Sunday, December 7, 2025
Homeవిశ్లేషణఉగ్రవాదం అరికట్టాలంటే…

ఉగ్రవాదం అరికట్టాలంటే…

- Advertisement -

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

ఆధునిక సమాజం అభ్యుదయ భావాలతో అభివృద్ధి కాముకంగా ముందుకు మూడడుగులు వేసేటప్పటికి, ఆధునికత, నీతి, నిజాయితీకి, నిబద్దతకు నిరాడంబర నైజానికి తిలోదకాలిస్తూ, విధ్వంసక చర్యలకు వంతపాడుతూ మున్ముందుకు ఆరడుగులు వేయడానికి యత్నిస్తోంది. ఆర్థిక దోపిడీకి అలవాటుపడ్డ మేధావి వర్గాలు, సమస్త అకృత్యాలకు ఆలంబనంగా నిలుస్తూ, అడ్డదారి అక్రమాలకు తెర లేపుతూ, వ్యవస్థ బలహీనతలను తమకు అనుకూలంగా మలచుకుంటూ, కుల మతాల్లో అనైక్యతా కుంపట్లు రాజేస్తూ మనుషుల్ని మూర్ఖపు ముఠాలుగా తయారుచేస్తున్నారు. మనిషిలోని ఆత్మీయతానురాగాల్ని ఆర్థిక లావాదేవీల్తో ముడివేస్తూ, తల్లీబిడ్డల మధ్య, భర్తభార్యల మధ్య అంతరాలను సృష్టిస్తూ సమాజంలో ఈర్ష్య ద్వేషాలతో కూడిన అశాంతిని రాజేస్తున్నారు. దీనికి తోడు శాస్త్రీయ దృక్పథం లేని, సైద్ధాంతిక విలువల్లేని, అధికార దాహంతో రాజకీయాల్ని సినీ గ్లామర్‌తో జతగలిపి రాజకీయ పార్టీలను పుట్టగొడుగుల్లా పుట్టిస్తున్నారు. తాగి తూగే హావభావ ప్రకటనలతో, జనాన్ని వారి డబ్బుతో కళ్లుగప్పి రాజకీయ వేషాలు వేస్తూ ఎన్నికల్లో నెగ్గుతుంటారు. ఆదర్శాలను ఆరవోసే వాగ్దానాలతో ఏవేవో చేస్తామంటూ, ఏమీ చేయకుండానే కాలం వెళ్లబుచ్చుతుంటారు.
ఈనాడు ప్రపంచంలో అందర్నీ భయపెడుతున్న బాధిస్తున్న రాక్షస శక్తి ఉగ్రవాదం. నిజాయితీగా ఆలోచిస్తే, ఆరా తీస్తే ఉగ్రవాదానికి ‘తల్లి’ మత మౌఢ్యం. ‘తండ్రి’ అశాస్త్రీయ సైద్ధాంతికరహిత రాజకీయం.
నేడు మతం మానవహితాన్ని కోరేకంటే అహితాన్ని వాంఛిస్తోంది. వర్గాల్ని సృష్టిస్తోంది. మనుషుల్ని ఆలోచనారహితుల్ని చేస్తూ మత పెద్దల చెప్పుచేతల్లో పెట్టుకునే కుయుక్తుల్ని కుటిల నీతిని అవలంబిస్త్తోంది. మత బోధనలు, వర్గ వైషమ్యాలకు కారణమౌతూ, సామాజిక విధ్వంసాన్ని, తమ మతం కోసం తాము నమ్మిన దైవం కోసం సృష్టించే అభీష్టంగా భావించడమే మత ధర్మంగా అపోహలు కలిగిస్తుంటాయి. పగ, ద్వేషాలను విసర్జించాల్సిన మతస్థులు పర మత ద్వేషాన్ని హింసను ప్రోత్సహిస్తున్నారు. దేశభక్తి కంటే మత మౌఢ్యంలోంచే ఉగ్రవాదం ఊపందుకుంటోంది. పర మతస్థులను ఎంత గొప్పగా హింసిస్తే స్వీయ మతంలో అంత గౌరవం దక్కుతుందనే హేయ భావన, వికృత చేష్టలు వేళ్లూనుకుంటున్నాయి. అందుచేతనే మత ఉన్మాదంతో ఊగిపోతున్న కొన్ని దేశాలు పని గట్టుకొని ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తూ, ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారు. శాంతి హితంగా బతికే దేశాల్లో ఉగ్రవాదులు బాంబులై పేలుతున్నారు. అరాచక శక్తులై సామాన్య జనాన్ని హింసిస్తున్నారు. కొన్ని దేశాలు పక్క దేశాల్లో అలజడిని, అరాచకాన్ని సృష్టించేందుకు మతోన్మాదులను పెంచి పోషించి వాడుకుంటున్నారు. ఆ విధమైన మతోన్మాదమే దేవాలయాలు ప్రార్థనా మందిరాల మీద బాంబు దాడులు చేస్తోంది. ఎంతోమంది అభం శుభం తెలీని అమాయకులు హతులయ్యేందుకు కారణమౌతోంది.
మతపరమైన ఉగ్రవాదాన్ని చేరదీసి, శిక్షణిచ్చి పరాయి దేశాల మీదకు ఉసిగొల్పుతున్న మతవాద రాజకీయాలు దేశభక్తి ముసుగులో చలామణి అవుతున్నాయి. మత గ్రంథాల్లో సారాన్ని వడగట్టి చెప్పినట్లుగా మత ద్వేషాలు మత సూక్తుల్లా పుట్టుకొస్తున్నాయ్‌!
మూఢమైన మతభక్తిని దేశభక్తిగా నమ్మించే మత గురువులు పుట్టుకొస్తున్నారు. కుల మతాలు గీసుకున్న గీతల్ని వక్రీకరిస్తూ, మనుషుల మధ్య విద్వేషాలను వెదజల్లే మూఢ విశ్వాసాల్ని, మారణాయుధాల కంటే శక్తిమంతంగా నూరిపోస్తున్న మత గురువులు ఈవాళ యువతను అనూహ్యమైన ప్రలోభాలతో ఆకర్షిస్తూ, ఉగ్రవాదులుగా మార్చేస్తూ దేవుని మెప్పు కోసం ‘‘మీరీపని చేయాలంటూ’’ ఉగ్రవాద చర్యలకు పురిగొల్పుతున్నారు. అమాయకులైన యువకుల జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు. వారి భవితకు చరమగీతం పాడుతున్నారు. ఇటువంటి ఉగ్రవాదుల బాంబు దాడులే మన దేశం మీద విరుచుకుపడుతున్నాయి. అమాయక జనాన్ని బలి తీసుకుంటున్నాయి.
ఉగ్రవాదం అధికార రాజకీయం అండదండలతోనే రెచ్చిపోతుంటోంది. వారి అభీష్టాన్ని అధిగమిస్తుంటోంది. అవ్యక్తంగా అంతరిస్తుంటోంది. ఈనాడు నిజం చెప్పాలంటే, అజ్ఞానం, అశాస్త్రీయత, అమానుషం, అధికార దాహం మతాల్ని శాసిస్తున్నాయి. భక్తి ముసుగులో హింసను ప్రోత్సహిస్తున్నాయి. దైవాజ్ఞగా మత గురువులు శాసిస్తున్నారు. అమాయక జనాన్ని భక్తి ముసుగులో మత పెద్దల భక్తికి ఎరగా బలి చేస్తున్నారు. విప్లవ రాజకీయాన్ని దేశ ద్రోహంగా పరిగణించే పాలక వర్గాలు, మతాల ముసుగులో సాగించే టెర్రరిజాన్ని చూసీచూడనట్లు సర్దుకుపోవడం చవుకబారు రాజకీయానికి పాలక వర్గాలు తలవాల్చినట్లే కదా!
ఈవాళ ఉగ్రవాదం మానవ మేధస్సును వక్రీకరిస్తూ, యువతను బలి తీసుకుంటూ, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తూ, అభివృద్ధి తిరోగమనాన్ని ప్రోత్సహిస్తూ, మానవ శక్తిని రాక్షస శక్తిగా మారుస్తూ, ప్రపంచం ముందు ‘సవాల్‌’ గా నిలబడుతోంది. ఆర్థిక దోపిడీ, ఆధికార దాహమే ధ్యేయంగా బతుకుతున్న రాజకీయం ఉగ్రవాదాన్ని ఉదాసీనంగా వదిలేస్తోంది. ఉగ్రవాదం చర్యల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తున్న అధికార గణం, ఉగ్రవాదాన్ని కూకటేళ్లతో పీకి పారేసే యత్నం చేయడం లేదనే చెప్పొచ్చు. దేశాలు రెండు విధాలైన ఉగ్రవాదాల్ని ఎదుర్కొంటున్నాయి. ఒకరకం పరదేశ ఉగ్రవాదం, రెండో రకం స్వదేశ ఉగ్రవాదం. పరదేశ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నది కూడా స్వదేశ రాజకీయ హస్తాలే! స్వదేశ ఉగ్రవాదానికి కారణం పాలకుల దోపిడీ తత్వంతో కూడిన నిరంకుశ పాలనేనని చెప్పుకోవచ్చును.
పాలకుల లోపాల వలన ధనవంతుడు మహా ధనవంతునిగా పెరిగిపోవడం. పేదవాడు నానాటికి మరీ పేదరికంలోకి జారిపోవడం. కూడు గుడ్డ కరువైన పేదలు తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. పాలక వర్గాలు కేవలం వారి పాలనాధికారం తోనే దేశంలో ఉగ్రవాదాన్ని తుది ముట్టించలేదనేది కనిపిస్తున్న సత్యం. అందుచేత దేశంలో పుట్టుకొచ్చే ఉగ్రవాదాన్ని తుద ముట్టించాలంటే, పాలకులు నీతిదాయకంగా, అవినీతిని తొలుత ఎండగట్టాలి. జనంలో కుల, మత, ఆర్థిక, వివక్షలు దూరం చేయాలి. సౌభ్రాతృత్వంతో కూడిన సమ న్యాయం, ధర్మం, సమాజంలో నెలకొనాలి. ఏది ఏమైనా దేశంలో అంతర్గతంగా ఉబికొచ్చే ఉగ్రవాదాన్ని నివారించగలిగితే, దేశం సమైక్యతాభావనతో సౌభ్రాతృత్వంతో నిలువగలిగితే, ఎటువంటి ఉగ్రవాదాన్నైనా ఛాలెంజ్‌గా ఎదుర్కొని తుదిముట్టించ గలగడం నల్లేరు మీద బండి నడిచినంత తేలికనే చెప్పొచ్చు.
సెల్‌:9948774243

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు