట్రాక్టర్లకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉక్కు కర్మాగార కార్మికులను నిందించడం, స్టీల్ కార్మికుల పోరాటాన్ని బలహీనం చేయాలని తప్పుడు ప్రకటనలు చేయడాన్ని నాయకులు తీవ్రంగా విమర్శించారు. 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి నియమించాలని సమావేశం డిమాండ్ చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కూల్చి అక్కడ మొక్కలు నాటడంపై తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ఉక్కు ఉద్యమాన్ని నిర్బంధం ద్వారా అణచివేయాలని ప్రయత్నిస్తే కూటమి పెద్దలు చరిత్రహీనులుగా మిగులుతారని హెచ్చరించారు. షర్మిల ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారం రక్షణ కోసం అప్పటి సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌కు జులై 23, 2021న లేఖ రాశారని గుర్తు చేశారు. అదే బాధ్యతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటానికి మద్దతు తెలియజేస్తోందన్నారు. బొత్స సత్యనారాయణ ప్రసంగిస్తూ సొంత గనులు కేటాయింపు కోసం, రాష్ట్రంలో గనులు ఇటీవల ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడాన్ని ఈ నెల 18 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తుతామని తెలిపారు. ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘విశాఖ ఉక్కు శంఖారావం’ పూరించడానికి అన్ని కార్మిక, ప్రజాసంఘాల అధ్వర్యంలో ఈ నెల 30న విజయవాడలో సదస్సు నిర్వహించాలన్న తీర్మానాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ప్రతిపాదించగా, సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, మహిళా, రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు తదితర సంఘాలను ఆహ్వానించాలని నిర్ణయించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో మహా ధర్నా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ సదస్సులను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో జరపాలని, ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర, కోటి సంతకాల సేకరణ, రాష్ట్ర ప్రజలను వివిధ రూపాల్లో పోరాటాలకు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రజలను రౌండ్ టేబుల్ సమావేశం కోరింది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా పయనిస్తే రాష్ట్ర వ్యాప్త బంద్‌కు సిద్ధం కావాలని సమావేశం తెలిపింది.


