Homeవిశ్లేషణఎటు చూసినా సాగు సంక్షోభమే

ఎటు చూసినా సాగు సంక్షోభమే

- Advertisement -

డా.సూర్యదేవర రామకృష్ణ

ఇప్పుడు ఎక్కడ చూసినా ఎటు చూసినా సాగు సంక్షోభమే. రైతాంగం కష్టపడి పంటలు పండిస్తున్నా ప్రతిఫలం దక్కడం లేదు. దేశ స్థూల సాగుభూమిలో నేటికీ మెజారిటీ భాగం వర్షాధారంగానే సాగువుతోంది. గ్రామీణ జనాభాలో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా శాశ్వత సాగునీటి వసతిని ప్రతి ఎకరాకూ అందించడంలో మనం విఫలమయ్యాము. దేశవ్యాప్తంగా చెరువుల ద్వారా సాగయ్యే భూమి కేవలం 3.1 శాతమేనని అధికారిక గణాంకాలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు చెరువుల ద్వారా నీటి వసతి కల్పనలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సైతం, ఆ అద్భుతమైన వ్యవస్థ కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యం వల్ల బలహీనపడింది. దీని వల్ల రైతులు విధిలేక బోరుబావులపై ఆధారపడటం పెరిగింది. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో, తవ్విన ప్రతి బోరూ ఒక కొత్త అప్పుగా మారి రైతు గుండెల్లో భారాన్ని పెంచుతోంది. నాణ్యమైన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీల ఖర్చులు, దుక్కి ఖర్చులు ఇవన్నీ పంట చేతికి వచ్చి అమ్ముడుపోకముందే రైతు జేబు నుంచి అధిక వడ్డీల అప్పు రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దేశంలో వ్యవసాయాధారిత కుటుంబాల్లో సగానికి పైగా, అంటే దాదాపు 50 శాతానికి పైగా కుటుంబాలు నిరంతరం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయని జాతీయ నమూనా సర్వే సంస్థ వెల్లడించిన నిజాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రుణాలు సకాలంలో అందకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో దళారీలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లక తప్పని అనివార్య పరిస్థితి నెలకొంది. ఇవి పంట పండక ముందే రైతును రుణగ్రస్తుడిగా మారుస్తున్నాయి. రుతుపవనాలు ఆలస్యమైతే ఈ అప్పుల భారం రెట్టింపవుతుంది, ఒకవేళ వర్షం సమృద్ధిగా కురిసి పంట చేతికి వచ్చినా, మార్కెట్‌లో ఆశించిన గిట్టుబాటు ధర లేకపోతే ఆ అప్పు మిగిలిపోతుంది. అన్నదాత నష్టానికి కారణం నిలకడ లేని ప్రకృతి మాత్రమే కాదు. అతడికి అండగా నిలవని ఆర్థిక వ్యవస్థ కూడా అని మనం ఒప్పుకోక తప్పదు. జాతీయ నేర గణాంక సంస్థ చెప్పే చేదు నిజాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రమాద మరణాలు ఆత్మహత్యల నివేదిక దేశంలో సాగు సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. 2023లో దేశవ్యాప్తంగా పది వేల మందికి పైగా రైతులు, నిరుపేద వ్యవసాయ కూలీలు అప్పుల బాధలు భరించలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2024 అంచనా గణాంకాల ప్రకారం ఈ సంఖ్య పది వేలకు పైగానే నమోదైంది. మూడు దశాబ్దాలుగా పరిశీలిస్తే, తొంభైల మధ్య కాలం నుండి ఇప్పటి వరకు లక్షలాది మంది రైతులు ఇదే విధంగా ప్రాణాలు కోల్పోవడం పాలకుల విధానాల వైఫల్యానికి నిదర్శనం. వార్షిక నివేదికల్లో ఈ సంఖ్యలు కొన్నిసార్లు స్వల్పంగా తగ్గుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, సమస్య మూలాలు సజీవంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సంక్షోభానికి కారణాలు మారలేదు, కేవలం రైతుల ఆత్మఘోష రూపాలు మాత్రమే మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుకు రక్షణ కవచంగా నిలుస్తుందని ప్రచారం చేసినా, క్షేత్రస్థాయిలో దీని అమలు తీరు గందరగోళంగా మారింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు నిధుల వాటాను సకాలంలో చెల్లించకపోవడంతో ఈ పథకం నుంచి వైదొలగడం, ఫలితంగా కోట్లాది మంది రైతులకు బీమా రక్షణ కరవవడం నిత్యకృత్యమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా, పంట నష్టం అంచనా కోసం ఇప్పటికీ పాతకాలపు సంప్రదాయ పంట కోత ప్రయోగాలపైనే ఆధారపడుతున్నారు. క్లెయిమ్ చెల్లింపుల్లో జరుగుతున్న విపరీతమైన జాప్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఇటీవల 21 రోజుల్లోపు సమస్యలను పరిష్కరించాలని, ఆలస్యమైతే 12 శాతం వడ్డీ చెల్లించాలన్న కొత్త నిబంధన తెచ్చినప్పటికీ, ఇది ఆచరణలో ఎంతవరకు అమలవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. బీమా అంటే రైతుకు కొండంత భరోసా కావాలి కానీ రైతులకు ఇది మరో కాగితాల ఫైలు, ముగింపు లేని నిరీక్షణగా మిగిలిపోతోంది.
అందరికీ అందని కనీస మద్దతు ధర
పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం ఒక్కటే ప్రభుత్వాల బాధ్యత కాదు దానికి ఖచ్చితమైన కొనుగోలు హామీ, చట్టబద్ధమైన రక్షణ తోడైనప్పుడే దానికి విలువ. ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన సమగ్ర ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభం కలిపి ధర నిర్ణయించాలనే సూత్రానికి, ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ధరల నిర్ణయానికి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత అంతరం కొనసాగుతోంది. ఒకవేళ మద్దతు ధర ప్రకటించినా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు అన్ని రకాల పంటలను, అన్ని ప్రాంతాల్లో సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో, దళారుల మాయాజాలంలో చిక్కుకుని రైతు తన కష్టార్జితాన్ని కోల్పోతున్నాడు. అంటే వాతావరణం అనుకూలించి, పంట విరివిగా పండినా, మార్కెట్ వ్యవస్థ కరుణించకపోతే రైతుకు మిగిలేది శూన్యమేనని రుజువవుతోంది.
చిన్న కమతాలు ` పెద్ద సవాళ్లు
భూమి శకలీకరణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న నిశ్శబ్ద శత్రువు. తరతరాలుగా కుటుంబాలలో జరుగుతున్న భూ విభజనల వల్ల, సగటు కమత పరిమాణం తగ్గిపోతూ వస్తోంది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక యాంత్రీకరణ భారంగా మారడం, స్కేల్ ఎకానమీ ప్రయోజనాలు దక్కకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, వడగళ్ల వానలు, సుదీర్ఘకాల కరవులు సంభవిస్తుండటం ఈ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. సెల్ : 9490754169

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు