Homeఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

- Advertisement -

రాజ్యసభ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు

న్యూదిల్లీ: చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్‌ శుక్రవారం భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత ఆయన పార్లమెంటు లోని తన కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… రాధాకృష్ణన్‌ (67)తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక మంది కేంద్రమంత్రులు, గవర్నర్లు, ఎన్‌డీయే ముఖ్యమంత్రుల, ప్రముఖులు హాజరయ్యారు. ఎర్ర కుర్తా ధరించిన రాధాకృష్ణన్‌…దేవుని సాక్షిగా ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తదితరులు రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపారు. కాగా, ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్‌ ధన్కర్‌ సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పక్కన ముందు వరుసలో కూర్చున్నారు, ఆయనతో మాట్లాడుతున్నట్లు కనిపించారు. మరో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ కూడా నాయుడు పక్కన కూర్చున్నారు. మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముందు వరుసలో ఆశీనులయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి కూడా హాజరయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖడ్గే, మరికొందరు ప్రతిపక్ష నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై రాధాకృష్ణన్‌తో కరచాలనం చేశారు. ఖడ్గే రెండవ వరుసలో కూర్చున్నారు. వాస్తవానికి ధన్కర్‌ పదవీకాలం ఆగస్టు 10, 2027 వరకు ఉంది. రాజ్యాంగం ప్రకారం మరణం లేదా రాజీనామా కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి పదవిలోకి ప్రవేశించే ప్రస్తుత ఉపరాష్ట్రపతికి పూర్తి ఐదేళ్ల పదవీకాలం లభిస్తుంది. రాధాకృష్ణన్‌ సెప్టెంబర్‌ 11, 2030 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాధా కృష్ణన్‌ రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిం చారు. అనంతరం సదైవ్‌ అటల్‌ వద్ద మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పేయికి, సాన్‌ ఘాట్‌ వద్ద మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌కు నివాళులర్పించారు. తిరిగి పార్లమెంటు భవనంలోకి వచ్చిన ఆయన రాజ్యసభ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాధాకృష్ణన్‌ పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని ప్రేరణ స్థల్‌ వద్ద ఉన్న ప్రముఖ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, సామాజిక సంస్కర్తల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అక్కడ ఆయనకు రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌ హరివంశ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌, ఎల్‌.మురుగన్‌ స్వాగతం పలికారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ సీపీ మోదీ కూడా హాజరయ్యారు. రాధాకృష్ణన్‌ సెప్టెంబర్‌ 12న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు